top of page
Search

చిలకమ్మ చెప్పింది

murthydeviv
3 minutes ago
4 min read

*****

*చిలకమ్మ చెప్పింది*

==============

(జ్ఞాపకాల పందిరి)


(నేను రాసిన ఈ కథ షార్ వాణి అనే మాస పత్రికలో 2026 అక్టోబర్ నెలలో ప్రచురితమైనది)


రచన ::

బుద్ధవరపు కామేశ్వరరావు

హైదరాబాద్


అవి, మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని పుణ్య క్షేత్రం ద్రాక్షారామం దగ్గర ఉన్న జగన్నాధగిరిలో నేను మూడవ తరగతి చదువుతున్న 1965 నాటి రోజులు. ఆదివారం కావడంతో, ఇంట్లోని వీధిగదిలో కూర్చొని పాఠాలు చదువుకుంటున్నాం మా అన్నదమ్ములం.


ఏదో చదువుతున్నానన్న మాటే కానీ నా శ్వాస, ధ్యాస అంతా వంటింట్లోనే ఉంది. మా ఇంట్లో పిండి వంటలు వండే వెంకమ్మ గారు పొద్దున్నే ఎందుకు వచ్చారు? ప్రస్తుతం పండుగలు కానీ, అక్కలిద్దరూ వచ్చే వేడుకలు కానీ లేవు. మరి ఆవిడ ఎందుకు వచ్చినట్లు? రకరకాల ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోతోంది.


వంటింట్లోంచి, బొగ్గుల కుంపటి మీద అమ్మ కాలుస్తున్న మెట్టవంకాయల వాసన కమ్మగా వస్తోంది. అంతవరకూ బాగానే ఉంది కానీ, మరి ఆ బెల్లం పాకం, యాలకులు వాసన ఏమిటి? వెంకమ్మ గారు ఏం చేస్తున్నారు? పోనీ ధైర్యంగా లోపలికి వెళ్లి చూద్దామంటే అమ్మ వీపు విమానం మోతే అంటుందేమో అన్న భయం.


ఈలోగా వంటింట్లోంచి ఎవరో వీధిగదిలోకి వస్తున్న అడుగుల సవ్వడి వినబడడంతో, బహుశా అమ్మే అయివుండొచ్చని,


"కప్పు ఉప్పురంబు పోలిక ఒక్కటుండు..." అంటూ బిగ్గరగా చదవడం మొదలుపెట్టాను.


"ఏదో ధ్యాసలో ఉండి తప్పుగా చదువుతున్నావురా వెర్రి నాగన్నా!" అంటున్న వెంకమ్మ గారి గొంతు గుర్తుపట్టి,

పుస్తకం పక్కన పెట్టి,

జారుతున్న లాగును పైకి నెట్టి


"యాండీ, అప్పుడే వెళ్లి పోతున్నారేం? అప్పుడే పరమాన్నం వండడం అయిపోయిందా?" అంటూ ఓ చిన్న బాణం వేసా, అసలు విషయం బయటకు లాగడానికి.


"పరమాన్నం కోసం అయితే నేనెందుకురా, వెర్రి నాయనా? బెల్లం మిఠాయి తయారు చేసాం. అందుకే బాగా ఆలస్యం అయ్యింది. ఇదిగో పాపం అమ్మగారు అరటిపువ్వు కూర, వంకాయ పచ్చి పులుసు ఇచ్చారు. ఇంటికెళ్లి ఎసట్లో బియ్యం వేసుకోవాలి" తలమీంచి జారుతున్న ముతక చీరను పైకి లాక్కుంటూ హడావుడిగా వెళ్లిపోయారు వెంకమ్మ గారు.


ఈలోగా వంటింట్లోంచి


"వెలగబెట్టిన చదువులు చాలు కానీ, ముద్ద మింగుదురుగాని రండి" అన్న చెల్లూరు ఫ్యాక్టరీ సైరన్ లాంటి అమ్మ గొంతు వినబడడంతో అందరమూ విస్తర్ల వద్దకు చేరుకున్నాము.


***** ***** ***** *****


మొదటి ముద్ద, డాక్టర్ అయిన మా నాన్న గారు స్వయంగా తయారు చేసిన భాస్కర లవణంతో లాగించి, తరువాత అరటిపువ్వు, పెసరపప్పు ముద్ద కూర కలుపుకుంటూ


"మరి మిఠాయి బూందీ ఎప్పుడు వేస్తావు?" ధైర్యం తెచ్చుకుని అడిగాను.


"తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అనే సామెత నీ గురించే రాసి ఉంటారు. ఈ తెలివి తేటలు చదువు దగ్గర చూపించు. నా దగ్గర కాదు" కసురుకుంది అమ్మ.


"పోనీలేవే! కుర్ర వెధవ, వాడికి ఏమి తెలుస్తుంది. మధ్యాహ్నం ఏదైనా తినేటప్పుడు పెడుతుంది లేరా. ప్రస్తుతానికి అన్నం తిను" వంకాయ పచ్చిపులుసు కలుపుకుంటూ నన్ను సముదాయించారు నాన్నగారు.


అయిష్టంగానే ఏదో మొత్తం మీద భోజనం అయ్యిందనిపించి వీధిగదిలోకి వచ్చి పడుకున్నాను.


***** ***** ***** *****


"వెంకమ్మ గారు చేసిన మిఠాయి ఉండ ఏ సైజులో ఉంటుంది? బందరులో ఏ యమ్ ఐ ఈ చదువుతున్న పెద్దన్నయ్య తెచ్చే అరచెయ్యి సైజులో ఉండే బందరు లడ్డూ అంత ఉంటుందా? లేక తాతబ్బాయి కిరాణా కొట్లో ఉండే నిమ్మకాయ సైజు శెనగపప్పు ఉండంత ఉంటుందా?" ఇలా ఎడతెగని ఆలోచనలతో నిద్రలోకి జారుకున్న నాకు


"ఏవర్రోయ్! పడుకుంది చాలు కానీ లేచి అదిగో వంటింట్లో అందరికీ ఓవల్టీన్ గ్లాసులు పెట్టాను, వెళ్లి తాగండి" అన్న అమ్మ పిలుపుతో ఒక్కసారి ఉలిక్కిపడి లేచాను.


"మరి బెల్లం మిఠాయి ఎప్పుడు పెడతావు?' ఓవల్టీన్ గ్లాసు తీసుకుంటూ మళ్లీ అడిగాను.


"ఇది మీ కోసం కాదు, చిలకమ్మ కోసం" చెప్పింది అమ్మ, మిఠాయి ఉండలు ఖాళీ గ్లాక్సో డబ్బాలోకి సర్దుబాటు చేస్తూ.


"ఏమిటట ఆవిడ బోడి గొప్ప?" ఉక్రోషంతో అడిగాను, తాగిన ఓవల్టీన్ గ్లాసు పక్కన పెడుతూ.


"గొప్ప అంటే మరి గొప్పే. తను నీళ్లు పోసుకుంది" సర్దిన డబ్బా పక్కన పెడుతూ చెప్పింది అమ్మ.


"అదీ పెద్ద గొప్పేనా? మేము రోజు పోసుకుంటుంన్నాం కదా నీళ్లు? మరి మాకెందుకు చెయ్యవు? ఇలాంటి మిఠాయిలు?" ఉక్రోషంతో అడిగాను, భుజం మీద నుండి జారుతున్న నిక్కరు తాడును పైకి సర్దుకుంటూ.


"నోర్ముయ్, పండుకోతెధవా! పెద్ద ఆరిందలా ముదర మాటలూ నువ్వూనూ!" అంటూ నన్ను ఓ జెల్ల కొట్టడానికి లేవబోయింది. తృటిలో తప్పించుకున్న నా వైపు కోపంగా చూస్తూ,


"ఒరే బేబీ! ఇదిగో ఈ డబ్బాలో మిఠాయి ఉండలు ఉన్నాయి, పట్టుకుని వెళ్లి చిలకమ్మ గారి ఇంట్లో ఇచ్చేసి రా!" అంటూ ఓ గ్లాస్కో డబ్బా మా అన్నయ్య చేతిలో పెట్టబోయింది.


"నేను హోమ్ వర్క్ చేసుకోవాలే బాబూ! ఆ కామిగాడిని పంపించు" చెప్పాడు మా అన్నయ్య, నా పైవాడు.


"ఔను నాకు ఇయ్యి. నేను పట్టుకుని వెళ్లి ఇచ్చి వస్తా. ఇందాకా ఏదో అన్నావు కదా? తిండికి పోతురాజు పనికి తిమ్మరాజు అని!" అమ్మ డైలాగ్ ఆవిడకు అప్పచెప్పాను.


"సామెతలు కూడా సరిగ్గా చెప్పడం రాని సన్నాసీ, ఇందులో డజను మిఠాయి ఉండలు ఉన్నాయి. అవి పట్టికెళ్ళి చిలకమ్మ గారి ఇంట్లో ఇచ్చేసి రా! మధ్యలో మూత తీసి తిన్నట్టు తెలిసిందో వీపు విమానం మోతే!" అంటూ కుడి చేతి చూపుడు వేలు అటూ ఇటూ తిప్పుతూ, ఆఖరి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తూ, ఆ డబ్బా నా చేతిలో పెట్టింది అమ్మ.


ఆ డబ్బా తీసుకుని పది మెట్లూ టకటక కిందికి దిగుతూ, కింద ఉన్న అరుగు వద్దకు వచ్చాను. అక్కడ, నిన్ననే ఓ పోకుండ ఇచ్చి రెండు రోజులు పాటు ఉంచుకునేలా మా అమలకంటి కొండ గాడి దగ్గర అద్దెకు తీసుకుని ఉంచిన హంబర్ సైకిల్ టైరును దొర్లించుకుంటూ ఇంటి నుంచి బయలుదేరాను.


బూడిద తాతబ్బాయి ఇల్లు, దవులూరి దాసు ఇల్లు, కామాచార్యులు గారి ఇల్లు, అల్లంరాజు వెంకమ్మ గారి ఇల్లు దాటి అమలకంటి చిన్నబ్బాయి గారి ఇంటి ఎదురుగా ఉన్న తమ్మిరాజు గారి ఇంటి వద్ద నా వాహనం పెట్టి హడావిడిగా లోపలికి వెళ్లాను.


తమ్మి రాజుగారు ఇంట్లో వెనక వాటాలో ఉన్న ఇంటి తలుపు కొట్టగానే "ఎవరూ?" అంటూ వచ్చి తలుపు తీసారు చిలకమ్మ గారు. వెంటనే "ఈ మిఠాయి ఉండలు మా అమ్మగారు ఇచ్చారు మీకోసం!" అని ఆ డబ్బా ఆవిడ చేతిలో పెట్టాను. ఆవిడ "అమ్మగారికి ఎంత ప్రేమో నేనంటే" అంటూ ఆనందంగా ఆ డబ్బా తీసుకొని లోపలికి వెళ్లారు.


నేను ఇంకా అలాగే నిలబడి ఉండడం చూసి "ఓహో ! మర్చిపోయాను. నీకు ఏదైనా తాయిలం పెట్టాలి కదూ?" అంటూ లోపలికి వెళ్లి ఒక పెద్ద సైజు గోరుమిటీ తీసి నా చేతిలో పెట్టి "ఇదిగో పండూ! మొన్న మీ అమ్మగారు నిమ్మకాయ పచ్చడి పంపించారు, చాలా బాగుందని చెప్పు" అంటూ ఓ ఖాళీ సీసా నా చేతిలో పెట్టారు. నేను ఆ గోరుమిటిని అక్కడే తినేసి, వెళ్లే ముందు ఆవిడతో "మీరు వారానికి ఒకసారైనా నీళ్ళు పోసుకోండి" అన్నాను.


"అలా ఎందుకురా?" అన్నారావిడ ఆశ్చర్యంగా!


"ఎందుకంటే, మీరు అలా నీళ్ళు పోసుకుంటే మా అమ్మ మీకు ఇలాగే మిఠాయిలు పంపిస్తుంది" అని చెప్పేసి, అక్కడి నుంచి హడావిడిగా ఇంటికి బయలుదేరి వచ్చేసాను.


ఇంటికి వచ్చి అమ్మతో జరిగిన విషయం చెప్పి, చిలకమ్మ గారు ఇచ్చిన ఆ ఖాళీ ఊరగాయ సీసా అమ్మ చేతిలో పెట్టాను. అది చూసిన అమ్మ ఒక్కసారి బిత్తరపోయి, "ఏమండీ చూశారా? మీ వాడి ఘణకార్యం? ఆ మిఠాయి ఉండలు రామ్మూర్తి రాజుగారి కూతురు చిలకమ్మకి ఇస్తాడు అనుకుంటే, తమ్మిరాజు గారి ఇంట్లో ఉండే చిలకమ్మ గారికి ఇచ్చి వచ్చేసాడు. పాపం వీడి మాటలకు ఆ ముసలావిడ ఏమనుకుంటారో ఏమిటో?" అని అమ్మ అనగానే, నాన్నగారు


"మరి నువ్వు వాడికి వివరంగా చెప్పాల్సింది. సర్లే, ఇప్పుడు కూడా మించి పోయింది ఏమీ లేదు. అంతకీ కావాలంటే, మెయిన్ రోడ్డు మీద ఉన్న సలాది బూరయ్య కొట్లోంచి మిఠాయి తెప్పించి ఆ అమ్మాయికి ఇద్దువుగానిలే" అన్నారు నాన్న సమస్యను సర్దుబాటు చేస్తూ!


"ఇలాంటి సలహాలు ఇవ్వాలంటే మీ తరువాతే ఎవరైనా! నాకు ఆ మాత్రం తెలియదా ఏమిటీ? చిలకమ్మ కడుపుతో ఉన్న పిల్ల కదా అని, ఇంట్లో శుభ్రంగా చేసి పంపించాను. ఈ సన్నాసి అలా చేసి తగలడ్డాడు" అని అమ్మ నన్ను కొట్టబోయేటప్పటికీ యాధా ప్రకారం అక్కడి నుంచి తప్పించుకుని పడక గదిలోకి పారిపోయాను.


ఆ తర్వాత "భగవంతుడా! ఈ సమస్య నుండి నువ్వే కాపాడు తండ్రీ" అని దేవుడుకి ఓ అర్జీ పెట్టుకున్నాను. కాసేపటికి వీధి తలుపు చప్పుడు అవ్వడంతో అమ్మ వెళ్లి తలుపు తీసింది.


"అమ్మగారూ! నేను తమ్మిరాజు గారి ఇంట్లో పని చేసే కిట్టయ్యను. ఇందాకా మీ అబ్బు గారు మా చిలకమ్మ గారికి పొరపాటున ఈ డబ్బా ఇచ్చేసి వచ్చారుట" అంటూ మిఠాయి ఉండల డబ్బా అమ్మ చేతిలో పెట్టాడు. అంతే! అమ్మ మొహం వెయ్యి వాల్టుల బల్బులా వెలిగిపోయింది.


అప్పుడు "భగవంతుడా! నన్ను ఈ కష్టం నుంచి కాపాడడానికి ఈ కిష్టయ్య రూపంలో వచ్చావా తండ్రీ!" అని మనసులో అనుకుంటూ హాయిగా నవ్వుకుంటూ కిందకు జారిన లాగును పైకి సర్దుకుంటూ బయటికి వచ్చి ,


"సరేలే! అయ్యిందేదో అయ్యింది. ఆ డబ్బా ఇలా ఇయ్యి. రామ్మూర్తి రాజు గారి ఇంట్లో చిలకమ్మ కి ఇచ్చి వస్తాను" అని చెప్పగానే


"చేసిన నిర్వాకం చాలురా అడ్డ గాడిదా? ఆనక గన్నెయ్య తాత వచ్చిన తరువాత ఇచ్చి పంపిస్తాను కానీ, నువ్వు వెళ్ళి ఆ వోమ్ వర్కు చేసుకుని తగలడు. లేకపోతే వీపు విమానం మోతే" అని సున్నితంగా చెప్పడంతో ఇంక విధిలేక, అన్యమనస్కంగా పుస్తకాల సంచీ తెరిచాను, జరిగిన ఘోర అవమానాన్ని తలుచుకుంటూ!


ఏమండీ! మీరు పెద్దవారు. ఇప్పుడు మీరే చెప్పండి? ఎవరైనా చిరునామా చెప్పినప్పుడు పూర్తిగా చెప్పాలి కదా? అలాగే నీళ్లు పోసుకోవడం అంటే ఏమిటో పూర్తిగా వివరించి చెప్పాలి కదా? అంతే కానీ ఇలా సగం సగం చెబితే, మరి నాలాంటి చిన్న పిల్లలకు ఎలా తెలుస్తుంది?


సరే కానీ ఇంతకీ నేను చేసింది తప్పా? ఒప్పా అనేది మీరే కొంచెం పెద్ద మనసు చేసుకుని చెప్పండి.



***** **శుభం** *****

 
 
 

Recent Posts

See All
ముచ్చట్లు

కబుర్లు ఇంకా దసరా నవరాత్రి పూజలు , బడలి క తీర కుండానే దీపావళి పరిగెత్తి వస్తోంది. మా ఇంటి చుట్టు ప్రక్కల వున్న షాపు లు లైట్స్ తో ధ గ ధగా మెరిసిపోతున్నాయి. మా అబ్బాయి 90 91 సంవత్సరాల లో

 
 
 
కామాక్షి అమ్మ

శ్రీ కంచి కామాక్షి: మోక్షపురి నడుమ "కామ" ఎందుకు ఉంది? కామకోటం, కామాక్షి మరియు కోరికల రూపాంతరం కాంచీపురం సాంప్రదాయకంగా సప్త మోక్షపురీలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర క్షేత్ర భూగోళం నడుమ కామాక్షి ద

 
 
 
సీ రామచంద్ర గారి మధుర గీతాలు .

ఈ మధ్య సినిమా పాటలు గురించి రాసి చాలా రోజులు అయింది. ఈ రోజు ఏదో పుస్తకం కోసం బీరువా లో వెతుకుతూ ఉంటే రమణ గారి సినీ రమణీయం బుక్ కనిపించింది. రమణ గారి బుక్ కనిపిస్తే చూడ కుండా ఎలా అనుకుంటూ తెరి

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page