చూపులు కలిసిన శుభ వేళ
- murthydeviv
- Jul 17
- 4 min read
వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన విషయం. అయితే ఈ రోజుల్లో పెళ్ళి ఒక ప్రహసనం లాగా మారిపోయింది అయితే నేను ఈ రోజుల్లో పెళ్ళి గురించి చెప్పడం లేదు. సాయంత్రం సన్నగా చినుకులు పడుతుంటే మంచి కాఫీ తాగుతూ అలా వరండాలో కూర్చొని మంచి పాటలు వింటూ ఏదో పుస్తకం చదవటం ఇష్టం. అలాగే భమిడిపాటి వారి కథలు చదువుతుంటే పెళ్లి చూపులు గురించి రాసిన కథ కనిపించింది. వెంటనే నా మనసు గతం లోకి వెళ్ళిపోయింది. ఆరోజుల్లో పెళ్లి చూపుల ప్రహసనాలు గుర్తు వచ్చాయి. మరీ పూర్వం రోజుల్లో ఎక్కువగా బంధువులు లోనే పెళ్ళిళ్ళు జరిగేవి. ఆడపిల్లని మరీ దూరం ఇచ్చే వాళ్ళు కాదుట. మా అమ్మ గారు చెప్తూ వుండేవారు. మా తాత గారు మా పెద్దమ్మ కు మేనల్లుడు తో పెళ్ళి నిశ్చయం చేసి వాళ్ళకు కబురు చేశారుట. రోజుల్లోనే మా తాత గారు సబ్ రిజిస్టార్ గా పనిచేసే వారు. ఆ మేన అల్లుడు నీ మా తాతగారే చదివించి ఎక్కడో ఉద్యోగం కూడా ఇప్పించారుట. కారణం తెలియదు కాని ఆ మహానుభావుడు నేను ఈ పెళ్ళి చేసుకోను అని వుత్తరం రాసారుట. మా తాత గారు బ్రిటిష్ హయాంలో సబ్ రిజిస్టార్ మరి ఆయన హోదా ను ఇప్పుడు మనం అంచనా వేసుకోవచ్చు. ఆయన వెంటనే గుంటూరు లో ఏ సి కాలేజ్ కి వెళ్లి ఆ ప్రిన్సిపాల్ గారి తో మీ కాలేజీ లో బుద్దిమంతుడు అయిన అబ్బాయి నీ చెప్ప మన్నారుట.ఆ రోజు న మా తాత గారు సెలెక్ట్ చేసిన అబ్బాయి మా పెద్దనాన్న గారు అయ్యారు. వింటే వింత గా సినిమా కథ లాగా ఉంటుంది. మా పెద్ద నాన్న గారు చాలా పల్లెటూరు ఆ ఊరు వాళ్లందరూ మా పెద్దమ్మ ను చాలా గారాబం గా చూసే వారు ట. మాకు మేనమామ లు లేని కొరత ను మా పెద్ద నాన్న గారు తీర్చారు అంత ప్రేమ గా చూసేవారు. మా పెద్దమ్మ గారు మా మీద విసుక్కోవడం చెస్తే ఆఫీసర్ గారి అమ్మాయి కదా అని జోక్ చేస్తూ వుండేవారు . మా కజిన్స్ కి చాలా మందికి మా ఇంట్లో పెళ్లి చూపులు పెళ్లిళ్ళు జరిగినవి కానీ నాకు అంత బాగా గుర్తు లేవు . ఆరోజుల్లో ఎక్కువ గా బంధువులు మ్యాచస్ చెప్తూ వుండేవారు. నేను కాలేజ్ లో చదువుకునే రోజుల్లోనే మా పెద్ద అన్నయ్య కు చాలా మంది మ్యాచస్ చెప్తూ వుండేవారు. ఒకసారి ఒంగోలు దగ్గర ఏదో పల్లెటూరు లో డాక్టర్ గారి అమ్మాయి, మా అమ్మ, నాన్న గారు ఎందుకో నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. అక్కడ స్టేషన్ కే వస్తాదు లాంటి రైతులు పది పదిహేను మంది కారు తీసుకుని వచ్చారు.ఆ పల్లెటూరు లో పొగాకు పండిస్తారు. నాన్న గారికి కోల్ అమ్మే వ్యాపారం వుండేది. అందుకుని మర్యాద లు ఘనంగా జరుగుతున్నాయి. మొత్తం వూరు అక్కడే ఉన్నట్లు ఉంది .ఆ అమ్మాయి నేనూ మా అమ్మ గారు చాప మీద కూర్చుని ఈ చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ ఉన్నాము మా అమ్మ గారు కూడా అంత మందిలో ఏమి మాట్లాడాలో తెలియక అందరం మౌనం వ్రతము పట్టాము. ఇంక మా అన్నయ్య అయితే ఒక పావు గంట లో లేచి వెళ్ళి వరండా లో కూర్చున్నాడు. అక్కడ సాగిన సంభాషణ లు పొగాకు రేట్లు, కోల్ డీలర్లు కష్టాలు, బ్లాక్ మార్కెట్ వగైరాలు. వాళ్ళు పెట్టిన టిఫిన్స్ తిని ఒక గంట లో బయట పడ్డాము. నేను అయితే ఇంటికి రాగానే మా నాన్న గారితో , అప్పటికే కాలేజ్ లో చదువు తున్నాను కదా నాన్న గారితో మాట్లాడే ధైర్యం వచ్చింది. పెళ్లి చూపుల్లో అమ్మాయిని కూడా కుర్చీలో కూర్చోపెట్టమని చెప్పండి అని చెప్పాను ఆ తర్వాత మా నాన్న గారు అలాగే చేసేవారు. ఇప్పటికీ ఒంగోలు పేరు వినగానే ఆ సంఘటన గుర్తు వస్తుంది. మా వారి స్నేహితుడు, మా బావగారికి క్లాస్మేట్ ఒకాయన ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండేవారు. మీ వారు ఇంటికి వస్తా నంటే ఆ వారం రోజుల్లో ఎపుడో వస్తాడు. మీ బావ గారు మాత్రం ఆ సంవత్సరంలో ఎపుడైనా రావచ్చు అనే వారు .ఆ అలవాటు తు చ తప్పకుండా మావారు పెళ్ళి చూపులకు రెండు సార్లుగా వస్తున్నాము అంటూ టెలిగ్రామ్ లు కానీ మనుషులు మాత్రం రాలేదు . ఒక రోజు టెలిగ్రామ్ గట్రా లేకుండా వచ్చేశారు. అయితే ఆ టైమ్ కి నేను , మా నాన్న గారు గయాబ్ . మా సంగతి తెలిసిన మా పెద్దనాన్న గారు రాత్రి కి వుండేటట్లు గా తీసుకుని వచ్చారు. మా నాన్న గారు ఏ ఊరు వెళ్ళినా రాత్రికి ఇంటికి వచ్చేవారు. ముహూర్తం టైమ్ లు జాతకాలు వగైరా నమ్మకం కలిగిన మనుషులు కాబట్టి ముహూర్తం టైమ్ కి ఒక గంట ముందు వచ్చి వివాహ కార్యక్రమం ముగించారు . ఆ తర్వాత కూడా బారసాల కు మా అన్నయ్య వాళ్ళ పెళ్ళిళ్ళ కు ఆంధ్ర దేశం చేరగానే ఒక ఫోన్ చేసే వారు .ఆ టైమ్ కి వస్తారులే అనీ మా నాన్నగారు సంతోషించే వారు. ఇంక మేము ఆంధ్ర దేశం చేరగానే ఎన్ని పెళ్ళి చూపులు చూపించి ఎన్ని పెళ్ళిళ్ళు చేశామో లెక్క లేదు . అప్పట్లో ఒకరిద్దరు మాత్రం ఏవో లిస్టులు పెట్టుకుని సంబంధాలు చెప్తూ వుండేవారు. మనం వెళ్ళి లిస్టులో మనకు నచ్చినవి రాసుకుని వాళ్ళని ఇన్వైట్ చేయడం మర్యాద లు చేయడం వాళ్ళు జాతకాలు కుదరలేదు అంటే ఇంక నుంచీ ముందే జాతకము లు చూపించాలి.అని శపధాలు చేసుకోవటం. మొదట్లో నాకు స్వీట్స్ చేయడం రాక రవ్వ లడ్డు ఈజీ గా ఉంటుంది అని చేసేదాన్ని.. తర్వాత అచ్చి వచ్చింది అని అదే అలవాటు గా చేయడం, అబ్బ స్వీట్ మార్చవే అని ఎవరయినా అంటే మీరే బజారు నుండి తీసుకుని రండి అనటం. ఒక సారి మా ఫ్రెండ్ వాళ్ళ మరదలికి మా ఇంట్లో పెళ్ళి చూపులు ఆ అబ్బాయి జీన్స్ ప్యాంట్ వేసుకోలేదు అని ఆ అమ్మాయి నస, ఆ అబ్బాయి కొంచెము సన్నగా వున్నాడు. ఈ అమ్మాయి బొద్దు గా ఉంది అని రిజెక్ట్ చేసాడు. ఒకసారి ఒక అబ్బాయి డిల్లీ లో ఉద్యోగం వస్తూనే మా ఇంట్లో చెట్లు అవి చూసి చాలా మురిసి పోయాడు. వెళ్ళేటప్పుడు తనకు చెట్లు ఎక్కటం సరదాగా ఉంటుంది అంటూ జామ పండ్లు కోసుకొని వెళ్ళాడు. మ్యాచ్ కుదరలేదు జామ పండ్లు మిగల్లేదు అని మేమూ నిట్టూర్పులు విడిచా ము. నేనూ మా వదిన ఎప్పుడూ సంబంధాలూ చెప్తూ వుండే వాళ్ళం, అదేదో సరదాగా అనుకుంటారు కానీ మేము అదొక బాధ్యత లాగా చేసే వాళ్ళం. ఎవరయినా కట్న కానుకలు ఎక్కువగా అడిగితే మాకు ఇష్టం ఉండేది కాదు . ఈ రోజుల్లో లాగా ఈవెంట్ మానేజర్ బిజినెస్ పెట్టుకుంటే ఈ పాటికి కోటీశ్వరులు అయిపోయే వాళ్ళం కదా అనుకుంటాం. 2000 ఇయర్ వచ్చేటప్పటికి మ్యాట్రిమోనీ లు వచ్చాయి రిజిస్ట్రేషన్ వగైరాలు, ఒకావిడ పేరు మీద పెట్టిన మ్యాట్రిమోనీ లో ఆరోజుల్లో ఫీస్ పది వేలు పెట్టింది. ఇపుడు ఉందో లేదో తెలియదు గానీ అశోక్ నగర్ లో ఒకావిడ ఒక టెంపుల్ లో ఫ్రీ సర్వీస్ చేసే వారు . మా ఫ్రెండ్స్ ను చాలా మంది నీ అక్కడికి తీసుకుని వెళ్ళాను ఒక సారి మా బంధువులు లోనే అమ్మాయికి మ్యాట్రిమోనీ లో చూసి ఫోన్ చేశాను, నాకు ఇంట్లో పెళ్లి చూపులు అలాంటిది ఇష్టం లేదు ఎక్కడ అయినా కలుస్తాను అన్నాడు. ఓహో చాలా మోడర్న్ అనుకుంటూ ఆ అమ్మాయి నేను వెళ్లి మాట్లాడాము , కానీ అతను తర్వాత ఆ అమ్మాయి చాలా ఇండిపెండెంట్ గా వున్నది అన్నాడు. వాళ్ళకు మోడర్న్ గా వుండాలి కానీ ఇండిపెండెంట్ గా ఉండకూడదు. ఏమీ మోడరన్ భావాలు రా బాబూ అనుకుంటూ వదిలేశాము. నేను తర్వాత ఫోను చేసి మెత్తగా మోడర్న్ అంటే ఎలా ఉండాలో చెప్పాను ఉపయోగము ఉందో లేదో తెలియదు కానీ మనకు ఒక తృప్తి. ఇంక ఈ రోజుల్లో ఎక్కువగా ప్రేమ వివాహాలు. ఆర్భాటం లు ఎక్కువగా ఉన్నాయి. మనకు లేని బారాత్ సంగీత్, హంగామా లు ఎక్కువ అయినాయి. కాలం తో పాటు మనం కూడా మారాలి కదా ఇంతకీ భమిడిపాటి వారి పెళ్లి చూపుల కథ చెప్ప లేదు కదా యింకో రోజు చెప్తాను గుడ్ నైట్
Comments