మన ఆవకాయ:2
- murthydeviv
- Nov 13, 2024
- 2 min read
మొన్నా మధ్య మా బంధువు ఒకాయన కు ఆరోగ్యం బాగాలేదు అని పరామర్శించడానికి ఫోన్ చేశాను. "అబ్బే అసలు జీవితం వేస్ట్" అన్నాడు. ఆరోగ్యం బాగా లేదు అని డిప్రెషన్ లో ఉన్నాడు ఏమో అని, ఎదో నాలుగు మాటలు చెబుతామని అనుకుంటే ,మరలా అతనే అందుకొని డాక్టరు, ఊరగాయలు తినవద్దు అన్నాడు. ఆవకాయ, మామిడిపండ్లు తినకపోతే ఇంకెందుకు జీవితం అని ఎదురు ప్రెశ్న వేసాడు. "నిజమే వేసవికాలం ఎంత ఎండలు ఉన్నా , మామిడిపండ్లు, మల్లెపూలు కొత్త ఆవకాయ వాటి రుచే వేరు." ఇంకా ఆవకాయ కదా కు వస్తే మా రొండో అమ్మాయి ఏడాది , పాపగా ఉన్నపుడు హైదరాబాద్ వచ్చాము. ఇంకా బాగా సెటిల్ అవ్వటానికి ట్రై చేస్తూ ఉండగా, ఇక్కడ మామిడికాయలు చాల చవక, నీవు ఆవకాయ పెట్టు అని మా వారు అన్నారు. వెంటనే నేను చాల కంగారుగా నేనా ,ఆవకాయ నా ? అని అసలే వంటకూడా సరిగా రాదు. "రోజు మీరు వంకలు పెడుతుంటారు" అన్నాను. పక్కనే ఉన్న మా అన్నయ్య కూడా "ఎముంది మలక్పేట్ లో పెద్దమ్మ ఉంది కదా. వాళ్ళు హెల్ప్ చేస్తారు., నేర్చుకో " అన్నాడు. ఇద్దరికీ ఆవకాయ అంటే ఇష్టం మరి. నాకు చిన్నపటి నుండి ఆవకాయ తినడం తప్పితే ఏమి వేస్తారో, ఎలా చేస్తారో కూడా తెలియదు. భగవంతుడే భారం అనుకోని రిక్షాలో మల్కపేటకి వెలను. అపుడు హైద్రాబాద్లో రిక్షాలే ఎక్కువ. మా పెద్దమ్మ కూతురు తో ఉంటుంది. చాలా ప్రేమగా చూసే డి. మా అక్కయ్య తో ఎలా ఈ అవకాయ గొడవ అని మొరపెట్టునుకొంటే మా పెద్దమ్మ "మేము ఉన్నాము అని భరోసాఇచ్చింది. పనిలో పనిగా అమ్మ వాళ్ళ కు కూడా పెడదాము అని అన్నది. మేము ఆవకాయ కి కావలిసిన సరంజామా అంతా సమకూర్చుకొని శాలిబండ మార్కెట్టుకు కాయల కోసం వెళ్ళాము. ఇపుడు అంటే అని చోట్ల కాయలు దొరుకుతున్నాయి,కానీ అప్పుడు మోండా మార్కెట్ లో కానీ శాలిబండలో కానీ కాయలు దొరికేవి. అక్కడికి వెళ్ళాక మా హిందీ వాడికి అర్ధం కాదు, వాడి ఉర్దూ మనకు తెలియదు. కాయలు చవక గదా అని మేము "ఏక్ సౌ" అన గానే వాడు రెండు చేతుల్తో లేక పెట్టి రెండు వందల కాయులు బుట్టలో వేసేసాడు. "ఆబో ఇన్ని కాయలు మాకు వాడు." అని శతవిధాల చెప్పినా వాడు మా మాట వినకుండా ఉర్దూ లో గబా గబా ఎదో చెప్పి ముక్కలు కొట్టేవాడికి బూతా ఇచ్చాడు. ముక్కలు కొట్టే వాడు మాత్రం కొంత తెలుగు,ఉర్దూ, యాసలో మాకు చెప్పింది ఏమిటంటే ఒక సారి లెక్క పెట్టాక వెన్నక్కి తీసుకోదు అని చెప్పాడు. కావాలంటే కొన్ని కాయులు చెక్కుతీసి ఇస్తాను వొరుగులు లాగా చేసుకోండి అని ఉచిత సలహాఇచ్చాడు. "ఇప్పుడు ఎలాగా" అని కొంచం కంగారు పడుతూ నేను, మా అక్కయ్య ఒక వంద కాయులు ముక్కలు కొట్టించుకోని బ్రతుకు జీవుడా అని ఇంటికి వోచము.
Comments