top of page
Search

తాత గారి చలువ పందిరి

  • murthydeviv
  • Jan 6, 2025
  • 2 min read

తాత గారి పందిరి ఏమిటో అనుకుంటారేమో. ఏదో విశేషము వుండి వుంటుంది కదా. అందుకే ఆ జ్ఞాపకాల పందిరి మీతొ పంచుకోవాలనే కదా. అసలు ఇపుడు మీ పిల్లలకు పందిరి అంటే ఏమిటీ అని అడగండి. షామియానా అంటే చెపుతారేమో కానీ పందిరి అంటే వాళ్ళకు తెలియదు. మా తాత గారికి ముందు ఒక పెంకుటిల్లు వుండేది. తర్వాత ఆయన మేడ కట్టించారు. పెంకుటిల్లు ముందు వాకిట్లో ఎపుడూ తాటాకులతో ఒక పందిరి వేసి వుండేది. నాకు లీలగా గుర్తుంది తాతగారు ఆ పాత ఇంట్లో ఒక పెద్ద హాలు వుండేది. అక్కడ కిటికీ ప్రక్కనే ఆయన ఎపుడూ సోఫా లాంటి దాని మీద కూర్చునే వారు. ఆ ఇంటి బయట అరుగులు ఉండటం ఆపుడు సర్వ సామాన్యం. ప్రతి ఇంటికి తప్పక అరుగులు వుండేవి. ఆ అరుగులు అందరికీ ఎన్నివిధాల ఉపయోగ పడ్డాయో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజుల్లో రోజూ ఒక బ్రాహ్మణుడు వచ్చి రోజూ తిథి వారనక్షత్రాలు చెప్పేవారు. అయనకు బియ్యం లేదా డబ్బులు ఇచ్చేవారు. ఆ వచ్చిన బ్రాహ్మణుడు కాసేపు ఆ అరుగు మీద కూర్చుని సేద తీరాక ఇచ్చిన మజ్జిగ తాగి వెళ్ళేవారు. ఆరోజుల్లో కాఫీ నిషిద్ధము. సాయంకాలం తాతగారు ఆ అరుగు మీద కూర్చుని పురాణాలు చదివించుకుని వినేవారు. తప్పకుండా ఇద్దరు ముగ్గురు పురోహితులు వచ్చేవారు. వాళ్లు ఏ విషయం అంటే పుట్టిన పిల్లల జాతకాలు, పెళ్ళిళ్ళ కు జాతకాలు, ముహూర్తాలు అన్నిటికీ ఆ అరుగు కేంద్ర స్థానం. సాయంకాలం అవగానే పాలేరు ఒక తివాచీ ఆ అరుగు మీద పరిచేవాడు. మేము పిల్లలం అక్కడే ఆడుకునే వాళ్ళం. ఇంక ప్రతి ఆదివారం బిచ్చగాళ్ళకు బియ్యము దానం చేయడం ఒక అలవాటు వుండేది. తెల్లవారేటప్పటికి ఆ వీధి అంతా వాళ్ళతో నిండి పోయేది. ఒక్కొక్క ఆదివారం అన్నయ్యలు కానీ మేము కానీ అందరికీ వరుసగా బియ్యము వేయాలి. ఆ కార్యక్రమము మధ్యాహ్నం 12గంటల వరకూ సాగేది. తర్వాత తాత గారు పెద్దవారు అయ్యాక మేడ లోకి మారిపోయారు. ఆపుడు మా అరుగులు పందిరి అందరికి అందుాటులోకి వచ్చింది. ఎండ వేళ చుట్టుపక్కల వాళ్ళు పందిరి క్రింద అరుగుల మీద విశ్రమించే వాళ్ళు. సాయంత్రం అయ్యేటప్పటికి మేము అక్కడ ఎన్ని ఆటలు ఆడే వాళ్ళమో, నాలుగు స్తంభాల ఆట, అరుగు మీద నుంచి క్రిందికి దూకటం,, తొక్కుడుబిళ్ళాట, ఇవే కాకుండా అరుగుల మీద చింతపిక్కలు, గవ్వలతో ఆడే ఆటలు, ఇపుడు అయితే నాకు కొన్ని ఆటలు పేర్లు కూడ గుర్తులేవు. వీధి లోని పిల్లలు అందరూ అక్కడే వుండేవారు.రాత్రి అయితే ఆ వీధి లోనీ పిల్లలు అందరూ ఆ అరుగులు మీద చాపలు వేసికొని లాంధర్లు పెట్టుకొని చదువుకునేవారు. కొంతమంది టీచర్లు ఆ అరుగుల మీద ట్యూషన్లు చెప్పేవారు. రెండు మూడు నెలలకు ఒకసారి పందిరి తాటాకుల తో మరల కప్పించే వారు. ఇంతేకాదు ఎవరింట్లో పెళ్ళి అయినా పదహారు రోజుల పండగ నాడు ఆ పందిరి గుంజలకు పసుపు కుంకుమ పెట్టీ పాలకులలో పెరిగిన నవ ధాన్య ల తో పెరిగిన మొక్కలను ఆ గుంజల దగ్గర పెట్టేవాళ్ళు. అలాగా ఆ పందిరి, ఆ అరుగులు మాకే కాకుండా అందరికీ ఉపయోగపడేవి. తాతగారు వెళ్ళిపోయాక కూడా నాన్న గారు ఆ పందిరిని, ఆరుగులు ను అలాగే ఉంచేవారు. ఆ అరుగు మీద చదువుకొని తర్వాత ఐ ఐ టీ లో చదివి ఇ. సి. యై ల్ వుద్యోగం చేస్తూ వున్నా ఎపుడు కలిసినా ఆ అరుగు ఆ ఆటలుగురించి తలచుకునేవాడు. మా కొత్త మేడ కు కూడా తాతగారు అరుగుల కట్టించారు. మా నాయనమ్మ ఆ అరుగులు మీద కూర్చుని ఆ వీథి లో వెళ్లే పిల్లలకు పండ్లు పెద్దవాళ్ళకు పసుపు కుంకుమ పూలు ఇస్తూ వుండేది. అలా మా తాతగారు ఉ ధార స్వభావము తో వేయించిన పందిరి చలువ పందిరి కదా a చలువ వలనే ఆయన సంతతి అంతా సంతోషముగా వున్నారని అని అనుకుంటాను. తాతగారి కి నమస్కారములతో.

 
 
 

Recent Posts

See All
పెళ్లి సంగీతం

ఈ రోజు ఉదయాన్నే ఎమ్ ఎస్ అమ్మ పాడిన అన్నమాచార్య గీతాలు వెతుకు తుంటె పూరయ మమ కామమ్ కీర్తన కనిపించింది. ఆ కీర్తన కృష్ణ లీలా తరంగిణి లో వింటుంటే చాలా ఆనందం తో పాటు అనేక పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్

 
 
 
బ్లాక్ అండ్ వైట్ టీ వీ

రోజూ లాగే లంచ్ అవగానే శయనించి , పాత రోజుల్లో అయితే నిద్ర పట్టిందాక ఏ పత్రిక, ప్రభ తిరగేసి కునుకు తీసే వాళ్ళం ఇప్పుడు అలాకాదు, మన అరచేతి స్వర్గం లో ముఖ పుస్తకం చూస్తే కాని నిద్ర పట్టదు ఏమయినా

 
 
 
మహా నగరం ముచ్చట్లు

ఈ మధ్య అనుకోకుండా రెండు మహా నగరాలు కి వెళ్ళాను. చెన్నై గా మారిపోయిన చెన్న పట్నం తో చిన్నతనం నుండి అనుభందం వుండేది. మా చిన్నతనం లో , మా నాయనమ్మ మా ఇంట్లో ఏ కొత్త వస్తువు తెచ్చినా పట్నం నుంచి మా అబ్బ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page