top of page
Search

పెళ్ళి పెట్టె

  • murthydeviv
  • Apr 7
  • 4 min read

మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో లేకపోతే, మేనమామ గారు కూర్చుని పురోహితుడు అడిగినప్పుడు ఆ పెట్టె లో నుండి కావలసిన వాటిని తీసి ఇస్తూ వుండేవారు. కొత్త దంపతులు తలంబ్రాలు కార్యక్రమంలో పిల్లలు వెనక చేరినపుడు ఆయన వీళ్ల ధాటికి తట్టుకోలేక కాస్త పక్కకు తప్పుకునే వారు. ఈ రోజుల్లో అయితే ఆ వీడియో వాడు, ఫోటోగ్రాఫర్ డిసైడ్ చేస్తారు. పెట్ట ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ కూర్చోవాలి అని ఆయనకు, ఈ పిల్లలు ఎలానుంచోవాలి అంటూ కుస్తీ పట్టిస్తాడు. అసలు విషయం కాకుండా, మరలా విడియో వాళ్ళు సంగతి ఎందుకు లెండి. పెళ్ళి కూతురు ను చేసిన రోజో, ఆ రెండో రోజో ఆ పెట్టె కు పసుపు కుంకుమ పెట్టీ పెళ్ళి కూతురు చేత నమస్కారం చేయించి,ఒక దేముడు ఫోటో పెట్టించి మిగిలిన సామాను సర్ది పెట్టే వారు. పాత రోజుల్లో అయితే ఇంట్లోనే పెళ్ళి అయ్యేవి. ఇపుడు మండపము లో కదా, పెళ్ళి కూతురు తో పాటు ఆ పెట్టె కూడా మండపము కు పంపే వారు. ఈ రోజుల్లో ఇలా చేస్తున్నారో లేదో తెలియదు. నా పెళ్ళి అపుడు కూడా మా అమ్మ అచ్చి వచ్చిన పెట్టె అంటూ ఒక పెద్ద పెట్టె లో సర్దింది. ఆ రోజుల్లో అమ్మా వాళ్ళు షాపింగు అని బయటకు వెళ్లే వాళ్ళు కాదు మా అమ్మ అయితే అసలు వెళ్ళేది కాదు. మేము ఏదో పని మీద బజారు వెళుతుంటే ఒక పెట్టె తెమ్మని ఆర్డర్ వేసింది. నా కోసం అని చెప్పింది. అబ్బ నాకు ఈ పెట్టె వద్దు నేను సూట్ కేసు కొనుక్కుంటాను అని మెల్లగా నస పెట్టాను. ఆ ఊర్లో దొరకవు కాబట్టి అన్నయ్య నీ తెమ్మంటాను అని చెప్పాను. తర్వాత మీ అన్నయ్య నీ, మీ వారి నీ అడిగి ఏదయినా కొనుక్కో. ఇపుడు మాత్రం పెట్టె తీసుకునిరా అని ఆర్డర్ వేసింది. ఆ రోజుల్లో పెద్దవాళ్ళ దగ్గర ఎక్కువ వాదించడానికి వీలు లేదు. నోరు మూసుకుని చేయాలి. సో నేనూ, మా వదిన వెళ్లి మా షాపింగ్ అయ్యాక ఒక పెట్టె కూడా తెచ్చాము. అమ్మ అందులోనే మిగిలిన సామాను అంతా సర్దిపెట్టింది. మా అమ్మ గారికి సర్దడం అంటే ఎంత ఇష్టం అంటే తొంబై ఏళ్ల వయసులో కూడా తన చీరలు,, టేబుల్ మీద ఉండే మాత్ర డబ్బా తో సహా నీట్ గా దుమ్ము లేకుండా వుండాలి. మరలా పెట్టె దగ్గరకు వద్దాం. అటు అన్నయ్య తో గానీ, ఇటు మావారు తో గానీ నా సూట్ కేసు కోరిక తీరకుండానే పెళ్ళి అయ్యాక ఢిల్లీ ప్రయాణం అయ్యాను. కొత్త సంసారము కదా, వెళ్ళగానే ఏం కొంటారు అంటూ నా కొత్త పెట్టె లో ఇంకో పెద్ద పెట్టె లో సామాన్లు సర్ది పెట్టింది.మా అమ్మ గారు. మీ వారు సూట్ కేసు తీసుకుని రాలేదా అని మా వదిన జోక్ వేసింది. ఇంకొక ఎనిమిది నెలల తర్వాత మా ఆడపడుచు పెళ్ళి అని ఢిల్లీ నుంచి ఆంధ్రకు ప్రయాణము అయ్యాము. పెళ్ళి లో పనికి వస్తుంది నా సూట్కేస్ తో నీ పెద్ద పెట్టె కూడా తీసుకుని వెళ్దామా అని మా వారి మర్యాద తో కూడిన ఆర్డర్. ఇంక మరలా నేను నా ట్రంక్ పెట్టె తో ప్రయాణము మనలో మన మాట, ఈ పెట్టె తో ఉపయోగము ఏమిటంటే స్టేషన్ లో కూడా మనం సీటు వెతుక్కోకుండా ఆ పెట్టె మీద కూర్చోవచ్చు. అలా నా పెట్టె తో మొదటి పెళ్ళి చేశాము. తర్వాత మా పాప పుట్టిన పుడు మా వారు నా సూట్కేస్ కోరిక తీర్చాలని తన సూట్కేస్ వదిలి వెళ్ళారు. నేను రెండునెలల తర్వాత మా పెద్దమ్మ తో డిల్లీ ప్రయాణము అయ్యాను. మా అమ్మ గారు పాపాయి కి వచ్చిన ప్రెజెంట్స్, స్వీట్స్, అన్నీ ఇంకో పెద్ద పెట్టె లో సర్ది, ఆ సూట్కేస్ లో ఇవ్వన్నీ ఎలా పడతాయి , ఈ సారి కి ఈ పెట్టె తీసుకుని వెళ్ళు. ఇంకోసారి పెద్ద సూట్కేస్ కొనుక్కొని వెళ్దువుగాని అంటూ ఉంటే, మా వదిన నీ సూట్కేస్ కోరిక ఎపుడు తీరుతుందో అన్నది. ఆ ప్రయాణంలో ఆ పెట్టె బాగానే వుపయోగ పడింది. పాపాయిని ఎత్తుకుని మా పెద్దమ్మ పెట్టె మీద సింహాసనం లాగా కూర్చునేది. మొత్తానికే మా మూడు ట్రంక్ పెట్టె లె కాకుండా ఇంకో పెట్టె తో డిల్లీ వదిలి హైదరాబాద్ చేరాము. డిల్లీ లో వున్నపుడు కూడా, ఆ పెట్టె ల మీద ఒక చిన్న పరుపు లాంటిది వేసి దివాన్ లాగా చేశాను. హైదరాబాద్ రాగానే ఒక మూడు నెలల కే మా చిన్న ఆడపడుచు పెళ్ళి చేసాము. తనకు బేగం బజార్ వెళ్ళి ఒక కొత్త పెట్టె కొన్నాము. నా పెట్టె లో పెళ్ళి సామాన్లు సర్దడం, అన్నీ పురోహితుడు కి అందించటం అన్నీ నేనే, మా వారికి బాబాయిలులేరు మామయ్య వున్నా పెద్ద వారు హైదరాబాద్ రాలేదు. యింకో రెండు నెలలు కు మా అన్నయ్య పెళ్ళి, ఆడ పెళ్ళి వారు మా కోరిక మేరకు వేరే ఊరినుండి వచ్చి మా ఇంట్లో నే పెళ్ళి చేశారు అందువల్ల మేము మగ పెళ్ళి వారమైనా అన్నీ నిర్వహించాము. మా అమ్మ గారు మా ఊరు నుండి పెట్టె తీసుకుని రాలేదు నా పెట్టె కే హోదా పెంచి మీ ఆడపడుచులు పెళ్ళిళ్ళ లో వాడావు కదా అందులోనే నీవు, వదిన సర్దండి అని నా పెట్టె ను పెళ్ళి పెట్టె చేసింది. మా చెల్లెలు కాలేజ్ రోజుల్లో ఇంట్లో పని చేయవు కానీ బయటికి వెళ్ళితే ఫంక్షన్స్ లో పని చేస్తావు అనేది. ఈ హైదరాబాద్ వచ్చాకా ఇంట్లో, పెళ్ళిళ్ళ లో కూడా పని చేస్తూ ఉండటమే పని . అలా ఈవెంట్ మానేజర్ అనే మాట కు అర్థం తెలియని రోజుల్లో తెలిసిన వాళ్లకు మ్యాచస్ చెప్తూ, పెళ్ళిళ్ళు కుదురుస్తూ ఎన్ని పెళ్ళిళ్ళు చేశామో గుర్తు లేదు. నా పెళ్ళి పెట్టె మాత్రం చాలా మంచి పేరు తెచ్చుకుంది. చాలా మంది బంధువులు కావాలని అడిగి తీసుకున్నారు. ఇపుడు నేనే నా పెళ్ళి పెట్టె నీ గౌరవిస్తూ నా కూతుర్లకు, కోడలికి ఆ పెట్టె గురించి చెప్పి వాళ్ళ పిల్లల పెళ్లికి వాడమని చెపుతున్నాను. నా సూట్కేస్ కోరిక తీర్చాలని మావారు సింగపూర్ నుండి కంప్యూటర్స్, లేక ప్రింటర్స్ అనుకుంటా అప్పుడు అంత పెద్దవి వుండే వెమో నాకు తెలియదు. ఈ హైదరాబాద్ వచ్చాకా చదవేస్తే ఉన్న మతిపోయింది అని మా అమ్మ గారు అపుడపుడూ తిడుతూ వుండేది అలా ఒక్కో సారి నేనూ గ్రాడ్యుయేట్ నే అని మరిచి పోతూ ఉంటాను. ఇంతకీ పెద్ద పెద్ద సూట్కేస్ లు తెచ్చారు చాలా పెళ్ళిళ్ళ లో వాడా ము కొసమెరుపు ఏమిటంటే ఫస్ట్ టైమ్ యు ఎస్ వెళ్ళినపుడు ఆ బెల్ట్ మీద ఆ సూట్కేస్ లు తిరుగుతూ ఉంటే కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. ఆ సూట్కేస్ కు ఏదో పాత చీర ముక్కలు కట్టినా గిర్రున తిరుగుతూ ఉంటే ఎదో గా అనిపించింది. సరే నల్లని వాడు పద్మ నయనం ల వాడు నా మొర ఆలకించి హెల్ప్ అంటూ వాడు అన్న మాట కు నేనూ మూగ దానిలాగా ఏవో సైగ లతో నా సూట్కేస్ లు తీయించాను. అపుడు మాత్రము నా ట్రంక్ పెట్టె లను చాలా మిస్ అయ్యాను. తెచ్చుకుని ఉంటే హాయిగా మా పెద్దమ్మ లాగా వేసుకొని కూర్చో వచ్చు, గుర్తు పెట్టుకోవటం చాలా ఈజీ అనుకున్నాను.మా చిన్న వదిన అయితే నా పెళ్ళి పెట్టె ను వాళ్ళింట్లో నే ఉంచుకుని రెండు సార్లు రంగులు వేయించి గౌరవించింది తన ఇద్దరు కొడుకులకు పెళ్ళి అయితే గానీ ఇవ్వనంది. ఆ ఇద్దరూ అమెరికా నుండి ఇండియా వచ్చి సెటిల్ అయితే గానీ చేసుకోమని చెప్పారు. మా వదిన, నేనూ కలసి చేసిన పూజల వల్ల ఇద్దరూ ఇండియా వచ్చి సెటిల్ ఆయి పెళ్ళి చేసుకున్నారు, నా పెట్టె మరలా మా ఇంటికి వచ్చింది.

 
 
 

Recent Posts

See All
అమృత హస్తం

ఈ మధ్య మా కోడలు పుట్టిన రోజున మా పిల్లలు హోటల్ కు డిన్నర్ కు తీసుకుని వెళ్ళారు. హోటల్ పేరు ఎర్ర కారం. గుంటూరు కారం సినిమా లాగానే ఆ పేరుకు...

 
 
 
రూట్స్

ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది....

 
 
 
గీతా జ్ఞానం

ఈ టైటిల్ చూసి నేను భగవద్గీత గురించి చెప్తాను అనుకోవద్దు. ఆ గ్రంథం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అనుకుంటాను.మా అత్తగారు మార్గశిర మాసము...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page