top of page
Search

జిలేబి

  • murthydeviv
  • Jan 21
  • 2 min read

మా అత్తయ్య గురించి రాయదగ్గ గొప్ప విశేషాలు ఎన్నో వున్నా ముందు తీయగా మొదలు పెడదామని జిలేబి గురించి రాస్తున్నాను. ముందు నాకు మా పెద్దవాళ్ళ గురించి తలచుకోగానే కళ్ళలో నీరు వస్తుంది. వాళ్ళు ఏమి చదువు కోలేదు. ఎక్కువ ప్రపంచం చూడలేదు. అయినా ఏదో గొప్ప వ్యక్తిత్వం కలిగి వుండే వారు. ప్రస్తుతం మనం వాళ్ళని తలచుకొని మనకు కూడా శాంతి సౌఖ్యాలు ఇవ్వమని ప్రార్థించాలి. మా అత్తయ్య ఎన్నో స్వీట్స్ చేసేది. మాకు బాగా గుర్తు వున్న జిలేబి, బెల్లము లడ్డు, యింకో స్పెషల్ స్వీట్, గడ్డి హల్వా అని చేసేది. ఆ గడ్డి హల్వా అయితే ఐస్ లాగా చేతిలో నుండి జారీ పోతూ ఉండేది. అయితే అది నిల్వ వుండే స్వీట్ కాదు. కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో తరచుగా తినే వాళ్ళం. తర్వాత అర్దం అయ్యింది ఏమిటంటే దాన్ని చైనీస్ గ్రాస్ అంటారు అని, మరి ఆ ఊరిలో ఆ గ్రాస్ ఎక్కడ దొరికేదో అని ఇప్పటికీ ఒక ప్రశ్న. అత్తయ్య వాళ్ళ ఇంట్లో తడికల గది గురించి రాసాను కదా. మా అత్తయ్య ఒక మాంత్రికుడు లాగా మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఆ తడికలగదిలో స్వీట్స్ తయారు చేసేది. వాళ్ళింట్లో టైమ్ ప్రకారం భోజనాలు అయిపోయేవి. మా మామయ్య గారు భోజనం అయ్యాక మా అత్తయ్య ఆ విస్తరి మీదే యింకో విస్తరి వేసుకొని భోజనం చేసేది. నేను ఇంత వివరంగా ఎందుకు రాస్తున్నాను అంటే ఆరోజుల్లో ఉండే పద్దతులు ఇపుడు అసలు వూ హించ లేము కూడా, మా చిన్నతనంలో మేము చూసిన కుటుంబ పద్ధతులు, ఇపుడు చెప్పినా ఎవరూ నమ్మలేరు కూడా. మాకే ఒక్కొక్క సారి ఆశ్చర్యము గా ఉంటుంది. ఆ రోజులు మనమే చూసాము కదా అని. మా అత్త గారు ఆనే వారు ఒక యుగం మారినట్లు వున్నది అని. ఆ పద్దతుల్లో కొన్ని లోపాలు వుంటే వుండచ్చు కానీ కుటుంబా ల మధ్య ఒక ఆత్మీయ బంధం మాత్రం తప్పక వుండేది. ఇంతకీ జిలేబి గురించి రాస్తున్నాను కదా. వంట వాళ్ళు వున్నా కూడా ఆ స్వీట్స్ మాత్రం అవిడే చేసేది. బెల్లము లడ్డు, బెల్లం జిలేబి ఆవిడ స్పెషల్స్. చేశాక కొంచెం కూడా అలసినట్లు వుండేదికాదు.a స్వీట్స్ అన్నీ స్టోర్ రూమ్ లో, పెద్ద భోషా ణ ము లో ఉంచేది. ఈ మధ్య మా అమ్మాయి తో ఒక ఆంటీక్ షాపు కు వెళ్ళాము. అక్కడ ఒక చిన్న కావడి పెట్ట లాంటిదే బోలెడు ధర పెట్టీ కొన్నారు. ఇపుడు ఆ భోషణా లయితే కొన్ని లక్షల అంటారేమో, అనుకున్నాను. ఇంక ఇంటికి ఎవరు వచ్చినా ఆ లడ్లు, జిలేబి తినాల్సిందే. ఒకసారి నేను మా పాప లతో వెళితే సేమ్యా పాయసం చేయించింది. మా పాప పాయసం తినదు అని చెప్పాను. పాపకు పాయసం అలవాటు చేయనందుకు నాకు బాగా చివాట్లు పెట్టింది. ఇపుడు మా మనవరాళ్లును చూస్తే నాకు మా అత్తయ్య తో ఇంకెన్ని చివాట్లు పడేవో అనుకుంటాను. మేము హైద్రాబాద్ వచ్చాక అత్తయ్య మా యింటికి వచ్చింది. అపుడే కొత్తగా మా అన్నయ్య పెళ్లి అయింది. వదినకు అంతా కొత్తగా వుండేది. అత్తయ్య చాలా కాజువల్ గా జిలేబి చేస్తాను సామాన్లు తెప్పించు అన్నది. అత్తయ్య సంగతి తెలిసిందే కాబట్టి నేను అన్నీ తెప్పించాను అన్నయ్య వాళ్ళింట్లో బ్రహ్మాండంగా రెండు డబ్బాలో జిలేబి చేసి,పని అంతా అయ్యాక చక్కగా మంచి పట్టు చీర కట్టుకుని, మీ ఇంటికి పద ఒక డబ్బా జిలేబీ మీ అత్తగారి కి ఇస్తాను, అంటూ మా ఇంటికీ వచ్చి మా వాళ్ళందరికీ జిలేబీ రుచి చూపించింది. అత్తయ్య అప్యా యతకు, మనుష్యుల్ని ప్రేమ గా కలుపుకోవటం చూసి మా వదిన ఆశ్చర్య పోయింది. అత్తయ్య లాగా జిలేబి, లడ్డు చేయటం ఎవరికీ రాలేదు. మా అత్త గారు అరిసెలు, పంచదార లడ్డు చేసే వారు కానీ బెల్లము లడ్డు ఎపుడూ చేయలేదు. షాపు లో కొన్నా ఆ రుచి లేదు అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళింటికి వెళ్లే దోవలో రాజస్థానీ వాళ్ళు కొత్తగా జిలేబి బండి పెడితే అమ్మ కోసం కొని తీసుకొని వెళితే, అత్తయ్య చేసిన జిలేబి లాగా లేదు అనేది. ఇంక మావారు, అన్నయ్య అయితే మాకు ఏమీ చేయటం రాదు అని డిసైడ్ అయ్యారు. మా పిల్లలు అన్నీ స్వగృహ లో దొరుకుతున్నాయి కదా, ఇంక మీరు ఎందుకు కష్టపడతారు అంటారు.సో అందుకని అత్తయ్య నీ తలచు కొంటూ స్వగృహ జిందాబాద్ అనటమే. ఎపుడూ గతం గురించీ రాస్తాను అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఎన్నో అనుభవాలు, అనుభూతులు గుర్తు వస్తూ వుంటాయి. ఇప్పటివాళ్ళకు యివి తెలియవు కదా అందుకని ఇలా పంచుకుంటున్నాను. కొస మెరుపు గా ఒక జోక్, మా మనవ రాళ్లు హౌ డీడ్ యు మీట్ తాత, డీడ్ యు డేట్ అని అడిగారు. సో పెళ్ళిళ్ళ గురించీ యింకో కథ రాయాలి. ఇంగ్లీష్ లో ట్రాంస్లేట్ చేసుకొని చదువుకుంటారు. మా అత్తయ్య వుంటే పిల్లలకు తెలుగు నేర్పలేదని చీవాట్లు పెట్టేది.

 
 
 

Recent Posts

See All
అమృత హస్తం

ఈ మధ్య మా కోడలు పుట్టిన రోజున మా పిల్లలు హోటల్ కు డిన్నర్ కు తీసుకుని వెళ్ళారు. హోటల్ పేరు ఎర్ర కారం. గుంటూరు కారం సినిమా లాగానే ఆ పేరుకు...

 
 
 
పెళ్ళి పెట్టె

మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో...

 
 
 
రూట్స్

ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది....

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page