మల్లె పూలు, మండు వేసవి
- murthydeviv
- Apr 28
- 3 min read
వేసవి కాలం ఎంత విసుగు గా ఉన్నా మల్లె పూలు, మామిడి పండ్లు చూస్తే మాత్రం వేసవి వేడి గుర్తు రాదు. ఇపుడు చాలా రకాలుగా మల్లె పూలు దొరుకుతున్నాయి.కానీ అంత సువాసన మాత్రం వుండటం లేదు. మా అమ్మాయి మదురై మల్లె పూలు గురించి ఉష కన్నన్ అనే ఆవిడ రాసిన బుక్ తెచ్చింది. అక్కడ ఎపుడూ మల్లె పూలు దొరుకుతాయిట ఉదయాన్నే వచ్చే ఫ్లైట్ లో మద్రాసు కి పూలు పంపుతారుట బుట్ట లలో. మద్రాస్ లో కూడా బాగా దొరుకుతాయి బహుశా అవి మదురై మల్లె పూలు ఏమో. ఏదో కొంచెము బుక్స్ సర్దుదాం అని కప్ బోర్డు చూస్తుంటే ఈ బుక్ కనిపించింది. అందులో ఆవిడ పెట్టిన ఫోటోలు చూస్తూ ఉంటే పూల జడలు గుర్తు వచ్చాయి. ఇపుడు అంటే రెడీ మేడ్ గా పూలజడ లు దొరుకుతున్నాయి కానీ మా చిన్నతనం లో వేసవి వచ్చింది అంటే పూల జడ వేయాల్సిందే.a జడ ల్లో కూడా వంకుల జడ అయితే చాలా తేలికగా తేలి పోతుంది. అందులో ఆవిడ పూల జడల ఫోటోలు కూడా పెట్టింది. అవి చూస్తుంటే ఆ రోజుల్లో పూల జడ ల ప్రహసనం గుర్తు వచ్చింది. అందులో కూడా మా అత్తయ్యలు అందె వేసిన చెయ్యి. ఇంక మా చిన్న అత్తయ్య జడ వేసిందంటే ఇంక మనం మెడ తిప్ప లేము అంత గట్టిగా బిగించి వేసేది. వేసవికాలం వచ్చినది అంటే ఒక రౌండ్ అందరికీ పూల జడ వేయాల్సిందే. ఆ రోజు పట్టు పావడా వేసుకొని చుట్టు పక్కలు వాళ్ళ కి ఆ జడ చూపించి రావాలి. మరలా రాత్రి ఆ జడ నలగ కుండా కిందకి వేలాడు తూ ఉంచుకుని పడుకోవాలి.ఇంక జడ వేసేటపుడు కదిలామో వీపు మీద ఒక దెబ్బ పడిపోయేది కాసేపు కూడా కదలకుండా కూర్చోలేరా అంటూ , ఒక పెళ్ళి అపుడు మాత్రం దెబ్బ పడేది కాదేమో. మా పిల్లలు చిన్నప్పుడు మావారు ఎక్కడ కి వెళ్ళినా పూలు విరివిగా తెచ్చేవారు. ఇంక మా అత్త గారికి మా అమ్మ గారు ఇంట్లో వున్న పిల్లలు అందరికీ జడలు వేసే వారు. ఒక్కసారి మాత్రమే అందరికీ సరదా గా ఫోటోలు కూడా తీయించాము. ఆ రోజుల్లో మల్లె పూల జడల ఎలా ఉన్నా, మొగలి పూలు తో జడ వేసే వారు ఆ మొగలి పూలు వాసన బాగున్నా అవి గుచ్చుకుంటూ ఉంటే ఏమీ అందం అనిపిస్తుంది నాకు. అమ్మ అత్తయ్య లు ఆ గట్టి అట్ట ముక్కలు కట్ చేసి వాటి మీద ఈ రేకులు అందంగా కుట్టి అవీ మరలా జడ మీద అందంగా అమర్చి కుట్టే వాళ్ళు ఆ మొగలి చక్రాలు మధ్య ఎర్రటి కనకాంబరం పూలు గుత్తి గా గుచ్చి పెట్టే వారు. జడ అయితే చాలా ఆర్టిస్టిక్ గా బాగుంటుంది. ఆ మొగలి వాసన కోసం మనం ఆ గుచ్చుకున్నా పట్టించుకోకూడదు అనుకుంటా. ఇప్పుడు తలచుకుంటే వాళ్ళ కి ఎంత ఓపిక ఇంతమంది ఆడపిల్లలు కు జడలు వేయటానికి అనుకుంటాను. పండగ వచ్చింది అంటే అందరూ చక్కగా తలంట్లు పోసుకొని ఏ కాలం లో వచ్చే పూలు పెట్టుకోవాలి. అబ్బ చేమంతి పూలు ఏం పెట్టుకుంటాం అన్నానో మా అమ్మ గారు ఒకే ఒక చూపు తో మాట కూడా రాదు ఇప్పటికీ పండగ అనగానే ఆ హడావిడి అంతా గుర్తు వస్తుంది ఇంటి నిండా రాలిన చేమంతి రేకులు, తడి కాళ్ళ తో తొక్కితే తెల్లటి పిండి ముగ్గులు గుర్తులు పిండి వంటల ఘమ ఘుమ లు. ఆ రోజులే వేరు. అంత చక్కగా జడ లు వేసిన అమ్మ, అత్తగారు వున్నా నాకు జడలు వేయటం రాదు. పక్కనే కూర్చుని పూలు అందిస్తాను. జడలు వేసే వాళ్ళకు ఒకళ్ళు పక్కన పూలు అందించాలి ఎలాగో తెలుసా వాళ్లు చెప్పి నట్లుగా ఒకసై మరువము ఒకసారి కనకాంబరం గుత్తి గా చేసి అందించాలి.అది కూడా ఒక ఆర్ట్ అనుకుంటా సరిగ్గా అందించ క పోతే చివాట్లు తప్పవు. మల్లె పూలు కూడా సన్నటి పుల్ల కు జాగ్రత్తగా గుచ్చి అందించాలి. మా పిల్లల పెళ్లి టైమ్ కి మా మరదలు మా వదిన ఎక్స్పర్ట్స్ పూల జడలు వేయటం లో . ఇంక అపుడు నా హోదా పెరిగి పక్క వాయిద్యం లాగా త్వరగా కానీయండి అంటూ పెత్తనం చేస్తూ తిరగటం మొదలు పెట్టాను. అసలు ఇపుడు అయితే ఆ ఈవెంట్ మానేజర్ ఏవో ప్లాస్టిక్ పూలు తో ఏమిటో నాకు అర్థం కూడా కాదు మధ్యలో ఆర్టిఫీషియల్ చేమంతి బిళ్ళ లు తో జడలు చక్కగా మల్లె ల వాసన తో జడ అయితే ఎంత బాగుంటుంది. కొస మెరుపు ఏమిటంటే మా మనవరాళ్లు ఒక్క సారి రెడీ మేడ్ మల్లె జడలు, జడ గంటలతో ఒక్క సారి జడలు వేయండి ఫోటో తీయించండి అని అడుగుతూనే వున్నాను వాళ్లు ఇంక కాలేజ్ లకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా మా అమ్మాయి లకు తీరలేదు. ఎప్పుడో మా అత్త గారు మా అమ్మ కలలో నన్ను చివాట్లు వేస్తారు పిల్లలు కు జడలు కూడా వేయించ లేదు అని. చూసారా ఒక మల్లె పూల పుస్తకం చూసేటప్పటికి ఇన్ని గుర్తు వచ్చాయి. మనసున మల్లె ల మాల లు ఊగేనే అని కృష్ణ శాస్త్రి గారి పాట గుర్తు వస్తుంది. పాత మల్లేశ్వరి సినిమా లో పాట వినండి. ఇంకో పాట చండి రాణి లో ఓ తారక , ఓ జాబిలి భానుమతి గారు పాడిన పాట వింటూ ఉంటే నిజంగా మల్లె పూలు గుబాళించ నట్లే వుంటుంది యు ట్యూబ్ లో ఉంటుంది వినండి అది మరపురాని మల్లె పూల కథ గుడ్ నైట్
Comments