మహా నగరం ముచ్చట్లు
- murthydeviv
- 5 days ago
- 4 min read
ఈ మధ్య అనుకోకుండా రెండు మహా నగరాలు కి వెళ్ళాను. చెన్నై గా మారిపోయిన చెన్న పట్నం తో చిన్నతనం నుండి అనుభందం వుండేది. మా చిన్నతనం లో , మా నాయనమ్మ మా ఇంట్లో ఏ కొత్త వస్తువు తెచ్చినా పట్నం నుంచి మా అబ్బాయి పంపాడు అని చెపుతూ వుండేది. మేమూ సెలవులు రాగానే అక్కడికి బయలుదేరి వెళ్ళేవాళ్ళం. అలా చెన్నై గా మారిపోయిన మద్రాసు ను ఒక నెల రోజుల క్రితం వెళ్ళినప్పుడు అంతగా డెవలప్మెంట్ జరిగినట్లు అనిపించ లేదు .అదే మాట అంటే మా కజిన్ బ్రదర్ కూతురు, అక్కడే పుట్టి పెరిగిన మా బంధువు, ఈ సిటీ మోస్ట్ కన్సర్వేటివ్ సిటీ లేడీస్ కి సేఫ్ట్ ప్లేస్ అని నొక్కి వక్కాణించారు. మా బ్రదర్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయ్యాక , తన శ్రీవారు లాయర్ అయితే తను కూడా లా చదివి ప్రాక్టీస్ చేస్తున్నది . ఆడవాళ్ళకు సంబంధించిన కేసులు ఎక్కువగా చేస్తుంది. సో తన మాట ఒప్పుకోవాలి కదా. తనను చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. ఎన్నో పాత జ్ఞాపకాలు తో సాఫ్ఫియర్ థియేటర్ చూద్దాము అనుకున్నా ,ఆ థియేటర్ షాపింగ్ మాల్ అయిందని తెలిసి చాలా నిరాశ అనిపించింది. నేను వున్నది రెండు రోజులే ఎక్కువగా తిరగలేదు . అందువలన కూడా అలా అనిపించిందేమో
ఇంక పోయిన వారం మా అమ్మాయి పండుగ హడావిడి అయ్యాక పిల్లల ను హాలిడే ట్రిప్ అంటూ ముంబై గా మారిన బొంబాయి కి తీసుకొని వెళ్ళింది . నేను చాలా ఏళ్ళ తర్వాత వెళ్ళాను. ఈ మధ్య అంతా రెడ్ బస్ లాంటి ఇండిగో విమానాలు ఎక్కటం అలవాటు అయిన పిల్లలు ఎయిర్ ఇండియా విమానం లో ఎక్కువగా ప్యాసింజర్స్ లేక పోవడంతో ఎయిర్ ఇండియా లాస్ లో వెళ్తున్నదని డిసైడ్ అయిపోయారు. పేరెంట్స్ బిజినెస్ లో ఉంటే ఇలాంటి విషయాలు ఆలోచిస్తూ ఉంటారు .నేను వాళ్ళకు అది కాలిఫోర్నియా వెళ్ళే విమానం ,ముంబాయి లో ఎక్కువగా ప్యాసింజర్స్ వుంటారు అని చెప్పాను. ఎయిర్ ఇండియా విమానం ఎక్కగానే నాకు మాత్రం ఏదో పాత స్నేహితుడిని చూసినంత ఆనందం గా అనిపించింది. యు ఎస్ వెళ్ళే విమానం కాబట్టి సీట్స్ కూడా స్పేసియస్ గా ఉన్నాయి. ఎయిర్ ఇండియా వాళ్ళు ఎయిర్ హోస్టెస్ కి కూడా పూర్వం లాగా చీరెలు లేవు గాని చాలా హుందాగా చీర సల్వార్ లాగా డ్రెస్ మంచి రెడ్ కలర్ లో ఉంది.
మా పిల్లలు కు నచ్చే మంచి బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు. అవీ విమానం కబుర్లు
ఎయిర్ పోర్టు దగ్గర లోనే ఏదో హోటల్ లో సెటిల్ అయ్యాక , అందరూ పెల్లాడియం అనే మాల్ కి బయలు దేరారు.
ఏ మాల్ లో ఏమయినా చూడటానికి ఏముంటుంది , ఊరికే షాపులు తప్పితే ,అని నా అభిప్రాయం.
నయనానందకరంగా అలా చూస్తూ ఉండు ,అని మా అమ్మాయి సలహా, కానీ అలా తిరగాలంటే కాళ్ళ లో శక్తి ఉండాలి కదా.
ఒక ఇటాలియన్ రెస్టారెంట్ లో లంచ్ అంటూ పిజ్జాలు , పాస్తా లు తిన్నారు . ఫ్రెంచ్ ఫ్రై అనే పేరు కల బంగాళదుంప వేపుడు నా ఆహారం. వాడు ఇటాలియన్ కాబట్టి అందులోకి సాస్ కాకుండా మయినోస్ ట అది ఇచ్చాడు . అది కూడా నేను తినను కాబట్టి ఆ పూట లంచ్ వాటితో ముగించాను.
ఇంక బయటకు వచ్చి ఎస్కలేటర్ లు ఎక్కుతూ, దిగుతూ నయన తార లాగా కళ్ళకు ఆనందం కలిగిస్తూ ఒక అరగంట తిరిగి ,మంచి కాఫీ షాపు చూసుకుని కూర్చున్నాను.నేను ఫస్ట్ టైమ్ మా చెల్లెలు నీ అమెరికా విమానం ఎక్కించడానికి బొంబాయి వచ్చాను. 1977 లో , మరలా నెక్స్ట్ ఇయర్ మావారిని అమెరికా నుండి రిసీవ్ చేసుకోవటానికి వచ్చాను . అప్పట్లో ఎయిర్పోర్ట్ లో ఇంత హంగామా వుండేది కాదు . విమానం ఎక్కే వాళ్ళని, దిగే వాళ్ళని మనం చూడగలిగే వాళ్ళం.
మా తాత గారు 1945 ఆ టైమ్ లోనే అనుకుంటాను. బొంబాయి లో ఒక షాప్ పెట్టారు మా చిన్నతనం లో నాన్న గారు, పెద్దనాన్న గారు ఎక్కువగా బొంబాయి వెళ్ళి వస్తూ వుండే వారు. మా పెద్ద అన్నయ్య కూడా ఇక్కడే సి ఏ చదివాడు. ఆ సిటీ తో వున్న అనుబంధం వలన పాత జ్ఞాపకాలు అలా మనసులో గుర్తు వస్తూ ఉంటాయి. మా పెద్ద నాన్న గారు బొంబాయి నుండి వస్తూ రక రకాలైన వస్తువులు తెచ్చే వారు . మా షాపు వున్న ఏరియా ను క్రాఫోర్డ్ మార్కెట్ అంటారు . అది ఒక పెద్ద హోల్ సేల్ మార్కెట్,సో ఆయన ఇంటికి కావలసిన వస్తువులు తో పాటుగా, డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చే వారు. అందులో akrut మాకు చాలా ఇంటరెస్టింగ్ గా వుండేది. మా నాన్న గారు తప్పకుండా రక రకాల చిక్కి లు , బొంబాయి హల్వా, ఇంకొక రకమైన స్వీట్ తెచ్చే వారు . బొంబాయి వెళ్ళినప్పుడల్లా ఆ స్వీట్ కోసం చాలా వెతికాను గానీ, ఎక్కడా దొరక లేదు. అన్నయ్య మాత్రం మాకు కావాల్సిన ఏవో గొలుసుల, గాజులు తీసుకుని ఇంకా కొత్తగా మార్కెట్ లో కి వచ్చిన బట్టలు తీసుకుని వచ్చే వారు. మొదటి సారిగా మా వారితో బొంబాయి వచ్చినప్పుడు ఆ మార్కెట్ కి వెళ్ళి ఆ జ్ఞాపకాలు అన్నీ మా వారి తో చెప్పాను
మొదట గా బొంబాయి అనగానే గుర్తు వచ్చేది మా సోషల్ టీచర్ బొంబాయి లో నూలు మిల్లులు ఎక్కువ గా వుండటానికి తొమ్మిది పాయింట్లు రాయ మని ఒక ప్రశ్న ఇచ్చే వారు. మొదటి సారిగా గ్రాండ్ చిల్డ్రన్ తో వచ్చాను కాబట్టి ఆ విషయాలు అన్నీ వాళ్లకు చెప్పాను. సైన్స్ గ్రాడ్యుయేట్ నీ అయినా ఎందుకో సోషల్ అంటే ఎక్కువగా ఇష్టం వుండేది . బహుశ టీచర్ వల్లనేమో. వున్న మూడు రోజులలో మామూలుగా బొంబాయి విశేషాలు మెరైన్ డ్రైవ్, చౌపతీ జుహు ,గేట్ వే ఆఫ్ ఇండియా అన్నిటి తో పాటు , సిద్ది వినాయక టెంపుల్, మహాలక్ష్మి ఆలయం అన్ని చూశాము. మా వారి తో వచ్చినప్పుడు ఏదో బ్యాంకు స్ట్రీట్ కి వెళ్ళి దాస్ప్రకాష్ హోటల్ లో క్విక్ లంచ్ అంటూ చిన్న చిన్న దోశలు, ఇడ్లీలు మా పిల్లలు కు తినిపించాలి అనుకున్నా ఆ ఏరియా కొంచెం ఓల్డ్ సిటీ అన్నాడు డ్రైవర్. ముంబాయి గా మారిన బొంబాయి చాలా డెవలప్ అయినట్లు అనిపించింది..
యూ ఏస్ సిటీస్ లాగా చాలా ఫ్లై ఓవర్లు ఇండియా బిజినెస్ క్యాపిటల్ లాగానే అనిపించింది. కొత్తగా చెప్పుకోవాల్సిన విశేషము ఏమిటంటే నీతా అంబానీ కట్టించిన కల్చరల్ సెంటర్. తిరగాలంటే కాళ్ళ లో శక్తి ఉండాలి గానీ చాలా బాగుంది. భారతదేశము లో ఉన్న అన్ని రాష్ట్రాల లో వున్న స్పెషల్ చేనేత వస్త్రాలు ఆర్ట్స్ , క్రాఫ్ట్స్ ఊరికే షాపు లు కాకుండా అవి ఎలా చేస్తారో , అన్నీ వివరాలు తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ అన్నీ రకాలు ఆర్ట్స్ నీ క్రాఫ్ట్ నీ చూడగలము. ఇంకా గోల్డ్ వర్క్ గురించి కూడా కొన్ని గదుల్లో పెట్టారు. అయితే ఆరోజు ఏవో స్నేక్ కి సంబంధించి న నగలే ఎక్కువగా వున్నాయి. మేము ఒక్క గది చూసి వచ్చేసాము. అందులో కొన్ని థియేటర్లు కూడా ఉన్నాయి. ప్రతి వారం ప్రోగ్రామ్ లు జరుగుతాయిట.ఆ వారంలో మీరా డాన్స్ డ్రామా ఉన్నదిట. చాలా నీట్ గా కూడా మెయింటెయిన్ చేస్తున్నారు. ఇంకా ఆ
టాక్సీ డ్రైవర్ రిలయన్స్ , రేమండ్ వాళ్ళ ఇళ్ళు కూడా చూపించాడు. రేమండ్ వాళ్ళు ఒక సెంచరీ నుండి బిజినెస్ లో ఉన్నారంటే గొప్ప విషయం కదా. డబ్బా వాలా నీ గురించి చెప్పుకోకుండా ముంబాయి కథ పూర్తి కాదు కదా. మధ్యాహ్నం లంచ్ అందించే వాళ్ళ సిస్టమ్ గురించి బి బి సి లో కూడా వచ్చిందిట. రెండో విషయం బస్ స్టాప్ లో , మెట్రో, లోకల్ స్టేషన్ లో తప్పకుండా కనిపించే క్యూ సిస్టమ్ మన ఇండియన్ సిటీస్ లో ఎక్కడా కనిపించని క్రమ శిక్షణ ఇక్కడే చూడగలము. ఎన్ని ఉన్నా ట్రాఫిక్ జామ్ లు తప్పవనుకోండి. అవీ ముంబాయి లో నా జ్ఞాపకాల తోరణాలు.


Comments