ఈ టైటిల్ చూసి మా అమ్మ గారు మాకు భగవద్గీత గురించి చెప్పారు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. అసలు మా అమ్మ గారు ఎప్పుడయినా గీత చదివారో లేదో నాకు తెలియదు కానీ, గీత లో చెప్పినట్లు అమ్మ ఎపుడూ వర్క్ ఇస్ వర్షిప్ లాగా వుండేది. మేము కొంచెం పెద్దవాళ్ళం అయిందాకా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అత్తయ్య లు, పెద్దమ్మ లు బామ్మ లు చాలామంది మధ్య పెరిగాము. ఇల్లంతా ఎపుడూ ఏదో హడావిడి గా వుండేది. మా అమ్మ గారు కూడా అందరి అవసరాలు తీరుస్తూ చాలా బిజీగా వుండేవారు. మా తాతగారు వుండటం వలన ఆయన మనవళ్లు, మనవరాళ్లు పెళ్ళిళ్ళు అన్నీ అయన సమక్షం లో జరిగేవి. ఆ పెళ్ళి పనులు అన్నీ మా బామ్మలు పర్యవేక్షణ లో మా అమ్మ చేస్తూ వుండేది. బాగా చిన్న తనంలో అమ్మ ఎపుడూ ఏదో ఒక ఫంక్షన్ వుంది అని మమ్మల్ని ఉదయాన్నే లేపి చక్కగా తయారు అవమని చెప్పేది. ఇంక పండగ లు వస్థే చెప్పక్కర్లేదు. ముందు రోజే ఇంటినిండా ముగ్గులు పెట్టీ, మర్నాడు ఉదయం మా నాన్న గారి పూజ అయ్యే టైముకి హారతి పాటలు పాడటానికి రెడీ గా వుండాలి. ఏ మాత్రం బద్ధకం పనికి రాదు. ఏ పన్లో ఎంత హడావిడి లో వున్నా పిల్లలం ఎపుడూ కళ కళ లాడుతు వుండాలి. ఇంటి నిండా ఉన్న బంధువుల, పెద్దవాళ్ళ, అవసరాలు తీర్చడం, వంట వాళ్ళను, పనివాళ్ళు ను పర్యవేక్షణ చేయటం. ఇపుడు ఆలోచిస్తే అమ్మ ఎలా మేనేజ్ చేసిందో అనిపిస్తుంది. మేము పెద్ద వాళ్ళం అయ్యాక స్కూల్ చదువులే కాక, ఎపుడూ మమ్మల్ని ఎంబ్రాయిడరీ, ముగ్గుల నేర్చుకోమని ప్రోత్సహిస్తూ వుండేది. వూరికే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే అమ్మ కు అసలు నచ్చేది కాదు. ఏమిటా సోది అని ఒక చురక వేసేది. ఇక ఆమె ఆప్యాయత గురించి ఆలోచిస్తే ఏదో గొప్ప గా రాస్తున్నాను అనుకుంటారేమో గానీ, ఇపుడు ఆలోచిస్తే నాకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనం ఇంత చదువుకున్నాం లోకము వాళ్ళ కన్నా ఎక్కువ చూశాము, కానీ ఆ సమర్థత ఎందుకు రాలేదో అనుకుంటాము. ఈ రోజుల్లో మన ఇల్లు మన పిల్లలు ఇంత కన్నా ఎక్కువ ఆలోచించము. వాళ్ళ చదువుకోకపోయినా విశాలమైన దృక్పథం కలిగివుండేవారు. మా ఇంట్లో మా బంధువుల పిల్లలు చాలా మంది చదువుకున్నారు.మా అన్నయ్యల దగ్గర నుండీ మా వరకూ మాతో పాటు కలిసి మా ఇంట్లో చదువుకున్న మా స్నేహితులు ఎప్పుడయినా కలిస్తే అమ్మ ఆప్యాయత గురించి తప్పక తలచుకుంటూ వుంటారు. ఆ క్షణం లో చాలా గర్వంగా వుంటుంది . మా చిన్న తనం గురించి రాయాలంటే ఎన్నో విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మా వూరి కి దగ్గరగా పల్లెటూరు లో పొలం నుండి ఏడాది కి ఒక సారి వడ్లు వచ్చేవి. ఆ రైతులు ఎపుడు బయలు దేరుతారు అనేది తెలియదు కాని, రాత్రీ ఏడు, ఎనిమిది గంటలకు బండ్లలో వచ్చేవారు. ఆ వడ్లు అన్నీ పా తర్లులో నింపే వారు. ఆ కార్యక్రమం అంతా చాలా హడావిడి గా ఒక రెండు, మూడు గంటల జరిగేది. ఆ రాత్రీ పూట అమ్మ, మా చిన్న నాయనమ్మ గారు కలిసి ఆ రైతులకు అన్నం పప్పు పులుసు, వండి పచ్చడి తో సహా వడ్డించే వారు. మేము కూడా ఏదో ఉడత భక్తి గా మంచినీళ్ళు, మజ్జిగ వడ్డించే వాళ్ళం. ఇప్పటి లాగా హోటల్లో తినమని చెప్పటం కాదు వాళ్ళు ఎపుడు వస్తారో తెలియదు కాబట్టి ముందే వండి వుంచటానికి వీలు కాదు. మా చిన్న నాయనమ్మ మా నాన్న గారి మేనత్త, చాలా ప్రేమ గా వుండేవారు. ఇప్పటికీ రోజు కు ఒకసారైనా ఏదో సందర్భంలో గుర్తు వస్తూ వుంటారు. ఇంక ఆ వడ్లు దంచటానికి పనివాళ్ళు వచ్చే వారు. ముందు వెళ్లి మనం వడ్లు కొలిపించాలి. వాళ్ళు దంచాక మరలా బియ్యము కొలిపించాలి. మేము కొంచెం పెద్దవాళ్ళం అయాక అమ్మకు సాయంగా ఇలాంటి పనులు కొంచెం చేస్తూ వుండేవాళ్ళం ఇవ్వన్నీ ఎందుకు చెపుతున్నానంటే ఆరోజుల్లో జీవన విధానము ఎలా వుండేదో తెలియటానికి. ఇంక ఊరగాయలు పెట్టటం అంటే పెద్ద యజ్ఞము చేసినట్టే. మా అమ్మ గారు జాయింట్ ఫ్యామిలీ లో అందరితో ఎంత కలసి మెలిసి ఉండేవారో తన కోడళ్ళ తో కూడా అలాగే వుండేవారు. అనూహ్య మైన పరిస్తితుల్లో కూడా సమస్యలను ఎంతో దైర్యం గా ఎదుర్కొనేవారు. అమ్మ గురించి ఎంత వ్రాసినా ఇంకా ఎంతో రాయాల్సినది వుంది అనిపిస్తుంది. మా అత్తయ్య , మా అమ్మ గారి మధ్య ఎంత ఆత్మీయత వుండేదో నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మా ఇంట్లో ఏ అవసరము వచ్చినా అత్తయ్య వచ్చి నిలబడేది. ఇంక మా అమ్మ గారు ఒక చెల్లెలు లాగా అన్ని వేళల్లో అత్తయ్య కు అండగా వుండేది. మా అమ్మ గారు తొంభై ఏళ్ళు వున్నారు. రోజూ పూలు కట్టి రాముల వారి విగ్రహాలకు దండలు వేసేది. పాటలు పాడేది. మా పిల్లల కు కూడా పాటలు నేర్పించింది. తన మనవరాళ్లు అందరినీ బాగా చదువుకుని ఉద్యోగం చేయమని ప్రోత్సహించేది. ఎపుడూ ఉత్సాహంగా వుండేది. ఎవరి పెళ్లిరోజులు పుట్టినరోజులు అయినా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేది. ఎపుడూ ఎవరి గురించీ చెడు చెప్పేది కాదు. మేము ఎవరి గురించి మాట్లాడినా అమ్మ కు ఇష్టం వుండేది కాదు ఎంత క్లిష్టమైన సమస్యలు వచ్చినా పరిష్కారం గురించి ఆలోచించేది. సమస్య గురించి బాధ పడేది కాదు. నా పెళ్లి అయ్యాక కూడా అమ్మ దగ్గర గా 35ఏళ్లు గడిపాను. చదువు కోక పోయినా అవిడ ఆలోచనా విధానం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది అందుకే మొదట నే రాశాను, ఆమె గీత చదవక పోయినా మంచితనం, శ్రద్ద ఓర్పు వుంటే జీవితము ప్రశాంతముగా గడుస్తుందని. మాకు తెలియ చెప్పింది. అయితే మేము ఎంత వరకు పాటి స్థా మో తెలియదు. ప్రతి వాళ్ళ కు అమ్మ అంటే గౌరవం వుంటుంది. నాకు మాత్రం ఆమె సంస్కారానికి ఆశ్చర్యం వేస్తుంది. ఎంత రాసినా ఇంకా ఎంతో చెప్పలేకపోయాను. ఏ లోకంలో ఉన్నా అమ్మ ఆశీస్సులు మా కుటుంబానికి వుండాలని అమ్మ కు నమస్కారములతో..
మా అమ్మ గారి గీతోపదేశం.
murthydeviv
మీ అమ్మగారి జీవితమే ఒక భగవద్గీత. మనం చూసి నేర్చు కోవటమే .