వెండి గ్లాసు
- murthydeviv
- Apr 26
- 3 min read
వుదయం పూట కాఫీ తాగుతూ పేపర్ చూడటం ఒక అలవాటు. మొదట్లో ఏమీ వుండేది కాదు కాఫీ తో పాటు శ్రీవారికి పేపర్ ఇవ్వడం కూడా ఆరోజుల్లో ఒక మర్యాద లాగా వుండేది. ఇవ్వక పోతే ఇంకా పేపర్ రాలేదా అంటూ వచ్చే ప్రశ్న కన్నా రెండూ ఒకే సారి ఇస్తే పనీ అయిపోతుంది కదా. ఇప్పుడు అయితే టీవీ రిమోట్ కానీ సెల్ ఫోన్ ఉంటే చాలు. ఇంతకీ నాకూ ఈ పేపర్ తిరగ వేసే దురలవాటు ఎపుడు అయిందో గుర్తు లేదు కానీ. ఒకసారి ఆ భయంకర వార్తలు , నగలు అన్నీ చూసేసి టైమ్ వేస్ట్ అనుకుంటూ లేచి పనిలోకి వెళ్ళటం. ఈ రోజు మా కుక్ కి వంట చెప్తూ ఉంటే ఈ రోజు బంగారం రేటు చూసారా అన్నది. అదేమన్నా కందిపప్పా రోజూ రేటు చూడటానికి, మరలా ఆవిడే అన్నది లక్ష రూపాయల అండి అన్నది. వెండి కూడా బాగా పెరిగి పోయింది అండి అన్నది. ఓహో అంటూ ఇప్పుడు మనం ఏమీ కొనటం లేదు కదా. అన్నాను అక్షయ తృతీయ వస్తుంది కదా ఏదో ఒకటి కొనాలి కదా అన్నది. నాకు అలవాటు లేదులే అంటూ వచ్చేసాను. కానీ నిజానికి ఎంత రేట్లు పెరిగినా షాపులు కూడా అలాగే పెరుగుతూ ఉన్నాయి. చూసినప్పుడు ఎవరు కొంటారో అనుకుంటాను. ఒక నాలుగేళ్ల క్రితం అనుకుంటా నాకు తెలిసిన వెండి షాపు కు వెళ్ళాను ఎదో గిఫ్ట్ కోసం. అక్కడ స్టీల్ ట్రే లాగా ఒక వంద పైన వుంటాయి పేర్చి పెట్టాడు ఏమిటి అవీ అని అడిగితే పాత సి ఎం గారింట్లో ఫంక్షన్ కు చీరెలు అవీ పెట్టీ ఇస్తారుట ఇపుడు వచ్చి తీసుకొని వెళ్తారు అన్నాడు. పూర్వం రోజుల్లో అయితే ఎంత డబ్బు ఉన్న వాళ్ళు అయినా వెండి మరచెంబు పూజ పాత్ర మహా అయితే వెండి చిన్న బిందె వుండేది. పెళ్ళిళ్ళు లో కూడా వెండి గ్లాసు లేదా గిన్నె లు చదివించే వారు. వెండి సోప్ బాక్స్ లు కూడా వుండేవి. మా ఇంట్లో అయితే పండగ రోజున వెండి గిన్నె ల్లో పరమాన్నం వేసి ఇచ్చేది మా అమ్మ గారు. ఆ గిన్నె ల కోసం చిన్నదా పెద్దదా అని ఒక పోటీ వుండేది. నాకు స్వీట్ అంత ఇష్టం వుండేది కాదు, సో చిన్న గిన్నె తో హ్యాపీ. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం వెండి సోపు బాక్స్ ఎందుకూ అని. ఆడపిల్లలు పెళ్లి లో వియ్యపు రాలికి వెండి సోప్ బాక్స్ ఇచ్చే వారు. ఆరోజుల్లో బాత్ రూమ్ లు బయటకు వుండేవి వీళ్లు ఈ సబ్బు పెట్టె ఎలా పెడతారు అని అనుకునే దాన్ని. తర్వాత మా అమ్మ గారు పెళ్లి లో అలా ఇవ్వటం ఒక హోదా అని చెప్పారు. ఇంక అసలు హోదా అల్లుడు గారికి వెండి గ్లాసు లో కాఫీ ఇవ్వటం పాపం ఆ మానవుడు ఎలా తాగుతాడు అనే ఆలోచన లేదు హోదా కోసం ఇచ్చేయ్యటమే. నా చిన్నతనంలో మా ఇంట్లో మా కజిన్స్ కి పెళ్ళయిన కొత్తలో చూసాను ఆ బావగార్ల అవస్త చేయి కాలకుండా, నోరు కాల కుండా కాఫీ తాగాలి. వాళ్ళు కూడా బహుశా వెండి గ్లాసు లో తాగటం అల్లుడు హోదా అనుకునే వారేమో అలాగే కథాకళి చేసే వారు. ఆరోజుల్లో అల్లుళ్ళు కు చేసే మర్యాదలు విచిత్రంగా వుండేవి. వంట వడ్డన అంతా స్పెషల్ గా ఉండేది. నా పెళ్ళి అయ్యాక మా అమ్మ గారు షరా మామూలుగా వెండి గ్లాసు లో కాఫీ ఇచ్చింది.నేను వద్దు లే అంటూ స్టీలు గ్లాసు లో ఇచ్చాను పాపం మా అమ్మ గారు నీదంతా విడ్డూరం అని విసుక్కున్నది. నాకు అప్పటికీ ఇంకా కాఫీ తాగడం అలవాటు లేదు. మావారు ఎదురుగా వున్న మా అన్నయ్య లతో కబుర్లు చెపుతూ సిగరెట్ తాగుతూ ఆ కాఫీ పూర్తిగా చల్లగా అయ్యాక తాగారు. కాఫీ ఇలా కూడా తాగుతారా అనుకుంటూ మర్నాడు హోదా కోసం వెండి గ్లాసు లో కాఫీ ఇస్తూ చల్లగా అయ్యాక తాగండి అంటూ చెప్పాను. పెళ్ళిళ్ళ లో వెండి బొట్టు పెట్టెలు అని కూడా ఇచ్చే వారు. నేనూ సరదాగా ఒకటి కొని కొన్నాళ్లు దేవుడు విగ్రహం లు పెట్టాను కాని పండగ కు అవి తెల్లగా తోమటం ఒక ప్రాబ్లెమ్, అందుకుని అది సరదాగా డ్రెస్సింగ్ టేబుల్ మీద కు చేరింది. ఇపుడు అయితే ఎన్నో రకాల వెండి వస్తువులు చూస్తూ ఉంటే ముచ్చట గావుంటాయి కానీ ఎంతవరకు ఉప యోగం ఉందో తెలియదు. మా అమ్మాయి ల చిన్న పిల్లలు గా ఉన్నప్పుడు జడ కుచ్చులు కొన్నాను. వాళ్ళు పండగ లకు వాటికి పెట్టుకునే వారు. ఇపుడు నాకు ముగ్గురు మనవరాళ్లు ఉన్నా ఒక్కరూ జడ వేసుకోరు. జుట్టు విరబోసుకుని ఒక క్లిప్ పెడతారు. శ్రావణ మాసంలో అమ్మ వారికి జడ వేయటం మరలా బీరువా లో పెట్టటం. వున్న నగలు పెట్టుకుంటే చాలు. ఇంక మనకు బంగారం వెండి రేటు గురించి ఆలోచించడం ఎందుకు. కానీ ఇప్పటికీ తేలని సందేహం వెండి సోప్ బాక్స్ ఎందుకూ అనీ, ఎంతయినా బొట్టు పెట్టీ లాగా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టలేము, చిల్లర వేయటానికి మనసు వప్పదు. కాకపోతే ఘుమ ఘుమ లా డే సబ్బు ఒకటి పెట్టీ బీరువా లో పెట్టచ్చు కదా
వెండి గ్లాస్ లో కాఫీ ఇచ్చేటప్పుడు తాగటానికి వీలుగా చల్లార్చి ఇస్తారనుకుంటాను . నాకు ఎవరూ వెండి గ్లాస్ లో కాఫీ ఇవ్వలేదు అనుకోండి . వెండి కుంకుమ భరిణెలు ఇవ్వటం చూశాగానీ వెండి సోప్ బాక్సులు చూడలేదు . పోస్ట్ బాగుంది .