పెళ్లి వంటలు, గాడి పొయ్యి కథ
- murthydeviv
- Aug 8
- 3 min read
ఎక్కువగా ఉదయాన్నే మా అత్త కోడళ్లము డైనింగ్ టేబుల్ దగ్గర కాఫీ తాగేటప్పుడు ఏవో కబుర్లు వస్తూ వుంటాయి.
మాట ల్లో ఇప్పటి కేటరింగ్ భోజనాలు ముచ్చట్లు వస్తే నేను పూర్వం రోజుల్లో వంటలు గురించి చెప్పాను.
శ్రావణ మాసంలో వెళ్లాల్సిన పెళ్లిళ్లు , ఇంకా ఫంక్షన్స్ వున్నాయి కదా, అందుకే ఈ వంటలు కబుర్లు వచ్చాయి
కన్నుల పండుగ గా ఎన్ని రకాలు పెట్టినా అన్నీ తినలేము కదా . అందులో కొంచెం పెద్ద వాళ్లము అయ్యాక అసలు తిరిగి అన్నీ రుచి చూడ లేము.. అందుకే యింటికి రాగానే డిన్నర్ బాగా అరెంజ్ చేసారు అనుకుంటాను.
నా గ్రాండ్ గ్యాంగ్ మాత్రం నూడుల్స్ సూపర్, ఛాట్ వండర్ఫుల్, ఐస్ క్రీం కూడా బాగుంది అని సర్టిఫై చేస్తారు.
మా కోడలు ఎప్పుడూ గాడి పొయ్యి చూడ లేదుట ఇంకేముంది నేను బోలెడు పరిజ్ఞానం పంచటానికి రెడీ అయిపోయాను.
ఆ కబుర్లు అలా చెప్తూ ఉంటే నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తు వచ్చాయి. పెళ్లిళ్లు కు ఎప్పుడూ ఒకే బ్యాచ్
వంట వాళ్ళు వస్తూ వుండే వారు. పెళ్లి కి గాడి పొయ్యి తవ్వుతున్నప్పుడు మా నాయనమ్మ గాని ఇంక ఎవరైనా గాని
ఆ పొయ్యి కి ముగ్గు వేసి పసుపు, కుంకుమ లు వేసి నమస్కారం చేసుకునే వారు.
పెళ్లి అనగానే ముందు లడ్డు, అరిసెలు, మినప సున్ని చేసే వారు . బూందీ తో మిక్స్చర్ చేస్తే అందులో చిన్న బిస్కెట్ లు వేసే వారు. ఆ బిస్కట్స్ బయట నుంచీ తెచ్చే వారు ఏమో
ఉదయం టిఫిన్ అంటే ఉప్మా నే కానీ ఆ ఉప్మా కూడా వేడి వేడిగా ఆకుల్లో వడ్డీస్తే ఎంతో రుచిగా ఉండేది .
సాయంత్రం టిఫిన్ అంటే బూందీ, లడ్డు గాని మైసూర్ పాక్ ఉండేది..
అరోజుల్లో బువ్వంబంతి అంటే పెరుగు వడ చేసే వారు. సేమ్యా పాయసం తప్పని సరి , ఆలా ఒక సెట్ మెనూ ఉండేది.
కంది పొడి, వడియాలు, అప్పడాలు గోంగూర, ఆవకాయ తప్పనిసరి
ఆ రోజుల్లో బంగాళాదుంప కొంచెం ఖరీదు ఎక్కువగా ఉండేది, అయినా బువ్వంబంతి లో చేస్తూ ఉండేవారు.
మా ఇంట్లో పెళ్లిళ్లకు వంట చేయటానికి కావాల్సిన వంట పాత్రలు చాలానే ఉండేవి. అన్నం వండే గుండిగలు, కూరలు, పులుసులు, పప్పు వండే గిన్నెలు , గంగాళం లు ఉండేవి. పాలు కాగ పెట్టి పెరుగు తోడు వేయటానికి కూడా ఇత్తడి
గిన్నెలు కళాయి పోసి ఉండేవి.
తాత గారు కార్తీక సమారాధన చేసే వారుట , ఆ వంటల కోసమో , లేదా పిల్లలు పెళ్లిళ్ళు కోసమో ముందు చూపు తో
అన్నీ రకాల సామాన్లు కొని పెట్టారు.
భోజనాలు వడ్డించే టప్పుడు ఉపయోగించే రక రకాల గిన్నెలు ఉండేవి. పులుసు వడ్డించటానికి వాడే గిన్నెలు ని గోకర్ణం అనే వారు , అవీ ఇత్తడి వి అయినా వాటిల్లో కడాయి పోసి ఉండేది.
మజ్జిగ కు గోకర్ణాలు విడిగా గట్టి అల్యూమినియం ఉండేవి. ఇంక నేతి చెంబులు చూస్తే ఆమ్మో ఇంత నెయ్యి తింటారా అంటారు ఈ రోజుల్లో .
పాయసం వేసే ఇత్తడి దోప్పలు కడాయి పోసి ఉండేవి , ఇప్పుడు అనిపిస్తుంది ఎంత శ్రద్ద గా ఆ సామాను ఏర్పర్చారు అని.
మా ఇంట్లో ఇప్పుడు నెయ్యి నేను మా వారు తప్పితే ఎవరూ తినరు . ఆ రోజుల్లో ఎవరింట్లో అయినా నెయ్యి వడ్డన
బట్టి వాళ్ళ హోదా ని లెక్క చేసే వారు
ఇవే కాకుండా మంచినీళ్లు కి వాడే గ్లాసులు, బిందెలు, కాఫీ గ్లాసులు అన్నీ ఇత్తడి వే ఉండేవి.
ఈ సామాన్లు అన్నీ మా ఇంట్లో వాడటమే కాకుండా ఎవరి ఇంట్లో పెళ్లిళ్ళు అయినా తీసుకుని వెళ్ళే వారు.
మా పెద్దనాన్న గారు వున్నన్నాళ్ళు ఆయనే ఎవరికీ ఇచ్చినా ఒక బుక్ లో నోట్ చేసిపెట్టే వారు
ఆ యన తర్వాత మా అమ్మ గారు , అన్నయ్య లు ఈ పని చేసే వారు..
కొంచెం పెద్ద అయ్యాక ఈ పనులు నేను కూడా చేశాను , ఎవరు ఇచ్చారో మరలా వాళ్లే తీసుకునే టప్పుడు
లిస్ట్ చూడాలి.
ఎవరన్నా కొన్ని గ్లాసులు అవీ మిస్ చేస్తే పెద్ద నాన్న గారు కఠినం గా చెప్పేవారు , ఇంక మా పెత్తనం వచ్చాక చాలా
గ్లాసులు మిస్ అయిపోయాయి.
హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో యింటికి వాళ్ళు వచ్చి వంట చేసే వాళ్ళు అప్పట్లో అవసరం అవుతాయి అని కొన్ని గిన్నెలు , నేను మా వదిన కొన్నాము.. కానీ తర్వాత కేటరింగ్ వచ్చేసింది. ఇప్పుడు అటక మీద వస్తువులు తీయాల్సిన పనే లేదు...
కాఫీ అట్ఠ గ్లాసుల్లో తాగాలి అంటే అసలు సయించదు. ఇంక మంచి నీళ్ల బాటిల్స్ తో మనము ఈ భూమిని ప్లాస్టిక్ తో కలుషితం చేస్తున్నాము..
అసలు ఎంగిలి చేత్తో ఆ బాటిల్ ఓపెన్ చేయ లేము. ఆ భా ఫె భోజనాలు అంటే సర్కస్ చేయటం లాగానే వుంటుంది .
మా అత్త గారు , మా అమ్మ అయితే ఈ భోజనాలు కి విరక్తి వచ్చి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా బువ్వబంతి అందం రాదు అనే వారు.
మా ఇంట్లో మా అత్త గారి గిన్నెల్లో ఒక గోకర్ణం ఉంది చాలా రోజులు మా పిల్లలు ఆడు కున్నారు.
ఇప్పుడు మరచెంబు పక్కన షో కేసు లో చేరింది .
అవీ ఆనాటి పెళ్లి ముచ్చట్లు గూగుల్ లో వెతికితే ఆ వస్తువుల బొమ్మలు దొరుకుతాయేమో
శుభరాత్రి
.
,
Comments