తన కోసమే కాకుండా ఇంకొకరికి ఏ కొద్ది సహాయము చేసే వాళ్ళయినా నా దృష్టి లో మహానుభావులు అనుకుంటాను. మా పెద్దనాన్న గారు చాలా స్ట్రిక్ట్ గా వుండేవారు. ఇంట్లో అందరం భయపడుతూ వుండేవాళ్ళం. ఇంటి విషయాలు అన్నీ నాన్నగారి కన్నా ఆయనే ఎక్కువ గా చూసేవారు. ఆయన ఎపుడు గట్టిగా మాట్లాడినా వెంటనే అమ్మా వాళ్ళతో అనేవారుట, నాకు ఒక్కతే కూతురు మీకే పిల్లలు జాగ్రత్తగా ఉండమని అందుకే చెప్పుతున్నాను అనేవాళ్ళుట. మా అమ్మ గారు తన చివరి రోజులలో కూడా పెద్దనాన్న గారి మాటలు గుర్తు చేస్తూ మమ్మల్ని కూడా జాగ్రత్త గా వుండమని చెప్తూ వుండేది. బావగారు గట్టిగా మాట్లాడినా అపార్ధం చేసుకోకుండా తన పిల్లలకు కూడా చెప్పిన అమ్మ ను తలుచుకుంటే నాకు ఏదో ఆనందం వస్తుంది. ఈ రోజుల్లో ఇలాంటి సంస్కారం వున్న వాళ్ళను చూడగలమా. అని సరే ఈ పోస్ట్ కు ఈవెంట్ మేనేజర్ కు తోడుగా అలా జాయింట్ ఫ్యామిలీ లో కలసి మెలిసి పెళ్ళిళ్ళు ఇంకా ఫంక్షన్లను నిలబడి నిర్వహించే వాళ్ళను గురించి రాద్దాం అని మొదలు పెట్టాను కానీ వాళ్ళు నిస్వార్ధంగా చేసిన పనులను ఈవెంట్ మేనేజర్ తో కలపటం నాకు నచ్చలేదు. మా యింట్లో మాకు వూహ తెలిసినప్పటినుండి ఎపుడూ ఏదో హడావిడి ఉంటూ వుండేది. ప్రస్తుతము పెళ్ళిళ్ళు చూస్తుంటే అప్పటి రోజులు గుర్తుకు వస్తాయి. అప్పట్లో పెళ్ళిళ్ళు అంటే ఇంటి ముందు తాటాకుల తో పందిరి వేసి పందిరి కి తాటాకు కనిపించకుండా చక్కటి తెల్లటి క్లాత్ తో చాందిని అని కట్టేవారు వాటికి రంగు కాగితాలతో అలంకరణ చేసేవారు. మండపం కూడా చాలామటుకు రంగు కాగితాలతో అలంకరణ చేసేవారు. పెళ్ళిలో కనీసం పెళ్లివారు రెండురోజులు వుండేవారు. ఇంక బంధువుల అయితే ఒక్కొక్కసారి పదహారు రోజుల పండగ వరకూ వుండేవారు. పెళ్లివారికి విడిదికి వేరే ఇల్లు ఇచ్చేవారు. ఆ ఇంటి ముందు కూడా పందిరి వేయించే వారు పిండి వంటలు అన్నీ యింట్లో నే చేయించేవారు. ఇవ్వన్నీ నిర్వహించి చేయటానికి ఎంత ఓర్పు, నేర్పు వుండాలి అని ఇపుడు ఆలోచిస్తే అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ప్రతీ ఫ్యామిలీ లో ఎవరో ఒక రు వుంటారు. మా ఇంట్లో అయితే మా బాబాయి గారు చక్కటి చిరునవ్వుతో మనసు నొప్పించకుండా మాట్లాడుతూ నలుగురి తో కలిసి మెలిసి వుంటూ వుండే వారు. మా నాన్నగారికి అయితే ఆయన కుడి భుజము లాగా వుండేవారు. పెళ్ళిళ్ళ లో గాడి పొయ్యి దగ్గర వుండి వంటలు పర్యవేక్షణ చూడటము, ఇంక వడ్డనలు చూడటం, ఆరోజుల్లో టేబుల్ మీల్స్ చాలా తక్కువ. కింద అరిటాకులు వేసి వడ్డించే వారు. వంట వాళ్ళు ఒక్క అన్నం మాత్రము వడ్డించే వారు. బాబాయిగారు మా పిల్లలందరినీ ఉత్సాహ పరుస్తూ వడ్డనలు చేయించే వారు. మాకు కూడా ఆ పనులు అన్నీ చెయ్యటానికి చాలా సరదాగా వుండేది. మా అమ్మ గారికి అన్నదమ్ములు లేరు. మా అమ్మ గారు అయితే తన మరుదులు తో చాలా ఆప్యాయంగా వుండేది. మా బాబాయిగారు మా ఇంట్లో అందరి పెళ్ళిళ్ళు నిర్వహించి చేయటమే కాకుండా మా ఆమ్మాయి పెళ్ళికి కూడా అంతే ఉత్సాహంగా మమ్మల్ని లీడ్ చేశారు. ఆయన ఎవరికయినా వంట్లో బాగుండకపోయినా వెంబడి వుండి ఎంతో సేవ చేసే వారు. అంత పెద్ద ఫ్యామిలీ లో ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను వున్నాను అని నిలబడేవారు. మా నాన్న గారికి ఆయన మీద ఎంత నమ్మకం అంటే తన వెనుక ఎపుడూ బాబాయి గారు ఉండాల్సిందే. నాన్న గారి చివరి రోజులలో బాబాయ్ చేసిన సేవ మరువలేనిది. ఏ అన్నగారికి అయినా అలాంటి తమ్ముడు వుండాలి అనుకుంటాను నేను. మా వారి తో కూడా మా బాబాయి గారు చాలా స్నేహంగా వుండే వారు. మా అమ్మాయి మద్రాసు హాస్టల్ లో వుండి చదువుకునేటప్పుడు కూడా బాబాయ్ వెళ్ళి చూసి వచ్చే వారు. నేను ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే ఆరోజుల్లో ఏ మానేజ్ మెంట్ కోర్సు లు ఎమ్ బి ఎ లు చదవకుండానే మన పెద్దవాళ్ళు చేసినవి చూసీ మనం నేర్చుకున్నా ము. కానీ ఈ రోజుల్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయము చేసే వాళ్ళు లేరు. పెళ్ళిళ్ళ లో కూడా సొంత అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు కూడా వచ్చి సహాయము చేయరు. ఒక్క పూట పెట్టే భోజనాలకు, కూడా అనవసరమైన ఖర్చుఆర్భాటం ఎక్కువ అయింది. మనిషి విలువ కన్నా డబ్బు విలువ ఎక్కువ అయింది. మా రెండో అమ్మాయి అమెరికా లో వున్నపుడు మా బాబాయి గారు పోయారు. మా అమ్మాయి నా పెళ్ళి కి తాతయ్య లేరు కదా అని బాధ పడింది. ఆయన ఆప్యాయత తో మా మనసుల్లో చెరగని ముద్ర వేశారు. కానీ ఇప్పటికీ ఆయన ఇచ్చిన ట్రైనింగ్ తో ఏ పనీ చేయటానికి వెనుకాడని మనస్తత్వము అలవాటు అయింది. అందుకే మన పెద్దవాళ్ళు మహానుభావులు అంటాను మరి మన మనసుల ను ఇంత ప్రేమానురాగాల తో నింపిన వాళ్లకు ఇంతకంటే మనం యిచ్చే నివాళి ఏముంటుంది. యింకా కొన్ని విశేషాలు తో ఇంకొక సారి.
మహానుభావులు
murthydeviv
Comments