top of page
Search

సముద్రపు గాలి

  • murthydeviv
  • 20 hours ago
  • 4 min read

Updated: 1 hour ago

ఈ రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ ఉంటే రాత్రి కాస్త చినుకులు పడ్డాయేమో చల్లటి గాలి పలకరించింది. . ఈ హైదరాబాద్ ఎండలకు ఇరవై నాలుగు గంటలూ కూలర్ , ఫ్యాన్ లు తిరుగుతూ ఉండాల్సిందే.

ఏటికి ఏడాది ఎండలు పెరగటమే .


చెరువులు పూడ్చి , కొండలు తవ్వి బిల్డింగ్ లు కడుతూ , భూమి లో నీరు తోడేస్తూ ఉంటే వేడి పెరిగి పోక ఏమవుతుంది.

దక్షిణం వైపు నుంచీ వచ్చే ఆ గాలి కి నాకు ఏవేవో గుర్తు వస్తూ ఉంటాయి.

ముందుగా ఎచ టి నుండీ వీచేనో ఈ చల్లటి గాలి అనే పాట గుర్తు వస్తుంది. ఇప్పుడు సినిమాల్లో చూడాలి ఆ గాలి

మా చిన్నప్పుడు ఉదయం పూట చల్లటి గాలి వచ్చేది.


హల్లో కిటికీలు తెరిస్తే ఎంత గాలి వచ్చేది ఆంటే గోడకు వున్న క్యాలెండరు గాలికి కొట్టుకుంటూ ఉండేది.


ఇంక పిచ్చికలు ఇంట్లో కి వచ్చి ఆల్మరా కున్న అద్దం ముందు వాలి ముక్కుతో అద్దం మీద కొడుతూ ఉండేది.


ఒక్కొక్క సారి ఎక్కడయినా సందు దొరికితే గూడు పెట్టేవి , ఇప్పుడు మా ఇంట్లో చెట్లు వున్నా ఒక్క పక్షి కూడా కనబడదు.

ఉదయం పూట కాసేపు మామిడి చెట్టు మీద పక్షులు కిల కిల లు కాసేపు వినిపిస్తాయి అంతే తర్వాత

అంతా నిషబ్దం.


మా పుట్టిల్లు సముద్రపు ఒడ్డున ఊరు , ఆరోజుల్లో సాయంత్రం హాయిగా చల్లటి గాలి వచ్చేది. ఇన్నీ ఫ్యాన్లు, ఉండేవి కావు.

ఇంక కూలర్లు , ఏ. సి లు అసలు తెలియవు.

ఎండా కాలం పగలు కిటికీలకు వట్టివేళ్ళ చాపలు కట్టి నీళ్లు చల్లుతూ ఉంటే చల్లగా , హాయిగా ఉండేది .

ఇల్లంతా ఆ వట్టివేళ్ళ సువాసన ఉండేది. ఇంక సాయంత్రం చల్లబడితే డాబా మీదకు వెళ్ళేవాళ్ళం .


అక్కడే ఆట పాటలు , రాత్రి కి అక్కడే పరుపులు వేసుకుని పడుకునే వాళ్ళము. ఎంత మంది చుట్టాలు వచ్చినా ఇబ్బంది ఉండేది కాదు. వెన్నెల రాత్రులు నీడ ఆటలు, అమావాస్య అయితే ఆకాశంలో నల్లటి చీర మీద వెండి పువ్వుల్లాగే

మెరిసే ఆ నక్షత్రాలు చూస్తూ కబుర్లు, పాటలు, అంతులేని హుషారుగా ఉండేది.

మధ్యలో చినుకులు పడితే పరుపులు ఎత్తుకుని గదిలో పడేసి వాటి మీదే నిద్రలు

యింటికి పెద్దవాళ్ళు ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్లకు పక్కలు వేయటం , మంచం పక్కన మరచెంబు తో నీళ్లు పెట్టటం మా డ్యూటీ.


అరోజుల్లో పక్కల మీద వేయటానికి తెల్లటి దుప్పట్లు ఉండేవి. వాటిని రెక్క దుప్పట్లు అనేది మా అమ్మగారు.

అవీ వారానికి ఒకసారి చాకలి ఉతికి తెచ్చేవాడు. ఒక విధమైన సువాసన తో పెళ పెళ లాడుతూ ఉండేవి ఆ దుప్పట్లు.


మా రెండో పెద్ద నాన్నగారు, ఇంకొక మామయ్య గారు , వస్తే మేడ మీద వరండా లో పక్కలు వేయటం నా డ్యూటీ.

మా అమ్మ గారు ప ది సార్లు అయినా అడిగే వారు , అన్నీ సరిగ్గా పెట్టావా అనీ.


మా పెద్ద నాన్న గారు బెజవాడ లో వుండే వారు, మామయ్య గుంటూరు , వాళ్ళు ఇద్దరూ పడుకుని ఆ వీచే గాలి గురించి

ఒక గంట అయినా మాట్లాడుకునే వారు.


మామయ్య ఆహా ఏమి చల్లటి గాలి దక్షిణపు గాలి , ఎంత హాయిగా వుందో అనే వారు, మా పెద్ద నాన్నగారు

సముద్రపు గాలి కదా అంటూ ఇంకొంచెం వర్ణించే వారు. ఆలా వాళ్ళు ఇద్దరూ నిద్ర పట్టే వరకు ఆ గాలి గురించే కబుర్లు ఉండేవి.


లేక పొతే ఇద్దరికీ నెహ్రూ గారు ఆంటే అభిమానం ఆయన గురించి కబుర్లు ఉండేవి. మేము పక్కన గదిలో చదువుకుంటూ వాళ్ళ కబుర్లు వింటూ ఉండేవాళ్ళము..


ఇప్పటికీ నేను ఉదయం పూట డై నింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే చల్లటి గాలి వస్తే వాళ్ల కబుర్లు గుర్తు వచ్చి

మా కోడలుకు చెప్తూ వుంటాను.


హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో మేము కూడా ఎండా కాలం రాత్రులు బయట మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళము.

మలక్ పేట దోమలు కు ఫేమస్ రోజూ ఆ దోమ తెరలు కట్టుకోవటం ఒక పని.


మా మామ గారు కూడా ఎండా కాలం లో ఆ పల్లెటూరు ని ఎంతో తలుచు కునే వారు. హాయిగా వేపచెట్టు కింద మంచం వేసుకుని పడుకుంటే ఆ హాయి ఇంక ఎక్కడా ఉండదు అనీ రోజూ మా వారి తో చెప్పే వారు.


మేము కూడా సెలవల్లో మా అమ్మమ్మ గారింటికి వెళ్ళితే డాబా మీద పడుకునే వాళ్లము. అమ్మమ్మ గారింట్లో

రెండు, మూడు వేప చెట్లు ఉండేవి.

ఇంక మా ఆటలు అన్నీ ఆ చెట్ల కిందే , తాతగారు అరుస్తున్నా మా అన్నయ్యలు జామ చెట్టు మీదో, వేప చెట్టు మీదో వుండే వారు.


మా అమ్మమ్మ గారు వేప పూత అంతా తీసి ఎండ పెట్టే వారు. ఆ వేప పూత తో పచ్చడి చేసే వారు బెల్లం వేసి, అరోగ్యానికి మంచిది తినమనే వారు.

ఇలాంటి చేదు కూర ఇంకొకటి , కార్తీకమాసం లో అవిసె ఆకుల తో కూర , ఆ ఆకు చేదు గా వుంటుంది, దాన్లో ఇంత బెల్లం వేసి పుణ్యం తినమనే వారు.

ఆ రోజుల్లో కాబట్టి మేము తిన్నాము కానీ ఇప్పుడు పిల్లలు అయితే అనుకుంటా నేను.


ఆవిసె పూలు లేత పసుపు రంగు లో అందం గా ఉండేవి. శివుడు కి ఇష్టం అనీ కార్తీకమాసం లో నాన్నగారు పున్నాగా, ఈ అవిసె , శంకు పూలతో పూజలు చేసే వారు.


అమ్మమ్మ గారింట్లో మాకు ఇంకొక ఆకర్షణ గోరింటాకు చెట్టు , ఆ ఆకు కోసి అప్పటికప్పుడు రుబ్బించి

చేతులకు పెట్టించుకోవటం ఎంత హుశారుగా ఉండేదో.


తాతగారి కి వూరి చివర దోస తోట ఉండేది. తాత గారు రోజూ వాకింగ్ లాగా అక్కడికి తీసుకుని వెళ్ళేవాళ్ళు.

ఆ తోట లో దోస కాయలు కోయటం చాలా సరదాగా ఉండేది.


దోస కాయల తోటి వరుగులు చేసి ఉంచే వారు , వాటితో కూర, పులుసు చేసే వారు. వాటిని నూనె లో

వేయించి ఉప్పు కారం చల్లి చిప్స్ లాగా తినే వాళ్లము.


ఎక్కడయినా వేపచేట్టుకి ఊయల వేయించి ఊగటం ఒక మధుర మైన అనుభూతి. మా మేనత్త గారి ఇంట్లో కూడా

ఉయ్యాల ఊగటం చాలా సరదాగా ఉండేది.


అమ్మమ్మ గారింట్లో మేన మామలు లేక పోయినా , మా పెద్దమ్మగారు, పెద్ద నాన్నగారు మమ్మల్ని చాలా గారాబంగా చూసే వారు..


తాత గారితో నాగార్జున సాగర్ వెళ్ళటం ఎంత గానో గుర్తు వస్తుంది . అప్పటికీ ఇంకా డాం కట్ట లేదు, ఆ తవ్వకాల్లో

బయట పడ్డ శిల్పాలు వాటి గురించి పేపర్లో , రేడియో లో చదివి తాత గారు మమ్మల్ని తీసుకుని వెళ్లారు అనుకుంటా.


తాత గారు బ్రిటిష్ వాళ్ల కాలం లో సబ్ రిజిస్ట్రార్ గా చేసారు. ఆయన్లో ఆ ధర్జా చాలా ఉండేది. రోజూ వార్తలు విని, పేపర్ చదివి మా అమ్మమ్మ గారికి ఎక్సప్లైన్ చేసే వారు.

మమ్మల్ని సాగర్ తీసుకుని వెళ్లి ఆ తవ్వకాల్లో బయట పడ్డ శిల్పాలు అన్నీ చూపించి ఎక్సప్లైన్ చేసారు.


ఈ రెండు కొండల మధ్య కృష్ణా నది మీద , పెద్ద డాం కడతారు , ఆ డాం మీద గుండా బస్సులు వెళితే మనకు హైదరాబాద్ దగ్గర అవుతుంది, ఇంక మనం బెజవాడ వెళ్లి హైదరాబాద్ వెళ్లక్కర్లేదు అనీ చెప్పారు.


అప్పటికే మా పెద్దమ్మ గారి అమ్మాయి హైదరాబాద్ లో వుంది. మేము వెళ్ళితే పాపం తను కూడా మా కోసం వచ్చేది.


నేను ఎప్పుడు సాగర్ వెళ్లినా తాత గారి మాటలు గుర్తు వస్తాయి.


ఆలా మా మామ గారు కూడా దాచేపల్లి దగ్గర కృష్ణ నది మీద బ్రిడ్జ్ కడితే మన ఊరు దగ్గర అవుతుంది అనీ చెప్పే వారు , మా మామగారు పుట్టి పెరిగిన ఊరు పిడుగు రాళ్ళ దగ్గర , ఇప్పటికీ కొన్ని పొలాలు వున్నాయి..

ఇప్పుడు మిర్యాలగూడ మీద గుండా ఆ ఊరు వెళుతూ ఉంటే మా మామ గారు గుర్తు వస్తారు.


రోజు కి రోజు మరింత మోజు అన్నట్లు ఎండలు విపరీతంగా పెరుగు తున్నాయి..మనకు తట్టుకునే శక్తి తగ్గుతున్నది.

రోజంతా కూలర్ ముందు కూర్చుని ఇలా పాత రోజులు తలచుకుంటూ , వేప చెట్టు గాలి అరోగ్యానికి మంచిది అనీ చదువు కోవాలి.


చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో అశోకుడు చెట్లు వేయించెను , చెరువులు తవ్వించేను అనే పాఠం చదివి ఇదేం పెద్ద గొప్పా అనుకునే దాన్ని.

కానీ ఇప్పటికీ ఆ చెట్లు వున్నాయేమో, మన నాయకుల చేత, ఆ పాఠం చదివిస్తే బాగుండు అనీ ఇప్పుడు రోజూ అనుకుంటాను .


అవీ ఈ వారం కబుర్లు శుభరాత్రి మరలా ఇంకా కొన్ని కబుర్లతో కలుద్దాం













 
 
 

Recent Posts

See All
హృషీ దా

జయ భా దురి మొదటి సినిమా గుడ్డీ సినిమా జ్ఞాపకం వున్న వాళ్ళ కి హృషికేష్ ముఖర్జీ తెలిసే వుంటారు. రెగ్యులర్ సినిమా లా కాకుండా , సున్నితమైన హాస్యం తో,మనసుకు ఆహ్లాదంగా సినిమాలు తీయ టం ల

 
 
 
నా హాలీవుడ్ యాత్ర

ఇంగ్లీష్ వింగ్లీ ష్ ఆ సినిమాలో శ్రీదేవి ని చూసినట్టే నా మనవ రాళ్లు కూడా నాకు ఇంగ్లీష్ రాదు అర్థం కాదు అనుకుంటారు. మీకు ఇంగ్లీష్ ఒక్కటే వచ్చు , నాకు మూడు భాషలు వచ్చు , అనీ వాళ్ళ

 
 
 
మధుర గీతాలు గీతా దత్

ఒక ఐదు ఆరు ఏళ్ల క్రితం వరకు టేప్ రికార్డర్ లో మనకు ఇష్టమైన పాటలు పెట్టుకుని వినే వాళ్లము. నా దగ్గర గీతా దత్ టేప్స్, తర్వాత సీ డీ లు చాలా నే ఉండేవి. ఈ యూ ట్యూబ్ వచ్చాక ఏదో ఒకటి

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page