మాయా బజార్ షష్టి పూర్తి
మాయా బజార్ షష్టిపూర్తి ప్రదర్శన,సభ ఏడేళ్ల క్రితం గొప్ప కోలాహలం గా జరిగెను...
పెద్ద బోల్డు మంది వచ్చి సిన్మా చూసి సభలో మాట్లాడి ఎక్కువ మంది కుర్రాళ్ళు రావడం వాళ్ళు ఎంజాయ్ చేసి కేరింతలు కొట్టడం నాకు తెగ నచ్చింది...
చాలా బాగుంది అని ఈ పోస్టు కూడా జగదీష్ గారి ది షేర్ చేస్తున్నాను
..మాయా బజార్ పాత సినిమా చూడని వాళ్ళు చూసి తరించండి ..
అప్పట్లో
విజయనగరం డాక్టర్ గారు రాసిన పంపిన సందేశం...
.......
........
శుభోదయం మిత్రులందరికీ!
ఈరోజు హైదరాబాదులో మాయాబజార్ చిత్రాన్ని మరోసారి చూసి మనసు పారేసుకోడానికి సిద్ధమవుతున్న మిత్రులందరికీ నా ఈ చిరురచన అంకితం.
వేసవిసెలవుల్లో మనింటికొచ్చిన మావయ్య పిల్లల్తో ఆడుకోడం, ఆనందాన్ని జుర్రుకోడం, తీరా సెలవులన్నీ అయిపోయాక వాళ్ళంతా వెళిపోతుంటే మనకి సంబంధించిన అమూల్యమైన వస్తువేదో వాళ్ళతోపాటు వెళిపోతున్నట్టు బాధకి లోనవడం...మనందరికీ అనుభవమే!
ఇంకా జ్ఞానంరాని పసిపిల్లలయితే వాళ్ళవెంటబడి రిక్షాలో కూర్చుని దిగకపోడం, నేనూ వెళతానని మారాంచెయ్యడం కూడా మనకళ్ళకి ఇప్పటికీ అపురూప దృశ్యమే!
అయితే మనందరం సామాన్యమానవులం...ఇలాంటివన్నీ మనిళ్ళలో సాధారణం. దేశమంతటికీ దిశానిర్దేశం చేసే ఉద్గ్రంథాల్లో ఒకటిగా భావించే మహాభారతంలో ఇటువంటి వ్యక్తులుంటారా?
కె.వి.రెడ్డిగారు ఎటువంటి సంకోచమూలేకుండా పెట్టేశారు ఇలాంటి పార్టింగ్ సీన్స్! ప్రేక్షకుడంటే ఆయన దృష్టిలో నేలటిక్కెట్టులో కూర్చుని చూసే పేదవాడు కాదు. నేలమీద నిలబడి ఆలోచించేవాడు. అతడికి కాసేపు హాయికావాలి. మాటలన్నీ అర్ధమవ్వాలి.
“దీనంతటికీ నువ్వూ కారణం...!”
“నే బతికుండగానే...?”
“నాకెప్పుడైనా చెప్పివెళ్ళారా...?”
ఛాయాదేవి చేత చెప్పించిన ఈసంభాషణలు ఏ సాంఘికచిత్రంలోవో అనుకునేంత సహజంగా వుంటాయి. కానీ ప్రేక్షకుడు హాయిగా మూడుగంటలపాటు తనింట్లో తిరుగుతున్నట్టు భావిస్తాడు.
హాస్యాన్ని పండించడానికి పాత్రధారులు చచ్చేలా దెబ్బలుతినే తీరాలా? అసభ్యమైన పదాలతో వెకిలిగా సకిలించాలా? అక్కర్లేదు. ఒక్క గింబళితో అరగంటసేపు పింగళివారందించిన సైలెంట్ కామెడీ ఇప్పటికీ నవ్విస్తుంది. గిల్పంతో చిన్నమయ్య వేయించిన చిందులన్నీ అనల్పం.
నీదైన భాషలో, నీకునచ్చే దృశ్యాల్ని, నీలాంటి భావోద్వేగాలే కలిగిన పాత్రలతో నాటకాన్ని రక్తికట్టించడం ఆ కదిరివారికే కుదిరింది.
విరహము కూడా సుఖమేకాదా..నిరతము చింతన మధురముకాదా..
ఈరెండులైన్లూ అందరూ అన్నివేళలా గాయత్రీమంత్రంలా జపిస్తూ వుంటే ఎంత మధురంగా వుంటుంది? విరహానంతరం వెన్నెల్లో నౌకావిహారం ఎలాగూ చేయించేశారు. దానికి వయోభేదం లేదు. దర్శకుడి ప్రతిభకు కొలమానమూలేదు. ఆద్యంతం ఆహ్లాదకరమైన అమోఘ దృశ్యమది!
భారతకథలోంచి బయల్దేరి మధ్యలో డైవర్షన్ తీసుకుని ఊహాశక్తిని జోడించి కాసేపు వ్యాసులవారికి సారీచెప్పి, చూస్తున్న ప్రతివారూ మూడుగంటలపాటు కుర్చీలకి అతుక్కుపోయేలా చేసిన వి‘చిత్రం’ ఇది!
యవ్వనంలో మిసమిసలాడే అక్కినేని, నందమూరి, సావిత్రి...
అందంతో కనులవిందు చేసేస్తారు.
నటనతో మనసుచిందు వేయిస్తారు.
గాంభీర్యానికి ఎస్వీయారని పేరుమార్చేస్తే బావుంటుంది. నిఘంటువుల్లోకూడా మార్పించెయ్యాలి. నమోన్నమః!
ఇక గుమ్మడిగారిని చూస్తే బలరాముడికే బలమొస్తుంది. నాపాత్రకి ఇన్నాళ్ళకి ఇంత గుర్తింపు లభించిందని!😜
చిత్రంలో సున్నితంగా ‘అల్లు’కుపోయిన పాత్రలతో, ఏ ‘వంకరా’లేని సంభాషణలతో శర్మా, శాస్త్రీ...!
ఇందులో అంత నవ్వొచ్చిందా? పాపం, వంగరకి చాలాకాలం వేషాలే కరువై ఇబ్బందులు పడ్డారని చదివి ఏడుపొచ్చింది. ఏస్టూడియోకెళ్ళినా ‘ మా చిత్రంలో బ్రాహ్మణపాత్రలేమీ లేవండీ!’ అని చెప్పేవారట! ఒక అద్భుత నటుడికి ఎంత అవమానం? జీవితంలో ఎంత విషాదం?
హిడింబంటే బ్రహ్మరాక్షసి కదా? మరేంటసలు ఆ సూరేకాంతం మన అత్తయ్యలా అంత హోమ్లీగా వుంది? ‘సుపుత్రా! సుపుత్రా!’ అంటూ వడివడిగా కలియదిరిగే ఆవిణ్ణిచూస్తే ఆత్మీయత తొణికిసలాడుతుంది.
‘పాండవులుగా ఎవర్ని పెట్టుకుందాం?’ ఇదేకదా ఫస్ట్ స్టోరీ సిటింగప్పుడు వచ్చే సందేహం? అసలు కథకి వాళ్ళవసరం లేదన్న సూక్ష్మాన్ని దర్శకుడు చెబితేమాత్రం నిర్మాతలెలా నమ్మారని? ఎక్కడా ఆలోటు కనబడకుండా తెరనిండా పాత్రలతో మాయాజాలం చేసేసి, మనందర్నీ హాస్యంలో చుట్టచుట్టి చివరాఖర్న కౌరవుల్ని తిప్పేసినట్టు తిప్పేసి దబ్బుమని హాలవతల పడేస్తారు. బయటికొచ్చాక కూడా రేలంగినీ, సావిత్రినీ, రంగారావునీ రమణారెడ్డినీ తలుచుకుంటామే తప్ప ఎన్టీవోడూ ఏయెన్నారూ అంతవెంటనే గుర్తురారు.
పెళ్ళయిపోయాక ఎవరేం గిఫ్టిచ్చారో అంటూ విప్పిచూసుకున్నట్టు ఆనక కళాత్మక విలువలగురించి తీరిగ్గా చూసుకుంటోంటే ఇవన్నీ కనబడతాయి...
....చందమామకే ఈర్ష్యకలిగించే వెన్నెల వెలుగులు! మార్కస్ బారెట్లేకి కూడా ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టాలసలు! కనీసం అమరావతిలోనైనా ప్లాన్ చేస్తే బావుణ్ణు!
....సంగీతమంటే ముదురుపాకంలా వుండకూడదని, అర్ధంకాని పదప్రయోగాల్ని వదిలేసి జనానికి చేరువలో వాళ్ళమాటలనే మిరియాలుగా చిలకరించి ఘంటసాలవారి వంటశాలలో తయారుచేసిన శ్రీరామనవమి పానకం ఈచిత్రంలోని పాటలు!
....పింగళి ప్రతిభాపాటవాల్ని పాఠ్యాంశాలుగా పెట్టాలని ప్రతిపాదిస్తున్నాను నేను. కోట్లాది హృదయాల్లో కొలువైనవాడు. కొత్తమాటల్ని సృష్టించడం నేర్పించినవాడు. మాటల మాంత్రికుడు..పాటల తాంత్రికుడు!
....మాధవపెద్ది గోఖలే గారి కళాదృష్టికి దాఖలే ఈచిత్రంలో సెట్టింగులన్నీ! కళాధరంటూ పేరే పెట్టేసుకున్నాక ఇక అతగాణ్ణి ఏమని పొగడాలి? మనందరం కూడా మగపెళ్ళివారితో కలిసి మాయాబజారంతా కలియదిరిగి ఆశ్చర్యపోయాలా వుంటుంది వీళ్ళ పనితనం.
‘మాయాబజారంటే ఒక తెలుగు సినిమా!’ అని చెప్పెయ్యడానికిలేదు.
నీయింట్లో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి సుప్రభాతం, తారీకుల లెక్కకి టీటీడీ వాళ్ళ కేలండరూ, గడపకి పసుపూ, దేవుడిగదిలో దీపం ఎంతవసరమో మాయాబజార్ సినిమా వుండడం కూడా అంతే అవసరం. విధాయకం. అంతే!
అరవయ్యేళ్ళేకాదు...అరవెయ్యేళ్ళయినా చెప్పుకోదగిన అనర్ఘరత్నమిది!
హరప్పా మొహంజొదారోల్లా ఒక నాగరి‘కథ’ ఇది!
...........జగదీశ్ కొచ్చెర్లకోట
Comments