top of page

పెళ్ళి పుస్తకం

murthydeviv

బాపు గారి పెళ్ళి పుస్తకము లో చెప్పినట్లు ఏ రోజుల్లో పెళ్లి కయినా నమ్మకం ముఖ్యం. అది లేదు అంటే పెళ్లి ఒక్కటే కాదు ఏ బంధం అయినా నిలవదు. నేను చెప్దాము అనుకున్నది పాత రోజుల్లో పెళ్లిళ్లు సంప్రదాయాలు గురించి, అంటే ఆరోజుల్లో పెళ్ళి అంటే బంధువులు, వచ్చి అన్నీ పెళ్ళి పనుల్లో సహకరిస్తూ ఒకలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. ఇపుడు అన్నీ ఈవెంట్ మేనేజర్లు చెప్పినట్లుగా మనం కూర్చోవాలి, లేవాలి, దానికి తోడు వీడియో ఫోటోగ్రాఫర్ హడావిడి. ఇంక భోజనాలు అయితే పూర్తిగా ఫుడ్ వేస్ట్ చేస్తున్నాము అనిపిస్తుంది. ఈ రోజు పెళ్ళి గుఱించి రాయాలని ఎందుకు చెబుతున్నానంటే రెండు రోజుల క్రితం ఒక సంగీతము ప్రోగ్రామ్ కు వెళ్ళాను. అక్కడ ఒక ఆమ్మాయి పంచ రత్న కీర్తనలు చాలా బాగా పాడింది వాళ్ళ అమ్మ గారు నా పక్కనే కూర్చున్నారు. ఆ అమ్మాయి డాక్టర్ గా వర్క్ చేస్తున్నది. అక్కడే వున్న వాళ్ళ అమ్మ గారికి ఇంకొక అవిడ ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం చెపుతున్నది. ఆ అమ్మాయి డాక్టర్ అయినా కూడా చాలా బాగా సంగీతము పాడుతున్నది. ఆ అమ్మాయి నీ చూస్తే లక్ష్మీ సరస్వతి లు కలిసి ఉన్నట్లు అనిపించింది. పాత రోజుల్లో ఇలాగే సంభందాలు కుదుర్తూ వుండేవి. వాళ్ళని చూడగానే నాకు ఒక్క సారిగా పూర్వపు రోజులు గుర్తు వచ్చాయి. ఇపుడు పెళ్ళి అంటే మెహందీ సంగీత్ హల్ది ఫంక్షన్ అని మనకు లేని అలవాట్లు బాగా అలవాటు అయ్యాయి. పూర్వపు రోజుల్లో పెళ్ళికి ఒక నెల రోజుల ముందు నుండి సందడి వుండేది వడియాలు, అప్పడాలు, కంది పొడి చేయటం. వడియాలు పెట్టినపుడు పసుపు తో గౌరి దేవిని చేసీ వడియాలు కోసం పరిచిన చీర మధ్యలో పెట్టీ పెళ్ళికూతురు చేత పూజ చేయించి ఆపుడుమొదలు పెట్టేవారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళ ను పిలచి పెట్టించే వారు. ఇంక అప్పడాలు చేసేటపుడు ఆ పిండితో రకరకాల బొమ్మ లు లాగా చేసీ బువ్వం బంతి లో సరదాగా వడ్డించేవారు. మా అమ్మ గారు నా పెళ్ళి కి, మా అన్నయ్య పెళ్ళి ఆపుడు ఇలా చేయాలి నేర్చుకోండి అని చెప్పారు. అమ్మకు, మా అత్తయ్య కు, పెళ్ళిలో పాడే వియ్యాలవారి పాటలు చాలా వచ్చేవి. మమ్మల్నీ నేర్చుకోమని చెప్పేది కానీ, నేర్చుకుని ఎక్కడ పా డాలి. ఈ బఫే భోజనాలు వచ్చాకా వాళ్ళకు విరక్తి వచ్చి ఏముంది మీకు లక్షలు ఖర్చు, ప్లేట్లు పట్టుకుని ఏం తింటున్నారో కూడా తెలియదు. అనేవాళ్ళు. ఆరోజుల్లో వంట కు గాడి పొయ్యి తవ్వించి చుట్టూ ముగ్గులు వేసి, పెళ్ళికూతురు చేత నమస్కారం చేయించే వారు. ముందుగా బూందీ లడ్డు చేసే వారు. అరోజుల్లో పెళ్ళి అంటే లడ్డు, అరిసెలు, మినప సున్నితప్పక ఇంట్లో నే చేయాలి. మా చెల్లెలు పెళ్ళికి మా అత్తగారు, పెద్దమ్మ, అమ్మ కలిసి అరిసెలు చేయటం బాగా గుర్తు వస్తుంది. గాడి పొయ్యి అనగానే ఇంకో సంఘటన కూడా గుర్తు వస్తుంది. మా ఇంట్లో ప్రతి నెల ఒకతను వెన్న పూస తెచ్చేవాడు. ఎక్కడినుంచో నాకు అంతగా గుర్తు లేదు. ఆ వెన్న పూస అంతా మా పెద్దనాన్న గారు కూర్చుని తూయించరేవారు. ఆ వెన్న పూస తెచ్చిన అతనే పెద్ద గంగాళం లో గాడి పొయ్యి మీద కరిగించేవాడు. మరలా నెయ్యి కూడా తూయించేవారు. ఏ మాత్రం పెద్దనాన్న గారి లెక్కుకు తగ్గితే వాడి పని అయిందే వెన్న లో ఏమీ కలిపావు అని. ఆ నెయ్యి డబ్బా ల్లో సీల్ వేయించి మద్రాస్, బెజవాడ, బొంబాయి లో ఉండే మా బాబాయిలకు పంపే వారు. గాడి పొయ్యి అనగానే నాకు అదృశ్యం గుర్తు వస్తుంది. ఆ నెయ్యిలో వేసిన తమలపాకుల కోసం మేము కాచుకుని వుండేవాళ్ళం. ఇంక అడుగున మిగిలిన గోదావరి రుచి అమోఘం గా వుండేది. ఇంక పెళ్ళిళ్ళ లో ఇంటివాళ్ళు ఎవరో ఒకరు గాడిపొయ్యి దగ్గర అజమాయిషీ చేసే వారు. ఎక్కువగా మా నాన్న గారు, మా బాబాయి గారు అజమాయిషీ చేస్తూ వుండే వారు. మా కజిన్ కూతురు పెళ్ళిలో అనుకోకుండా తూఫాన్ వచ్చి, పెళ్ళివారు వెళ్ళటానికి వీలు కాలేదు వంట వాళ్ళు మాత్రం వేరే పెళ్ళి వుందని వెళ్ళిపోయారు. ఆరోజు మా బాబాయి గారి ఆధ్వర్యంలో మేమే గంగాళం లో కాఫీలు, కలిపి, పప్పు పులుసు, ఊరగాయాలతో విందు ఏర్పాటు చేశాము. మా అక్కయ్య కూతురు పెళ్ళిలో మా బావగారు పోస్టల్ సూపర్డెంట్ గా చేసేవారుగుంటూరులో, చుట్టుపక్కల పల్లెటూరి పోస్టు ఆఫీసువాళ్ళు విపరీతంగా వచ్చారు. అప్పటికప్పుడు బియ్యం, పప్పు లు మరల మరల వండాల్సి వచ్చింది. వడ్డన అంతా మేమే చేసేవాళ్ళం అని వేరే చెప్పాలా. ఆపుడు కూడా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ పనులు చేసేవాళ్ళం. పెళ్ళి తర్వాత రాత్రి పూట పెట్టే భోజనాలకు బువంబంతి అనేవారు. అరిటాకుల చుట్టూ ముగ్గులు వేసి సాంబ్రాణి ధూపం వేసి పెళ్ళి వారికి వడ్డించే వారు. అపుడే అప్పడాలు పిండితో చేసిన బొమ్మలు వేయించి విస్తరి లో వడ్డించే వారు. ఇంక పాటలు కి అయితే లెక్క లేదు. అందరూ రక రకాల పాటలు పాడుతూ పెళ్లివారిని ఆట పట్టించే వారు. కొంత మందికి కోపాలు వచ్చేవి అనుకోండి. కానీ మా ఇంట్లో అది చాలా తక్కువ. మా పెద్ద అన్నయ్య పెళ్ళిలో చాలా రోజుల తర్వాత జరుగుతున్న మగ పిల్లవాడి పెళ్ళి, మా బాబాయిల పిల్లలు మేమూ ఆడపిల్లలం అందరమూ సరదాగా ఆలుగుదా మని మేజు వాణి కి వెళ్లకుండా విడిది లో కూర్చున్నాము. ఇంతలో మా బాబాయిగారు వచ్చి మమ్మల్ని ఒక్క చూపు చూశారు. అంతే అందరం విడిది లోనుంచి బయలు దేరాం. మా వదిన వాళ్ళ నాన్న గారు మాత్రం ఏం కావాలో కోరుకోమన్నాడు. కానీ మా బాబాయి గారి చూపుతో మాకు మాట వస్తేగా. ఆ రోజుల్లో డిసిప్లిన్ అలావుండేది. యిపుడు ఎక్కడ సంగీత్ చూసినా నాకు మా పెళ్ళిలో జరిగిన ఒక సంఘటన గుర్తు వస్తుంది. నా పెళ్ళి లో సాయంత్రం రిసెప్షన్ అయ్యాక అన్నయ్యలు అందరూ సరదాగా ట్రాన్సిస్టర్ లో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టీ డాన్స్ చేయటం మొదలు పెట్టారు. అంతే ఇంక మా బాబాయి గారు వచ్చి ఒక చూపు చాలు ఎక్కడి వాళ్ళు అక్కడే. ఆ రోజులు అలాంటివి. మొన్నీమధ్య బాగా దగ్గర వాళ్ళింట్లో సంగీత్ కి వెళ్ళాను. పెళ్ళికూతురు తండ్రి తన ఫ్రెండ్స్ తో కలిసి బీర్ సీసాలు పట్టుకుని ఏదో డ్యాన్స్ చేశారు. బాలకృష్ణ సినిమాలో పాట ట. హతవిధీ అనుకున్నాను. పైకి వెళ్లిపోయిన పెద్దల హృదయాలు క్షో బించి వుంటాయి. ఇవ్వన్నీ రాస్తుంటే ఆ రోజులు గుర్తుకు వచ్చీ ఆహా అవ్వన్నీ మనమే చూశాము కదా అని సంతోషంగా వుంటుంది.

 
 
 

Recent Posts

See All

గూగుల్ తమాషాలు

గూగుల్ లాంటి వరల్డ్ వైడ్ కంపనీ తో మనకు ఏమీ తమాషాలు వుంటాయి ,అని మీరు అనుకుంటారు. కానీ నాకు మాత్రం చాలాసార్లు అమ్మో గూగుల్, ఆన్ లైన్ లో...

వంటొచ్చిన మగాడు

ఇదేమి చోద్యం ఈ కథ ఏమిటి అనుకోకండి. ఎపుడో ఒక 50 ఏళ్ళ క్రితం భమిడి పాటి రామ గోపాలం గారు ఈ కథ రాశారు. కథ చాలా బాగుంటుంది. నా దగ్గర ఆయన కథలు...

మరపురాని స్నేహం

కొంత మందితో స్నేహితులతో ఎక్కువ రోజులు గడపక పోయినా వాళ్ళ ప్రభావము మన మీద చాలా వుంటుంది. తర్వాత ఎక్కువ సార్లు కలుసుకోక పోయినా ఆ స్నేహం...

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page