ఈ మధ్య మావారి ఫ్రెండ్ మనవరాలి పెళ్ళి కుదిరింది, పెళ్ళి వారు లాంఛనం గా మాట్లాడుకోవాలి అని వస్తున్నారు,, మీరు పెద్దవారు అన్నీ తెలుసు కదా, ఆ రోజు ఉదయాన్నే రండి మీ దంపతులు అక్కడే భోజనం అనికూడా పిలిచింది. ఆ అమ్మాయి మా వారికి తెల్సినవాళ్ళు. పెళ్ళి లో ఎవరికి నచ్చినవి వాళ్ళు పెడతారు ఈ లాంఛనాలు వాటి మీద మాట్లడుకోవటం అదీ నచ్చని మావారు నేను రాను నీవు వెళ్ళు అని ముందే చెప్పారు. ఇంక నాకు తప్పదు కదా అని బయలుదేరాను. నేను వెళ్ళేటప్పటికి ఇంకా పెళ్లి వారు రాలేదు. ఏర్పాట్లు అన్నీ చాలా ఘనంగా వున్నాయి. కేటరింగ్ కి ఆర్డర్ ఇచ్చారు. వెళ్ళగానే చక్కగా డ్రెస్ చేసుకున్న ఆమ్మాయి బామ్మ గారు అంటూ మంచినీళ్ళు ఇచ్చి కాఫీ నా, జ్యూస్ ఇవ్వనా అని అడిగింది. నేను ఏమీ వద్దు అన్నాను. ఇంతలో ఇంకొక ఆమ్మాయి వచ్చి సోఫాలు అవీ ఎలా ఆరెంజ్ చేయాలి ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఫోటోలు ఏ యాంగిల్ లో తీయాలి అని చెప్తున్నది. నేను మా ఫ్రెండ్ కూతురుని అడిగాను ఈ అమ్మాయి మీ బంధువులా అని, కాదు ఆంటీ ఈవెంట్ మేనేజర్ అనే సమాధానం వచ్చింది. ఈ మానేజర్ ఇపుడే ఎందుకు, పెళ్ళి ఆపుడు కదా అనుకుని సరే అడిగితే బాగుండదు అనుకున్నాను. ఇంతలో మా వారి ఫ్రెండ్ కొడుకు అలవాటు లేని ధోవతి సర్దుకుంటూ వచ్చి నా పక్కన కూర్చుని ఏం చేయాలి ఆంటీ మాకు ఏమో ఏమీ తెలియదు వాళ్ళు పెళ్ళి గ్రాండ్ గా చేయాలి అన్నారు. ఈవంట్ మానేజర్ ని పెడితే అవిడ 3 లక్షలు అడుగుతున్నది. ఈ రోజు ఈవిడను పెళ్ళి వారు చూస్తే ఫోటోగ్రాఫర్ తో పాటు ఈ ఖర్చు కూడా షేర్ చేసుకుంటారేమో అని మా ఐడియా అన్నాడు. నాకు కళ్లు తిరిగినంత పని అయ్యింది. నా పెళ్ళి అయిన ఏడాది కల్లా మా ఆడపడుచు పెళ్ళి దగ్గరనుండి కనీసం బంధువుల్లో, స్నేహితుల్లో ఒక 40, 50పెళ్ళిళ్ళు నా ఆధ్వర్యంలో మేనేజ్ చేస్తూ, షాపింగు లు, ఇంట్లో పన్లు అన్నీచేసానే. ఇలాంటి బిజినెస్ ఒకటి వుందని తెలియదు కదా అని చింతిస్తూ అయ్యో ఎన్ని లక్షల సంపాదన పోయింది కదా అని బాధ వచ్చింది. మనసులో ఆహా కాలం లో ఎన్ని మార్పులు అనుకున్నాను. పిల్లవాడి వివరాలు అడిగితే తెలిసింది ఏమిటి అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కలిసి ఇంజనీరింగ్ చదివారు అబ్బాయి ప్రస్తుతం అమెరికాలో వుద్యోగం, వాళ్ళ అమ్మ నాన్న కొంచెం బెట్టు చేసినా ఈ పెళ్ళికి ఎలాగో వప్పుకున్నారు.కట్నం అక్కరలేదు కానీ లాంఛనాలులో, పెళ్ళి లో ఏమి లోపము జరగకూడదు అని చెప్పారుట. పెళ్ళి వారు అంటే అబ్బాయి తల్లి తండ్రి మేనత్త, మేనమామ, ఆడపడుచులు ఇద్దరూ వాళ్ళ భర్తలు తో సహా ఆర్భాటంగా వచ్చారు. ఇంతమంది ఏమి మాట్లాడుతారో అని నేను ఆశ్చర్య పోయాను. పెళ్ళి కూతురు కి ఒక పూల బొకే అందించి, గుడ్ లక్ చెప్పారు, ఆడపడుచులు ఈ లోపల వాళ్లని అటూ ఇటూ మేనేజ్ చేస్తూ ఒక అరడజను ఫోటోలు తీయించింది మా ఈవెంట్ మేనేజర్ గారు. నాకు మాత్రం ఏమిటి ఈ అనవసర ఆర్భాటం, ఖర్చు అనిపించినా చేసేదేమీ లేక చూస్తూ వున్నాను. జ్యూస్ తాగి స్వీట్స్ తిన్నాక అసలు విషయము మొదలు పెట్టారు. అత్తగారు లిస్ట్ కట్నం లేకపోయినా ఏదో ఇంత అనే క్యాష్ ను మించి పోయింది. మధ్య లో మేము ఏమీ చెప్పినా అవిడ మా అబ్బాయ్ చేసుకోవాలి అనుకున్నాడు కదా అని ఒక రాగం తీస్తుంది. ఆవిడ మాట్లాడటం తప్పితే ఇంక ఎవరూ ఏమీ అనరు. ఈ లోపల మా ఈవెంట్ మేనేజర్ గారు పెళ్ళి గ్రాండ్ గా జరపడానికి ఏమి చేయాలో అని ఒక లిస్టు అందించింది. మెహందీ, సంగీత్, హాల్డి ఫంక్షన్, సంగీత్ లో డ్యాన్స్ లు చేయటానికి ముందే ప్రాక్టీసు చేయించే వాళ్ళను కూడా తనే ఎరేంజ్ చేస్తాను అని చెప్పింది. వీళ్ళు పెళ్ళి చేస్తున్నారా లేక ఏదయినా డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నారా అని నాకు అనుమానం వచ్చింది. అందరూ భోజనాని కి హాల్లో కి వెళ్ళగానే మా ఫ్రెండ్ కొడుకు నా దగ్గర గా వచ్చీ ఇవ్వన్నీ చేయాలా ఆంటీ అని అడిగాడు. ఈ పెళ్ళి ఇలా చేస్తే అతను అప్పుల్లో మునగటం ఖాయం అనిపించింది నాకు. అవిడ అడిగినవన్నీ ఆలోచించుకుని రెండు రోజుల్లో చెప్తాము అని చెప్పమని సలహా ఇచ్చాను. ఆరోజుకు వాళ్ళను మర్యాద పూర్వకంగా పంపాము. అన్నీ నిర్ణయించుకుని తాంబూలాలు తీసుకుందాం అనే నిర్ణయం తో వాళ్ళు కార్లు ఎక్కారు. వాళ్లు వెళ్ళాక పెళ్ళి కూతురు తో మాట్లాడాను, ఈ పెళ్ళి ఇలా చేస్తే ఎంత ఖర్చు అవుతుందో అలా చేయటం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో చెప్పాను. ఆ అబ్బాయ్ ఎపుడు ఫ్రీ గా వుంటాడో తెలిస్తే అతనితో మాట్లాడుదాము అని చెప్పాను. ఆ వీకెండ్ లో దంపతులు, అమ్మాయి తో మా యింటికి వచ్చారు. మా వారు యు ఎస్ లో వున్న అతనికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి ఏం చెప్పాడో తెలియదు కానీ అవిడ లాంఛనాలు గుఱించి మాట్లాడకుండా ప్రధానం చేసుకున్నారు. ప్రధానంకు మావారి ఫ్రెండ్ అమ్మాయి తాతగారు బామ్మ గారు వచ్చారు. ఆయన నవ్వుతూ నా పెళ్ళి, నా మనవరాలి పెళ్ళి నీవే కుదిర్చావు అన్నారు. ఆ తాత గారు ఆరోజుల్లో బాపు బొమ్మ లాంటి అమ్మాయి కావాలని ఏ సంబంధం ఒప్పుకునే వాడు కాదు వాళ్ళ నాన్నకు కట్నం ఆ రోజుల్లో 30వేలు అడిగేవాడు. మా వారి ఇంకో ఫ్రెండ్ చెల్లెలు చాలా అందంగా ఉంటుంది. మావారు పూనుకుని పెళ్ళి కుదిర్చారు. కట్నం ఆయన అనుకున్నట్లు రాలేదని వాళ్ళ నాన్నగారు మేము పెళ్ళికి వెళ్ళినా మాతో మాట్లాడ లేదు. మీరే అసలైన ఈవెంట్ మేనేజర్ లు, ఇంక వేరే ఎందుకు అని ప్రధానం అంతా మా ఆధ్వర్యంలో చేశారు. పెళ్ళికి మాత్రము ఈ రోజుల్లో సరదా ఎందుకు కాదనాలి అని వాటికి మాత్రం పెట్టుకోండి అని చెప్పాము ఆ పెళ్ళి అంతా అయ్యాక మీరూ ఒక బిజినెస్ పెట్టండి ఆంటీ అని సలహా ఇచ్చారువాళ్ళు, ఎదుటి వాళ్ళకు సహాయము చేస్తే పుణ్యము వస్తుందనే రోజుల్లో నుంచీ ప్రతిదీ బిజినెస్ గా ఎలా మార్చవచ్చు అనే రోజులకు వచ్చాము. ఇంకా కొన్ని పెళ్ళి కబుర్లతో రేపు
ఈవెంట్ మేనేజర్
murthydeviv
Comments