ఈ డేట్ కి మన కథ కూ ఏమిటీ సంబంధం అనుకుంటాము. కానీ మామూలు గా సాగిపోయే జీవితాల్లో ఒక్కొక్క సారి మంచి అనుభవం లేదా భయంకరమైన అనుభవం ఎదురు అవ్వచ్చు. ఆ క్షణం లో మన చేతిలో ఏమీ ఉండదు ప్రేక్షక పాత్ర మాత్రమే. అలాంటి అనుభవం గురించి రాస్తున్నాను. మామూలు గా మా వారు పిలానీ వెళ్ళి నన్నూ పాపను ఢిల్లీ అన్నయ్య దగ్గర దింపి వెళ్ళారు. నాలుగు రోజుల తర్వాత ఆయన వచ్చాక డిల్లీ నుండి రెండు గంటల కు బస్ ఎక్కాము. మామూలుగా అయితే సాయంత్రం ఆరు గంటలకు మా వూరు చేరిపోతాము. కురుక్షేత్రం కూడా ఆ రూట్ లోనే వస్తుంది. ఆ వూరు దాటింది లేదో కానీ వరసగా బస్సులు అన్నీ ఆగిపోయి వున్నాయి. రోడ్స్ అన్నీ మిలటరీ వ్యాన్లు. అంతా హడావిడి గా చెకింగ్ చేస్తున్నారు. ఇంతకీ విషయము ఏమిటంటే ఇందిరా గాంధీ పాకిస్తాన్ మీద వార్ డిక్లేర్ చేసింది ఈస్ట్ పాకిస్థాన్ గురించి. అప్పటికి ఆ దేశము పేరు అదే కదా. అంబాలా లో కంటోన్మెంట్ వుంది కాబట్టి ఇపుడు ఏ బస్సులు కదలవు. ఎపుడు కదుల్తాయో కూడా తెలియదు. మిలటరీ వాళ్ళు బస్సుల్లో ఎక్కి బాంబు లు పడితే ఏమి చేయాలో ఎలా పరిగెత్తి బంక్ లో కూర్చో వాలో చెపుతున్నారు అక్కడే రోడ్డు కు దిగువ కొన్ని గుంటలు చూపెట్టారు. బంక్ లు అంటే అవే ట. అది డిసెంబరు కాబట్టి ఐదు గంటల కే చీకటి పడిపోతుంది. అంతా కటిక చీకటి, బస్ లో నుంచి కదలటానికి వీలు లేదు. అక్కడే ఉన్న పెట్రోల్ బంక్ వాళ్లు మాత్రం ఎక్కడి నుండి తెచ్చారో పాపము పిల్లలకు ఒక గ్లాసు పాలు ఒక బిస్కెట్ పాకెట్ ఇచ్చారు. కటిక చీకటి పాపం మా పాప అలాగే నన్ను బల్లి లాగా అంటుకొని పడుకుంది. నేను అయితే అలా హనుమాన్ చాలీసా చదువుతూ కూర్చున్నాను. తెల్లవార్లూ ఎవరికీ నిద్ర లేదు. మర్నాడు ఉదయం ఎనిమిది గంటల నుండి అందరినీ మిలటరీ వాను ల్లో ఎక్కించి పంపారు. మేమూ అలా ఆ వాను ల్లో ఇల్లు చేరుకొనే టప్పటికి మూడు గంటలు అయింది. ఆ వూరి కి అంబాల దగ్గర కాబట్టి వూరు లో కర్ఫ్యూ వున్నది. రాత్రి పూట బ్లాకు ఔట్ అని అందరూ అద్దాల కిటికీలకు నల్లటి పేపర్లు అంటించాలి సాధ్యమైనంత వరకూ లైట్లు వేయకూడదు. అలా మిలటరీ వాళ్ళు వచ్చి అందరికీ చెప్పి వెళుతున్నారు. ఈ లోపల మా అన్నయ్య జి ఎమ్ గారింటికి ఫోన్ చేశాడని వాళ్ళ అబ్బాయి నాలుగు సార్లు మా ఇంటికి వచ్చి వెళ్ళాడుట.మా వారు వెళ్లి అన్నయ్య తో చెప్పి వచ్చారు. ఇంటికి రాగానే నల్ల కాగితాలు మిలటరీ వాళ్ళు ఇచ్చినవి అంటించి ఆ చీకటి లో అలా పడుకుంటే జీవితంలో ఇలాంటి అనుభవం కూడ వుంటుందా అనిపించింది. ఆ బస్ లో కూర్చున్నతసేపు ఒకటే ఆలోచన మరలా ఇల్లు చేరుతమా, మన వాళ్ళని చూస్తామా అనే ఆలోచన.బస్ లో గట్టి గా మాట్లాడ లేము. నేనూ మా వారు ఒకరి చేయి ఒకరము గట్టి గా పట్టుకొని కూర్చున్నాము. ఆ కర్ఫ్యూ వున్నపుడు ఉదయాన్నే వెళ్ళి ముందు పాపకు కావాల్సిన పాలు అవీ తెచ్చుకొని ఇంట్లో తలుపులు వేసికొని కూర్చోటమే. ఒక వేళ ఎవరింటికి వెళ్ళినా మర్నాడు దాకా అక్కడే వుండాలి. మావారి డిపార్టుమెంటు లో ఉన్న బ్రహ్మచారులు వచ్చి రెండు రోజులు వుండి వెళ్ళారు. ఆపుడు మాత్రం నాకు వాళ్ళ బ్రిడ్జి ఆట మీద కోపము రాలేదు. ఆపుడు అర్థము ఆయింది మనిషి కిమనిషి తోడు వుంటే ఎంత హాయి గా వుంటుందో అని . మా మిలటరీ తమ్ముళ్లు ఎక్కడ వున్నారో అని మేము అందరమూ కొంచెం భయ పడ్డాము. అయినా వాళ్ళు టెక్నికల్ సైడ్ కాబట్టి బాగానే వుండి వుంటారు అని మాత్రం అనుకున్నాము. ఏ రోజూ ఎపుడు సైరన్ మోగుతుందో అని ఒకటే భయము. రాత్రుళ్లు అయితే మరీ భయము. మా వారు మాత్రము ప్రతి దానికీ అలా ఆలోచించి భయపడకు అని విసుగు పడే వారు. ఆయన ఎపుడూ ఏ పరిస్థితి అయినా దైర్యం గా ఎదుర్కునేవారు. భయ పడే వారు కాదు. అలా ఒక పదిహేను రోజులు గడిపామో అనుకుంటాను. అపుడే ఒక రోజు రాత్రి మావారు యింట్లో నుండి బయటకు వచ్చి సిగరెట్టు వెలిగించారు. ఒక్క పది నిమిషాల్లో ఇద్దరు మిలటరీ వాళ్ళు వచ్చి క్యా. సాబ్, అప్ పడా లిఖా హై, సిగరెట్ క్యో జ లా థీ హై అని అడిగారు. ఆ చీకట్లో సిగరెట్టు లైట్ చాలా బ్రైట్ గా క నిపిస్తుందిట. ఏదో అలవాటు గా బయటకు వచ్చి సిగరెట్ వెలిగించాను, సారి అని చెప్పారు. ఒకరోజు పగలే సైరన్ మోగింది. మేము వెళ్ళి ఒక గంట సేపు ఆ బంక్ లో కూర్చున్నాము. అబ్బ జీవితంలో ఇలాంటి అనుభవం వద్దురా బాబూ అనుకున్నాను. అలా దిన దిన గండంగా ఒక పదిహేను రోజులు గడిచాక, ఇండియా హెల్ప్ తో బంగ్లాదేశ్ ఏర్పడింది మాకు ఈ యుద్ధం బాధలు తొలగి పోయాయి. మా తమ్ముళ్లు మంచి స్వీట్స్ తీసుకొని వచ్చారు. మరలా మా మామూలు జీవితము మొదలు అయ్యింది. కానీ మన కన్నా నార్త్ ఇండియన్ వాళ్లకు దేశ భక్తి ఎక్కువ ఎందుకంటే వాళ్ళే ఎక్కువ గా ఇలాంటి బాధలు పడ్డారు అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ ఆరోజులు తలచుకుంటే భయము అనిపిస్తుంది.
1971 డిసెంబరు ఒక అనుభవం
murthydeviv
Comments