గుజ్జన గూళ్ళు
- murthydeviv
- 3 hours ago
- 3 min read
అసలు ఈ రోజుల్లో ఈ మాట ఎవరికైనా తెలుసో తెలియదో కానీ మా చిన్న తనం లో మేము గుజ్జన గూళ్ళు అని వంటలు
చేస్తూ వుండే వాళ్ళము. అసలు ఆరోజుల్లో మనం ఆడిన ఆటలు ఇప్పుడు పిల్లలు కు అసలు తెలియదు కూడా.
మరీ చిన్న పిల్లలు గా వున్నప్పుడు బొమ్మలు పెళ్లిళ్లు చేయటం ఒక ఆటగా ఉండేది.
తాటాకు తో కొబ్బరి ఆకులతో బొమ్మలు చేసి వాటికీ చక్కటి లంగాలు అవీ కట్టి బొమ్మల పెళ్లిళ్లు చేయటం
భలే సరదాగా ఉండేది..
మా చిన్నతనం లో పిల్లలు కి బట్టలు కుట్టిం చాలంటే ఆ టైలర్ మన వీధి అరుగు మీద మిషన్
పెట్టుకుని కుట్టే వాడు. అతను కట్ చేయగా మిగిలిన బట్టలు అన్నీ దాచి పెట్టి ఈ బొమ్మలు కు కట్టే వాళ్లము.
లక్క చిట్లు పెట్టి మా పిల్లలు కూడా బాగానే ఆడే వారు . మా పిల్లలు టైమ్ కి స్టీల్ లక్కచిట్లు
వచ్చాయి.
మా పెద్దనాన్న గారికి ఒక్కతే కూతురు. తన దగ్గర వెండి లక్కచిట్లు ఉండేవి . బొమ్మలు కొలువు లో
ఆ అక్కయ్య కి ఒక అర అంతా వదిలే వాళ్లము. తన దగ్గర చాలా పింగాణి బొమ్మలు కూడా
ఉండేవి.
అవ్వన్నీ బొమ్మలు కొలువు లో పెట్టి మరలా జాగ్రత్తగా లోపల దాచి పెట్టేది..
ఈ మధ్య పేస్ బుక్ లో , ఇంకా చాలా చోట్ల ఇత్తడి లక్క చిట్లు సేల్ కి పెడుతున్నారు.
చూస్తుంటే చాలా ఉత్సాహం గా కొనాలని వుంటుంది. కానీ ఆడే పిల్లలు, కొలువు లో పెట్టాలని
ఉత్సాహం పిల్లలకు లేదు కదా.
ఇంతకీ అసలు గుజ్జ న గూళ్లకు వస్తే కొంచెం హై స్కూల్ కి వచ్చాక ఈ వంటలు అట సెలవల్లో
బాగా ఆడే వాళ్లము.
ఇప్పుడు పిల్లలు కి చెపితే ఎందుకు స్వి గ్గీ లేదా అని అడుగుతారేమో .
రాళ్ళ తో పొయ్యి పెట్టి అన్నం ఒక కూర చేసేటప్పటికి ఓపిక అయిపోయేది. ఇంక ఆ తర్వాత అమ్మా వాళ్ళ దగ్గర
ఏ ఆవకాయ తెచ్చుకుని భోజనం చేయటం మే.
ఈ గుజ్జన గూ ళ్లు ఎక్కువగా మా మేనత్త గారి ఇంట్లో తోట లో ఎక్కువగా ఆడే వాళ్లము , ఎందుకంటే తోట లో
అయితే ఆ పొయ్యి పెట్టటానికి వీలు గా ఉండేది
. మా అత్తయ్య కూతురు మా ఆందరికీ రింగ్ లీడర్ , చాలా
యాక్టీవ్ గా ఉండేది . తను చెప్పినట్లే మేము వినే వాళ్లము.
మా అమ్మమ్మ గారి ఇంట్లో కూడా తోట ఉండేది . అక్కడ మా అక్కయ్య మా చేత ఈ అటలు అన్నీ బాగా ఆడిస్తూ
ఉండేది. అక్కయ్య అయితే చెక్క బొమ్మలు కి చక్కగా లంగాలు అవీ కుట్టి మా చేత బొమ్మలు పెళ్లి చేయించేది.
ఇంక కాలేజ్ కి వచ్చాక ఇంట్లో వండినవే మేడ మీద కు తీసుకుని వెళ్లి మూన్ లైట్ డిన్నర్ లు చేసుకునే వాళ్ళము.
అట్ల తదియ ఉండ్రాళ్ల తదియ కు వెన్నెల్లో నీడ అట ఆడటము చాలా సరదాగా ఉండేది.
తెల్లవారాక ఊయల ఊగటం , అన్నయ్యలు కొంచెం గట్టిగా ఊపితే భయం వేసినా అలాగే కళ్ళు మూసుకుని
ఊగటమే. ఈ ఉయ్యాల ఊగటం లో కూడా మా మేనత్త కూతురు రింగ్ లీడర్ లాగా ఉండేది.
ఎంత ఎత్తు అయిన ఊగటమే కాకుండా ఉయ్యాల మీద నిలబడి అన్నయ్య లతో సమానంగా ఊగేది.
ఇంక చెట్లు ఎక్కటం కూడా చాలా సరదాగా ఉండేది . నే ను అయితే ఎక్కటం బాగానే ఎక్కినా దిగటానికి
చాలా భయం గా ఉండేది.
అన్నయ్య లు పర్వాలేదు దిగు పడితే మేము పట్టుకుంటాము అన్నా నాకు దిగటానికి చాలా భయం గా ఉండేది.
మా అన్నయ్యలు ఎంతగా చెట్ల మీద ఉండేవారు ఆంటె మా అమ్మ నాన్నగారు సెలవల్లో వాళ్ళను కంట్రోల్
చేయలేక పోయే వారు.
ఎండా కాలము సెలవల్లో పగలు ఇంట్లో నే ఎన్నో ఆటలు ఆ ఆడేవాళ్ళము. కేరొమ్ బోర్డు, బిజినెస్ , కార్డ్స్,
ఇవే కాకుండా అష్ట చెమ్మా, బారా కట్ట అని గవ్వలు తో ఆటలు.
ఇంక చింత గింజలు అయితే మా చెల్లెలు డబ్బాలు తో కలెక్ట్ చేసి పెట్టుకునేది.
అయిదు రాళ్లు, పన్నెండు రాళ్లు తో ఆడే ఆటల్లో ఎపుడూ ఫస్ట్ గా ఉండేది. ఈ ఆట ల మద్యలో
కిటికీలకు వట్టివేళ్ళ చాపలు కట్టి వాటి మీద నీళ్లు చల్లటం ఒక సరదాగా ఉండేది
సాయంత్రం చల్ల బడగానే బయట ఆటలు , అన్నింట్లోకి అందరూ కలిసి ఆడే అట ఉప్పాట .
బాగా చేతులు పొడవు వున్న వాళ్లు లైన్ మీద ఉంటే వాళ్ళని తప్పించుకుని ఉప్పు తేవటానికి
నానా శ్రమ పడాల్సి వచ్చేది.
ఈ అట ఎక్కువగా సముద్రం ఒడ్డున ఆడుతూ వుండే వాళ్లము . ఇప్పుడు అయితే ఒక్క అడుగు కూడా
ఆ ఇసుక లో వేయలేము ఆ రోజుల్లో ఎలా ఆడే వాళ్లము అనుకుంటాను.
ఆడపిల్లలు మాత్రం ఆడే ఆట తొక్కుడు బిళ్ల , అపుడపుడు మా అన్నయ్యలు కూడా ఆడుతూ ఉండేవారు.
నాలుగు రోజులు క్రితం పాతాళ బై రవి సినిమా 75 ఇయర్స్ అయిందని మా అబ్బాయి నేను కూర్చుని
యూ ట్యూబ్ లో చూసాము.
అందులో రేలంగి పాట విని ఈ ఆట నాకు తెలియదు. అంటున్నాడు మా అబ్బాయి.
చిన్నప్పుడు వాడు గోళీలు అట చాలా ఆడే వాడు..కొన్ని గోళీలు తగ్గినా
మర్నాడు మరలా వెళ్లి ఆడి గోళీలు గెలుచుకుని వచ్చే వాడు.
మా తమ్ముడు కూడా గోళీలు బిళ్ళము గోడు అని ఇంకో అట ఉండేది ఎప్పుడూ ఆ ఆటలు ఆడుతూ ఉండేవాడు
మా అబ్బాయి గోళీలు తో పాటు క్రికెట్ కూడా ఆడేవాడు. స్కూల్ తరఫున కూడా క్రికెట్ ఆడేవాడు.
మా మనవరాలు కి గోళీలు ఎలా అడతారో ఒక అరగంట ఎక్సప్లయిన్ చేయసి వచ్చింది.
మేము ఆడే ఆటల్లో ఇంకొక అట ఉండేది, ఆ పేరు కూడా నాకు గుర్తు లేదు . అటు ఇటు కొంతమంది కూర్చుంటే
వెనకాల గా వచ్చి టవల్ వేస్తే కనుక్కోవాలి. ఆ అట కూడా చాలా సరదాగా ఉండేది.
ఇంక అన్నయ్యలు ఆడే ఆటల్లో కబ్బడి సాయంత్రం దొరువుల దగ్గర ఇసుక లో ఆడి వచ్చేవాళ్ళు.
దొరువు అనేది ఎలా వుంటుందో నాకు తెలియదు. బహుశా చిన్న చెరువు లాంటిదేమో
వేసవి కాలం సెలవల్లో కజిన్స్
అందరూ కలిసి ఈ కబ్బడి ఆడి అన్నయ్యలు ఆటల్లో ఒక్కొక్కసారి
బాగా కొట్టుకునే వాళ్లు కూడా, ఎక్కువగా బీచ్ ఒడ్డున కూడా ఆడుతూ వుండే వాళ్లు.
బీచ్ ఒడ్డున అయితే మేము రిఫరి లాగా కూడా ఉండేవాళ్ళము. రాస్తూ ఉంటే ఇప్పడు గుర్తు వచ్చింది
ఆ అట పేరు కోకో ఇప్పుడు కబ్బడి తో పాటు ఈ అట కూడా పోటీలు పెడుతున్నారు.
ఇన్ని ఆటలు ఆడిన మన బాల్యం ఒక మరపురాని మధురమైన నిజం.
మరీ ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటే పెద్ద వాళ్లు ముఖ్యం గా మా చిన్న మేనత్త బాగానే కంట్రోల్ చేసేది ,
మధ్య మధ్యలో మీరు అందరూ కిస్కిందా నగరం నుండి వచ్చారు అనేది .
ఈ రోజుల్లో క్యాండీ క్రష్ తప్పితే ఆ జాయింట్ ఫ్యామిలి లు లేవు. ఆ ఆటలు లేవు
మనకి అంత మధురమైన బాల్యం ఇచ్చిన మన పెద్దలకు నమస్కృతులు.
ఆందరికీ పరా భవ నామ సంవత్సర శుభాకాంక్షలు . యింకా కొన్ని కబుర్లతో నూతన సంవత్సరం లో కలుద్దాము
శుభరాత్రి
పరా ఆంటే అమ్మ వారు, భవ ఆంటే శివుడు పరా భవ ఆంటే అర్ధం అదీ.
Comments