రూట్స్
- murthydeviv
- Apr 4
- 2 min read
Updated: Apr 6
ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది. చిన్నప్పుడు స్కూల్ లో నేర్చుకున్నాం కదా, మనం భారతీయులం మనం అంతా అన్నదమ్ములం అంటూ చెప్పు కొనే వాళ్ళం కదా. అందుకని ఈ విషయాన్ని రోజూ మనసుకు పట్టించు కోవటం అన మాట. ఒక ముప్పయి, నలభై ఏళ్ల క్రితం మాట మేము తెనాలి వెళ్ళాము. అక్కడ మాకు తెలిసిన పండితుడు ఒక శాస్త్రి గారు వుండేవారు. మేము వెళ్ళిన రోజు ఆయన చాలా బిజీగా గా ఉన్నారు. మమ్మల్ని సాయంత్రానికి రమ్మన్నారు. అలాగే అనుకుంటా మేమూ కాసేపు ఊర్లో కాలక్షేపం చేసి సాయంకాలం వెళ్ళాము ఉదయం ఆయన హడావిడికి కారణం చెప్పగానే అప్పట్లో చాలా ఆశర్యం అయింది. విషయం ఏమిటంటే ఐదు, ఆరు నెలలు ప్రెగ్నెన్సీలో అమెరికాకు బంధువులు ఇంటికి వెళ్లి అక్కడ డెలివరీ అయ్యాక వస్తారుట. ఆయన వెళ్ళటానికి, డెలివరీ కి ముహూర్తాలు పెడుతున్నారుట. పెట్టను అని చెప్పటానికి అందరూ బాగా పరిచయము ఉన్నవాళ్ళు అని చెప్పారు. ఈ విషయము ఇపుడు ట్రంప్ గారికి తెలిస్తే సిటిజన్స్ అందరూ యు స్ రండి, మిగతా వాళ్ళు వెళ్ళండి అంటాడేమో. అసలు ఈ విషయం గురించి ఎందుకు రాస్తున్నాను అంటే నిన్న ఫేస్ బుక్ లో ఎవరో ఏడు తరాలు బుక్ గురించి పెట్టారు. హేలీ గారి రూట్స్ నవల కి అనువాదం. ఇంగ్లీషులో, తెలుగులో చదివాను, చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ఇపుడు అయితే చదవ లేను. పెద్ద వాళ్ళం అయ్యాక అంత విషాదం భరించ లేము అనిపిస్తుంది. ఆ నవల ను బేస్ చేసుకుని పులికంటి కృష్ణా రెడ్డి గారు అనుకుంటాను ఒక కథ రాసారు. ఆ కథ చదివి చాలా ఏళ్ళు అయింది కొన్ని విషయాలు లేదా కథలు, సంఘటనలు మరచి పోలేము. అపుడపుడూ గుర్తు వస్తుంటాయి. ఆయన రాయల సీమ కు చెందిన వారు ట. ఆ కథ లో హీరో అపుడే కాలేజీ కి వస్తాడు. యు ఎస్ సిటిజెన్. ఆ అబ్బాయి కూడా రూట్స్ నవల చదివి తన రూట్స్ తెలుసుకోవాలని అనుకుంటాడు. ఎపుడూ ఇండియా వెళ్ళినా వాళ్ళ అమ్మమ్మ గారింటికి వరంగల్ లో వుండటం తప్పితే తండ్రి తరపు వాళ్ళ గురించి ఏమీ తెలియదు. తండ్రిని అడిగితే ఏదో తిరుపతి దగ్గర ఏదో పల్లెటూరు, వూరు పేరు మాత్రం చెప్తాడు. ఎక్కువ మాట్లాడటానికి ఇష్ట పడడు. ఆయన అత్త గారు వాళ్లు వున్న వాళ్ళు కావటం తో , ఆయన వెళ్ళి చూడటమే తప్పితే భార్య పిల్లలు ను తీసుకుని వెళ్ళ లేదు. అసలు ఈ మధ్య ఆయనే స్వదేశం వెళ్ళి చాలా ఏళ్ళు అయిపోయింది. మన కథ లో యంగ్ హీరో కదా చాలా ఉత్సాహంగా ఇండియా వచ్చి వరంగల్ నుండి తిరుపతి వెళ్తానని బయలు దేరుతాడు. తిరుపతి బస్ స్టాండ్ లో వూరి పేరు చెప్పి ఆ ఊరి బస్ ఎక్కుతాడు. బస్ లోనే ఒకరిద్దరు అతని భాష అదీ చూస్తూ ఎవరింటికీ అని అడుగుతారు. మన హీరో కి పేరు కూడా తెలియదు కదా తన తండ్రి పేరు చెప్పి ఆ ఊరు చూడ్డానికి వెళ్ళుతున్నాను అని చెప్తాడు. ఈ కథ రాసిన రోజుల్లో ఇంకా మానవ సంబంధాలు బాగున్నాయి అనుకుంటాను, బస్ లో వాళ్లు ఆ అబ్బాయి నీ గుర్తు పట్టి ప లా న ఆయన మనవడి వా అంటూ ప్రేమ గా మాట్లాడుతూ, ఆ ఊరు లో దిగగానే తాత గారి ఇంటి దగ్గర దింపి వెళతారు. బామ్మ గారు తాత గారు మన హీరో ను చూసి బ్రహ్మానంద పడతారు. ఆ ఊర్లో వున్న మేనత్త కూడా కూడా వచ్చి మన హీరో నీ ఆప్యాయంగా మాట్లాడుతూ రక రకాలు వంటలు చేసి తినిపిస్తుంది. వూరు లో వాళ్ళు కూడా వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంటే వచ్చీ రాని తెలుగులో అతను సమాధానం చెప్తాడు. అలా మన హీరో సంతోషము గా తిరిగి వెళ్తాడు. ఇది కథ అయితే ఆరోజులకి ఇప్పటికీ చాలా తేడాలు ఉన్నాయి కదా చాలా మంది ఫ్యామిలీస్ అక్కడే ఉంటున్నారు.సో బంధువుల కూడా అక్కడే కలుసుకుంటూ వుంటారు కాబట్టి మూలాల కోసం వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు అనుకుంటాను రూట్స్ నవల తో ఇదంతా గుర్తు వచ్చింది. ఈ కథ రాసింది మధురాంతక రాజారామ్ గారు ట,నేను పొరపాటున వేరే రచయిత పేరు రాసాను. ఈ కథ దూరదర్శన్ లో డ్రామా లాగా వచ్చిందిట యూ ట్యూబ్ లో వుంటుంది అనుకుంటాను.
మీరు చెప్పిన కధ వ్రాసిన వాళ్ళు నాకిష్టమయిన రచయిత మధురాంతకం రాజారామ్ .