రేడియో గది
- murthydeviv
- May 23
- 3 min read
రేడియో కి ఒక గది ఉంటుందా అనుకుంటారేమో, మా చిన్నతనం లో మేడ మీద ఒక పెద్ద వరండా కి పక్కగా ఒక గది వుండేది. ఈ మధ్య నేను ఏదో బుక్ రాస్తూ టేబుల్ ముందు కూర్చుని యూ ట్యూబ్ లో పాటలు వింటూ ఉంటే అదే పనిగా మా రేడియో గది గుర్తు వచ్చింది ఆ గదిలో కూడా పెద్ద టేబుల్ మీద కొంచెం పెద్ద రేడియో నే వుండేది ఏ బ్రాండ్ గుర్తు లేదు ఆ రేడియో కి రెండు స్పీకర్ లు వుండేవి. ఒకటి కింద హాల్లో ఇంకొకటి పైన వరండా పక్కనే ఉన్న బాల్కనీ లో వుండేది. ఆ రోజుల్లో ఎక్కువగా మా పెద్ద నాన్నగారు రేడియో లో వార్తలు, సంగీత కార్యక్రమాలు వింటూ వుండే వారు. మా చిన్నతనం లో ఆ మేడ మీద గది మా పెద్ద అన్నయ్య ఎక్కువగా వాడే వారు. ఆ రోజుల్లో రేడియో కూడా అందరికీ వుండేది కాదు అనుకుంటాను ఠంచనుగా ఉదయం ఏడు గంటలకు మా ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చే వారు ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అని అమ్మ చెప్పేది మా నాయనమ్మ గారి కి కజిన్ బ్రదర్ అనుకుంటాను. చాలా సరదాగా కబుర్లు చెప్తూ వుండేవారు. ఖద్దరు బట్టలు వేసుకునే వారు. రాగానే యువ రాణి గారు కాఫీ ఇవ్వండి. అని అడిగే వారు ఆయన వాకిట్లో వుండగానే మా అమ్మ గారు కాఫీ కలిపి ఇచ్చేది.
ఆయన కాఫీ తాగితెలుగు వార్తలు విని ఊర్లో వాళ్ళ వార్తలు కొన్ని మాకు వినిపించి మా పెద్ద నాన్న గారి తో కలిసి బ్రేక్ ఫాస్ట్. చేసి మా ఇంట్లో అందరినీ వంశాభి వృద్ధి గా దీవించి అపుడు వెళ్ళే వారు ఈ లోపల ఇంగ్లీష్ వార్తలు వచ్చినా వినే వాళ్ళు కాదు. ఇంగ్లీష్ వార్తలు తెలుగు, ఇంకా ప్రాంతీయ వార్తలు తో సహా వినే ఇంకొక బంధువు కూడా మా ఇంట్లో ఉండే వారు. ఆయన మా నాన్న గారి కి అసిస్టెంట్ గా ఉండే వారు అనుకుంటా, ఆయన ఇంట్లో ఉంటే ఇంక రేడియోలో వార్తలు తప్పితే ఆ టైమ్ లో ఇంకో ప్రోగ్రామ్ కూడా వినలేము. మా పెద్ద నాన్న గారు రాత్రి పూట ఆరోజుల్లో వచ్చే నేషనల్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ పెట్టీ చాలా ఎంజాయ్ చేస్తూ వినే వారుబాల్కనీలో వున్న లౌడ్ స్పీకర్ లో అక్కడ అరుగులు మీద కూర్చుని చుట్టుపక్కల వాళ్ళు కూడా వార్తలు వినటం సంగీత కార్యక్రమాలు వినే వాళ్ళు, వాళ్ళకు మా పెద్ద నాన్న గారు ఎమ్ ఎస్ సుబ్బ లక్ష్మీ వాళ్ళ గురించి చెప్పే వారు. ఆ రోజుల్లో మనకు ఆ సంగీత జ్ఞానం ఏమీ వుండేది కాదు ఇపుడు ఆహా ఆ రోజుల్లో పెద్ద నాన్న గారికి ఎంత తెలుసు అని ఆశ్చర్యం పడటం. ఆయన కు మ్యూజిక్ అంటే ఇష్టం వుండేది అనుకుంటా, ఆయన కూతురు కి సంగీతం వయోలిన్ కూడా నేర్పించారు. ఆవిడ కూడా చాలా బాగా పాడే వారు. అసలు రేడియో గది గురించి చెప్పలేదు కదూ. మా నాన్నగారు కూడా గాంధీగారి ఫాలోవర్ అనుకుంటాను ఖద్దరు ఎక్కువ వాడే వారు. simple living High thinking ఉండాలని మాకు చెప్పే వారు. కారు వున్నా కూడా ఎక్కువగా సైకిల్ వాడేవారు. ఆయన ఎక్కువ రేడియో గది జోలికి వచ్చే వారు కాదు అందువలన మా రెండో అన్నయ్య ఆ గదిలో ఎక్కువగా నవలా పఠనం చేసే వాడు. ఆ రోజుల్లో డిటెక్టివ్ నవలలు చదవడం అనేది ఒక దురలవాటు అనుకునే వారు. ఇపుడు అయితే పిల్లల గేమ్స్ దగ్గర నుండీ అవే కదా. అన్నయ్య ఏం చేసినా గొప్ప అనుకునే నేను కూడా ఆరోజుల్లో అవి చదువుతూ ఉండే దాన్ని. అలాగే నాకు పుస్తకం పఠనం అలవాటు అయ్యింది. పెద్ద నాన్నగారు వెళ్ళి పోయాక , అన్నయ్యలు పై చదువులకు వెళ్ళాక, మా రేడియో హాల్లో కి మారింది. రేడియో సిలోన్ లో బి నాకా గీత మాల వివిధ భారతి హిందీ పాటలు వినటం ఒక ఫ్యాషన్ లాగా ఎపుడూ అవే వింటూ వుండేవాళ్ళం. మా బాబాయి గారి అల్లుడు ఆకాశ వాణి విజయ వాడ లో పని చేసే వారు. అపుడు అయితే మా అక్కయ్య కి ఆయన మేనమామ తెలుగు పాటలు వినాల్సిందే. చూడు ఇపుడు అన్ని మన కిష్టమైన పాటలు పెడతారు అని చెప్పేది. ఇంక ఇంకో కజిన్ మా ఊర్లో కాలేజ్ లో చేరాడు. ఆ అన్నయ్య కు క్రికెట్ ఇష్టం. ఇంక క్రికెట్ కామెంటరీ వినటం ఒక మేనియా లాగా అయిపోయింది. బీనా కా గీత మాల వినటమే కాకుండా, ఆ పాటలు గురించి కాలేజ్ లో కబుర్లు నడిచేవి. పాత రేడియో మరీ పాతది అయిందని మా పెద్ద అన్నయ్య బాంబే నుండి ఒక కొత్త రేడియో తెచ్చాడు . ఆరోజుల్లో దాన్ని ఒక కవర్ అదీ వేసి చాలా అపురూపం గా చూసుకునేవాళ్ళం మా చెల్లెళ్లు ఆకాశ వాణి లో వచ్చే శబ్ద చిత్రాలు, పిల్లల ప్రోగ్రామ్స్ బాగా వినే వారు. నేను మాత్రం ఎపుడూ హిందీ పాటలు వినే దాన్ని. మా ఇంట్లో మా బంధువుల పిల్లలు, ఇంకా కంబైన్ స్టడీస్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరము చదువు సంగతి ఎలా ఉన్నా రాత్రి పూట టీ లు, మిర్చి బజ్జీలు, వేరు సే న గ పప్పులు ఇలాంటి చిరుతిండ్లు బాగా నడుస్తూ ఉండేవి. నేను చాలా కష్టపడి బి బి సి, వాయిస్ ఆఫ్ అమెరికా ట్యూన్ చేసి ఇంగ్లీష్ పాటలు వినటం కూడా ఒక క్రేజ్ గా వుండేది. మా నాన్న గారు మార్కులు తక్కువ వస్తే మాత్రం రేడియో వినటం తగ్గించి చదువు మీద దృష్టి పెట్టాలని ఒక చిన్న చురక వేసే వాళ్ళు. ఇంక ట్రాన్సిస్టర్ లు వచ్చాక మనము ఎక్కడ ఉంటే అక్కడే పాటలు. మేము ఢిల్లీ వెళ్ళాక మా వారికి కూడా న్యూస్ మేనియా నాకు పాటలు మేనియా. వివిధ భారతి లో పాటలు టైమ్ కి న్యూస్ టైమ్ కి క్లాష్ వస్తూ వుండేది. ఆ న్యూస్ వినక పోతే, దేశభక్తి లేదు అనో, లేక పోతే నిజంగా గ్రాడ్యుయేట్ వే నా అనో విమర్శలు ఎదుర్కోవాలి.తర్వాత వచ్చే ఛాయ గీతాలు మాత్రం తప్ప కుండా వినే వాళ్ళం. నేను పనిచేసుకుంటూ అలా రేడియో పెడితే మా పాప కూడా గొడవ లేకుండా ఆడుకుంటూ వుండేది. ఇంక టేప్ రికార్డు లు టేప్స్ సి డి లు వచ్చాక మనకు ఇష్టమైన పాటలు మనం ఇష్టమైన టైమ్ లో వినచ్చు. ఇంక యూ ట్యూబ్ వచ్చాక అన్నీ టేపులు, సి డి లు అటక మీదకి వెళ్ళిపోయాయి. ఫ్ ఎమ్ రేడియో వచ్చినా ఆ పాటలు a మాటలు వినాలని అనిపించదు. కానీ. మనం చూసినంత మార్పులు మన పిల్లల కు తెలియదు కదా. మా చిన్నపుడు సెల్ ఫోన్లు లేవు అంటే మా మనవ రాలు మీరు ఎలా బతికారు అన్నట్లు చూస్తుంది. కానీ మనకు రోజులు హాయిగా వున్నట్లు అనిపిస్తుంది కదా. అప్పటికీ ఇప్పటికీ ఒక మంచి పుస్తకం, వినటానికి మంచి పాటలు ఉంటే చాలు అనుకుంటాను నేను. అదీ మా రేడియో కథ 1969లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మూన్ మీద ల్యాండ్ అయినప్పుడు కూడా మేము రేడియో లోనే విన్నాము. ఆ మర్నాడు యూనివర్సిటీ లో ఒక పెద్ద పార్టీ జరిగింది. చాలా మంది తో పాటు నేను కూడా చందమామ మీద పాటలు పాడుతూ సెలెబ్రేట్ చేసుకున్నాము.
Comments