తోడి కోడళ్ళు
- murthydeviv
- Mar 16
- 4 min read
ఇదేదో సినిమా టైటిల్ లాగా ఉంది కదా. కానీ పూర్వపు రోజులు తలచుకుంటే సినిమా లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇపుడు అలాంటి జాయింట్ ఫ్యామిలీ లు. లేవు. ఉండేది ఒక కొడుకు లేక ఇద్దరూ వున్నా వాళ్ళు కూడా ఒకరు అమెరికా లో వుంటే ఇంకొకడు ఇంకో దేశము లో . కలుసుకునేదీ చాలా తక్కువ కదా. మొన్నీ మధ్య మా బంధువు ఒకాయన వచ్చారు. వాళ్ళకు ఇద్దరూ ఆడపిల్లలు ఇద్దరూ బయట దేశాల్లోనే. వాళ్ళు బాగా వున్నవాళ్ళు. ఏదో మాటల్లో ఇండియా వస్తారా మీ పిల్లలు అనిఅడిగాను. అబ్బే ఎందుకు ఇపుడు యంగ్ జనరేషన్ అంతా అక్కడే ఉన్నారు కదా వాళ్లకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ వుండరు.వచ్చి ఏం చేస్తారు. వాళ్ళు ఇక్కడ అడ్జెస్ట్ అవలేరు, అన్నాడు. అలా పెద్ద వాళ్ళు అలోచిస్తూ వుంటే ఎమనుకోవాలో అర్ధం కాలేదు. ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే అసలు ఈ రోజుల్లో తోడి కోడళ్ళు అనే పదం అర్థం కూడా లేదు. ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా మరలా ఇక్కడికి వచ్చి అడ్జెస్ట్ కాలేరు అనుకుంటే హత విధీ అనుకున్నాము. నేనూ, నా కోడలు. ఏదో తోడికోడళ్ళు గురించి మొదలు పెట్టీ ఈ సుత్తి ఎందుకో అని నాకే అనిపించింది. పూర్వపు రోజుల్లో తోడి కోడళ్ళు అంత కలిసిమెలిసి ఏలా వుండే వారు అని నాకు అనిపిస్తుంది. అయితే చిన్న వయసులోనే పెళ్లి అయ్యాక చిన్నతనం నుండి ఒకే ఇంట్లో వుండటం ఒక కారణము కావచ్చు. వాళ్ళ మధ్యఅన్యోన్యత ఏర్పడుతుంది అనుకుంటాను. మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు అలాగే అక్క చెల్లెళ్ళ లాగా వుండేవారు. మా అమ్మ గారు పెద్ద వయసులో కూడ ఎపుడూ తన తోడికోడళ్ళు గురించి కబుర్లు చెపుతూ వుండేది. మా వదినలతో ఎపుడూ అవే కబుర్లు చెప్తూ వుండేది. మా చిన్న తనం లో తాతయ్య గారు, పెదనాన్న అందరూ కలిసి వుండే వారం.మా అమ్మాయి ఈ మద్య వచ్చినపుడు అడిగింది , నా అమ్మమ్మ గారి వూరు పోస్ట్ చూసీ, మీ బామ్మ గురించి ఏమీ రాయవు అని. మా బామ్మ గురించి నాకు అంతగా గుర్తు లేదు అవిడ నా చిన్నతనంలో నే కాలం చేశారు అనుకుంటా. కానీ మా అమ్మ ఎపుడూ అవిడ గుఱించి చెపుతూ వుండేవారు. అత్తగారు అంటే ఏవో కొన్ని సార్లు కొంత నెగెటివ్ కామెంట్స్ వుంటాయి కానీ మా అమ్మ గారు జనరల్ గా ఎవరి గురించి చెడుగా మాట్లాడే వారు కాదు. అది అవిడ స్వభావము. మా బామ్మ గారు కోడళ్ళు ను ప్రేమ గా చూసేది అని మాత్రం ఎపుడూ చెపుతూ వుండేవారు. నేను చేసిన పని ఏదయినా నచ్చకపోతే నీకు బామ్మ పోలిక పట్టుదల ఎక్కువ అనేది. లేకపోతే నీకూ బామ్మ లాగా పుట్టిల్లు మీద ప్రేమ ఎక్కువ అనేది. ఆవిడ పట్టుదల గురించి మా అమ్మ గారు చెప్పిన ఇన్సిడెంట్స్ వింటే ఇపుడు తమాషా గా వుంటుంది. మా బామ్మ గారు ఇంట్లో ఏదయినా పిండివంటలు కొడుకులకు ఇష్టమైనవి చేస్తే అవి ప్యాక్ చేసుకుని ఉదయం 10గంటలకు మావూరికి వచ్చే ప్యాసింజర్ రైలు లో షాపు లో వున్న ఒక గుమాస్తా ను తోడు గా తీసుకుని చెన్నపట్నం అబ్బాయిలు దగ్గరకు వెళ్తున్నా అని బయలుదేరే వారు ట. ఇంక ఆవిడ బయలు దేరితే ఆపే ప్రసక్తే ఉండదు మా తాతగారు చెప్పినా ఆగేది కాదుట.సో మా బామ్మ తో ఈ పోలిక ఎందుకంటే నేను కూడా ఎవరయినా పుణ్య క్షేత్రాలు వెళుతుంటే నేను వెళ్లే దాన్ని, మా వారికి ఎలాగూ అంత తీరిక వుండదు కదా అని. మా తాత గారు ఆవిడ మాట కాదన్నా అలాగే చెన్నపట్నం బయలు దేరే వారు ట. ఇపుడు అయితే గరుడ వేగా లో ఆమెరికా కూడా అరిసెలు బొబ్బట్లు జంతికలు అవకాయలు పంపుతున్నారు మొన్న సంక్రాంతి కి గరుడ వేగా వాడు ఫోన్ చేసీ అరిసెలు పంపుతారా అని అడిగాడు. ఎపుడూ ఆవకాయ పంపుతాను అందుకు. ఇపుడు అక్కడ కూడా దొరుకుతున్నాయి కదా అంటే అబ్బే ఇంట్లో చేసినట్టు ఉండవు కదా అంటాడు. మా బామ్మ గారు కోడళ్ళు కు మాత్రం పని చాలా చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసే వారు ట . ఆవిడకు ఆరుగురు కోడళ్ళు అందర్నీ ఆప్యాయంగా చూసే వారు, ఆఖరి కోడలు, కొడుకు అంటే మాత్రము చాలా ఇష్టం అని మా అమ్మ గారు చెప్పే వారు. మా చిన్న అత్తయ్య కు చాలా ఏళ్ళ తర్వాత పాప పుట్టినా మా బామ్మ గారు ఆ పాప తో పాటు పుట్టిన మా చెల్లెలు ను ఎక్కువ గారాబంగా ముద్దు చేసేది అని మా అత్తయ్య బామ్మ గారికి కోడళ్ళు అంటే ఎంత ప్రేమో అని చెప్తూ వుండేది. నేను విన్నంత వరకూ మా బామ్మ గారి కబుర్లు . మా చిన్నతనం లో ఎపుడూ ఏదో హడావిడి వుంటూ వుండేది. మేము పిల్లలం చాలామంది వున్నా, అందరికీ జడ లు భోజనాలు అన్నీ టైమ్ ప్రకారం జరిగి పోతూ వుండేవి. మధ్య మధ్యలో పూల జడల హడావిడీ వుండేది. ఎన్ని పనులు చేసినా సాయంకాలం ఏ కాలం లో వచ్చే పూలు ఆ కాలం లో కట్టటం ఒక కార్యక్రమం. అందరం అంత ఓపికగా మరల సాయంకాలం స్నానాలు జడలు వేసుకొని పూలు పెట్టుకోవాలి. ఈ మధ్యలో ఏ పండగలో, పెళ్ళి ల్లో వచ్చాయి అంటే ఇంక ఆ హడావిడి కి అంతు వుండేది కాదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళు విసుగూ విరామం లేకుండా అలా కలిసిమెలిసి పనులు చేసుకునేవారు. ఒకర్ని ఒకరు అక్కయ్యా పెద్దవాళ్ళని, చిన్న వాళ్ళు అయితే పేరు తో పిలుచుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వుండే వారు. అంత పనుల్లో వున్నా ఎపుడూ కడిగిన ముత్యాల్లా మెరిసిపోతూ కళ కళ లా డు తూ వుండే వారు. ఇప్పటి లాగా ఇంట్లో ఒక నైటీ వేసికొని తిరుగుతూ స్నానము చేశారో లేదో కూడా తెలియదు. రెండు మూడు పద్దతులు గురించి ఇపుడు తలచు కుంటే తమాషా గా ఉంటుంది. ఒకళ్ళ బట్టలు ఇంకొకళ్ళు కు కలవకుండా చిన్న పిల్లల బట్టలకు బనీయన్ లకు గుర్తుగా ఎదో ఒక వాళ్ళ పేరులో ఒక అక్షరం కుట్టే వారు.మా పిన్ని గారు స్వీట్స్ బాగా చేసే వారు మా పిన్ని చేత అమ్మ ఎపుడూ స్వీట్స్ చేయిస్తూ వుండేదిమా అమ్మ గారు ఎపుడూ ఏదో సర్డుతూ ఉండే వారు. అక్కయ్య కు ఏమి తోచక పోతే ఆ డబ్బా లు సర్దుతూ వుంటుంది అని మా పిన్ని జోక్స్ వేస్తూ వుండేది తీరిక దొరికితే చాలా తక్కువ అనుకోండి గవ్వలు ఆడుతూ ఉండే వారు. వాళ్ళు అంత ఉత్సాహంగా సఖ్యం గా ఉన్నారు కాబట్టే ఇప్పటికీ మా కజిన్స్ అందరం కలిసినప్పుడు వాళ్ళ గురించి కబుర్లు చెప్పుకుంటూ వుంటాము. మా చెల్లెళ్ళ పెళ్ళి లో నేను పన్లు చేస్తూ అందరినీ పలకరిస్తూ అటూ ఇటూ తిరుగుతూ వుంటే మా పిన్ని గారు నన్ను పిలిచి కాసేపు ఇక్కడ వుండి పెళ్ళి చూడవే ఎంతసేపు తిరుగుతావు. అంటూ తన పక్కన కుర్చీలో కూర్చో పెట్టింది. అవిడ ఆప్యాయత తలచుకునీ మనసులోనే నమస్కారం చెప్పుకుంటాను. మేము బెంగుళూర్ లో గుడి లో లక్ష్మీ నారాయణులు ప్రతిష్ట చేసే భాగ్యము కలిగింది. ఆపుడు మా అత్తగారు అమ్మ గారు తో మా అమ్మ అక్కయ్య గారినీ తీసుకుని వెళ్ళాము. అనుకోకుండా అక్కడ మాబాబాయి పిన్ని వున్నారు మా పెదనాన్న గారి భార్య పెద్దమ్మ వాళ్ళను కూడా పిలిచాము. అక్కడ కార్యక్రమం చాలా బాగా జరిగింది. మా అమ్మ తోడికోడళ్ళు ముగ్గురూ ఒక ప్రక్కగా కూర్చుని ఇంకేదో లోకము లో ఉన్నట్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. మా అత్తగారు అడిగారు ఇంత సేపు వాళ్ళు ఏమి మాట్లాడుకుంటారు అని. మా పెద్దమ్మ వాళ్ళ తోడికోడళ్ళు అంతే లెండి అన్నది. నేను మాత్రము వాళ్ళ ఆప్యాయత కు సంతోషిస్తూ జరిగి పోయిన రోజులు గుర్తు తెచ్చుకుంటున్నారుఅని చెప్పాను. అంతే కదా. గుజారా హువా జమానా ఆతా నహి దుబారా.
Comments