top of page
Search

రథ సప్తమి జ్ఞాపకాలు

  • murthydeviv
  • Feb 5
  • 3 min read

. కొంచెం పెద్ద వాళ్ళం అయ్యాక గడిచి పోయిన రోజులు గుర్తు వస్తూ ఉంటాయి చిన్నతనంలో చదువు తర్వాత పెళ్లి పిల్లలు, బాధ్యతలు జీవితము మనం ఆలోచించ కుండానే పరిగెత్తి పోతూ ఉంటుంది. ఇపుడు కావాల్సినంత తీరిక ఏ పని చేయటానికి ఓపిక వుండదు. వున్నా చేయాలనే కోరిక వుండదు. అలా జరిగిపోయిన రోజులన్నీ గుర్తు వస్తూ ఉంటాయి. రైలు ప్రయాణం లో కలిసి ప్రయాణించిన వాళ్ళు వాళ్ళ గమ్యం రాగానే దిగిపోయినట్లు ఒక్కొక్కరు వెళ్లిపోతుంటారు, మన గమ్యం ఎక్కడో, ఎపుడు దిగుతామో కూడా తెలియదు. ఆ గమ్య స్థానం కోసం ఎదురు చూస్తూ వుండాలి. భవిష్యత్ లో చేయాల్సిన పనులు ఏమీ లేకపోతే ఇంక గతం గురించి ఆలోచించుకోవటమే పని. నాకు అయితే అందులో ఆనందం వున్నది. మా చిన్న తనం లో అయితే మా బామ్మ లు, అమ్మమ్మ ఎపుడూ జరిగిపోయిన రోజులన్నీ గుర్తు చేసుకుంటూ మనకు కథలగా చెప్పే వారు. ఆ సంగతులన్నీ మనం కూడా వినేవాళ్ళం. ఇపుడు ప్రశాంతంగా వుందామన్నా ఏవో అలా గుర్తు వస్తూ వుంటాయి. పిల్లలు వినకపోయినా సోషల్ మీడియా వింటుంది కదా. సంక్రాంతి సంబరాలు అవగానే అమ్మ రేపు ఉదయం త్వరగా లేవండి రథసప్తమి జిల్లేడు ఆకులు పెట్టుకుని తల స్నానము చేయాలి అని ఆర్డర్ చేసేది. మా చెల్లెళ్ళు తు చ తప్పకుండా త్వరగా లేచి స్నానాలు చేసి మా చిన్న నాయనమ్మ గారి దగ్గర కూర్చునే వాళ్ళు. మా నాయనమ్మ అప్పటికే భోజనాలు చేసే పంచలో సూర్యుడు ఉదయించే టైమ్ కల్లా ఎండ బాగా వచ్చే చోట శుభ్రం గా కడిగి ముగ్గులు వేసి గొబ్బెమ్మల తో చేసిన పిడకలతో పొయ్యిలాగా పెట్టీ ఇత్తడి గిన్నె కు పసుపూ కుంకుమ పెట్టీ ఆవు పాలు పెట్టేది. మా చిన్న నాయనమ్మ ఏదయినా పండగ రోజున సన్నటి ఆరంజ్ అంచు తో వున్న గోధుమ రంగు పట్టు బట్ట కట్టుకుని నుదిటి మీద విభూతి పెట్టుకుని ఒక యోగిని లాగా వుండేది. ఆవుపాలు పొంగుతున్నపుడు అందరూ నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పాలల్లో బియ్యము వేస్తూ మా పేర్లు అన్నీ చదివేది. చిక్కుడుకాయలతొ ఒక రథం లాగా చేసీ ఆముగ్గు మీద పళ్లెం లో సూర్యుడి విగ్రహము కు పూజ చేసేది ఆ పరావన్నం సూర్య కిరణాల కాంతి పడుతూ ఉంటే వుడికేది. ఆ పరవాన్నం ఉ డుకు తున్నపుడు సూర్యుడి మీద ఎన్నో పాటలు పాడుతూ వుండేది. రోజూ సూర్య నమస్కారం చేసుకునే నాన్న గారు కూడా ఆరోజు అక్కడ నుంచుని చాలాసేపు స్తోత్రమ్ లు చదివే వారు బహుశ ఆదిత్య హృదయం చదివే వారు అనుకుంటా. ఆ రోజుల్లో అవ్వన్నీ తెలియవుకదా. మా దృష్టి అంతా ఆ చిక్కుడు అకుల మీద పెట్టిన పొంగలి మీద వుండేది. ఆ పొంగలి కు వున్న రుచి అమోఘం అనిపిస్తుంది. మా చిన్న నాయనమ్మ పాడిన పాటలు తర్వాత తెలుసుకుని నేర్చుకున్నాను. ఆ రోజుల్లో పెద్దవాళ్ళ దగ్గర రాసుకుని నేర్చుకోవాల్సిందే. ఇంత సోషల్ మీడియా నెట్వర్క్ లేదు కదా. మాఘ మాసంలో, కార్తీక మాసంలో గుడి లో హరికథలు చెప్తూ వుండేవారు. మా నాయనమ్మ మమ్మల్నీ గుడికి తీసుకొని వెళ్ళేది. కార్తీక మాసం లో శివాలయంలో పూజ కు మమ్మల్నీ తీసుకొని వెళ్ళేది. ఒక సంచీలో బియ్యము తీసుకొని దారిలో బిచ్చగాళ్లకు మా చేత ఆ బియ్యము వేయించే ది. గుళ్లో చక్కగా ముగ్గులు వేసి కొబ్బరి చిప్పల్లో ఆవునెయ్యి దీపాలు మా చేత పెట్టించేది. ఇప్పటికీ రథ సప్తమి అన్నా, కార్తీక మాసం అన్నా మాకు మనసులో నాయనమ్మ గుర్తు వస్తుంది.. అప్పట్లో మాఇంట్లో అవులు వుండేవి. రథ సప్తమి నాడు, నాగుల చవితి రోజున చాలామంది ఆవుపాల కోసం వచ్చేవాళ్ళు. ఇంక దూడలు పుట్టినపుడు అయితే ఆవు జున్ను తింటే కాశీకి వెళ్లి న పుణ్యము వస్తుందనీ చాలా మంది వచ్చే వారు. నాయనమ్మ అయితే అందరికీ ఓపికగా కొంచెం అయినా పెట్టేది. ఒక ఎర్రటి అవు వుండేది మా రెండో అన్నయ్య కు ఆ అవు అంటే ప్రాణము గా వుండేది. రోజూ ఆ ఆవు కు ప్రదక్షిణం చేస్తూ అన్నయ్య ను కూడా చేయ మనేది. నాకు ఇప్పటికీ ఒక విషయము చాలా ఆశ్చర్యం గా వుంటుంది. మా నాయనమ్మ దారం తో ఎన్ని పోగులు వేసేదో గుర్తు లేదు కానీ కొన్ని ముడులు వేసి విభూది డబ్బాలో పెట్టేది. ప్రతి ఆదివారం, గురువారము చుట్టు పక్కల వాళ్ళు వచ్చి చంటి పిల్లలకు కట్టాటానికి తీసుకుని వెళ్ళే వారు. నేను కొంచం పెద్ద అయ్యాక ఏదయినా మంత్రము వుందా అని అడిగాను. ఆమె నవ్వుతూ నమ్మకం అనే మంత్రము అని చెప్పేది. వచ్చిన వాళ్ళు ఒక అణా ఇచ్చేవాళ్లు. చాలా నోములు పూజలు చేసినా నాయనమ్మ మంచితనం, ఆమె నిస్వార్థ సేవ నిజమైన మంత్రం అనిపిస్తుంది. ఆమె మా మనస్సుల్లో ఎంత గా నిలచిపోయింది అంటే కార్తీక పౌర్ణమి, సోమవారం, రథ సప్తమి అనగానే ముందు మాకు మా చిన్న నాయనమ్మ ఆ పంచ, ఆ పిడకల పొయ్యి ఆ పొంగలి రుచి గుర్తు వస్తుంది.ప్రతి శనివారం రాముల వారి పూజ చేసీ, అక్షింతలు చేతిలో పెట్టీ ఒక కథ చెప్పేది. తర్వాత గోధుమపిండి. నెయ్యి బెల్లం వేసి కలిపిన ప్రసాదము పెట్టేది. నాకు ఇపుడు ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు అన్నీ చదివాక ఆమె బహుశ కొద్ది గా వున్న కర్మ అనుభవించటానికి జన్మ ఎత్తిన యోగి అనిపిస్తుంది. మా అత్త గారు కూడా రథ సప్తమి కి ఈ హైద్రాబాద్ లో పొయ్యి పెట్టీ ఇత్తడి గిన్నె లో పాలు పొగించే వారు. అవిడ చాలా నోములు పట్టారు. నా చేత కూడా చాలా పట్టించారు. అవిడ మాఘపు ఆదివారాలు అని నోము పట్టారు. నన్ను కూడా పట్టమన్నారు కానీ నా కెందుకో దైర్యం చాలలేదు. ఆ నోము కు ఒక సంవత్సరం పాలు, ఇంకో సంవత్సరం పెరుగు, పప్పు. ఇలా మానేయాలి అన్నారు. కష్టము అవుతుందేమో అని నేను పట్ట లేదు. ఉద్యాపన కూడా దంపతులు కూర్చుని చేయాలిట. అలా రథ సప్తమి అనగానే మన బాల్యం మన పెద్ద వాళ్ళు అందరూ గుర్తు వస్తారు. మంచిదే కదా, వాళ్ళఆశీస్సులు మనకు లభించాలని కోరుకుంటూ ఎందరో మహానుభావులు అందరికి వందనములు.

 
 
 

Recent Posts

See All
అమృత హస్తం

ఈ మధ్య మా కోడలు పుట్టిన రోజున మా పిల్లలు హోటల్ కు డిన్నర్ కు తీసుకుని వెళ్ళారు. హోటల్ పేరు ఎర్ర కారం. గుంటూరు కారం సినిమా లాగానే ఆ పేరుకు...

 
 
 
పెళ్ళి పెట్టె

మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో...

 
 
 
రూట్స్

ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది....

 
 
 

Komentar


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page