కాఫీ, కాఫీ
- murthydeviv
- 6 days ago
- 4 min read
ఒక డైరెక్టర్ గారు తన సినిమా పేరు కి క్యాప్షన్ లాగా మంచి కాఫీ లాంటి సినిమా అని పెట్టాడు. సినిమా నిజంగానే మంచి కాఫీ లాగా బాగుంది. సినిమా కాఫీ లాగా వుండటమేమిటి అని అడగకండి. ఈ మధ్య వచ్చే సినిమాలు చూడటం చాలా కష్టం. ఆ సినిమా మాత్రం ఎపుడు చూసినా ఉదయాన్నే చల్లటి గాలి లో పక్షులు కిచకిచ లు వింటూ హాయిగా మంచి కాఫీ తాగినట్లు వుంటుంది అసలు ఈ కాఫీ గోల ఎందుకు అంటే ఒక రెండు నెలలు నుండి అలవాటు పడిన కాఫీ పౌడర్ వాడు లేడు. షరా మామూలుగా అమెరికా లో పిల్లలు ఉండే వాళ్ళ బాధల లాంటివే అంటే అతనివి కూడా, అదేదో పాట లాగా వెళ్లలేను, వెళ్ళ కుండా ఉండలేను సంవత్సరానికి ఒకసారి అలా రెండు నెలలు వెళ్ళిపోతాడు ముందే స్టోర్ చేసుకున్న కాఫీ పొడి ఒక నెల వస్తుంది. తర్వాత ఇంకే బ్రాండ్ తెచ్చుకున్నా ఆ కాఫీ నచ్చదు. అతను అలా వెళ్లినప్పుడు ఇంక ఎవరినైనా వెతకాలి అంటూ గట్టిగా నిర్ణయం తీసుకున్నా, అతను వచ్చిన మర్నాడే ఇంకా జెట్ లాగ్ తీరకుండానే మేడమ్ డ్రైవర్ ను పంపండి మీ కాఫీ పౌడర్ రెడీ అని ఫోన్ చేస్తాడు. సో ఇరవై ఏళ్ల అనుబంధం మర్చిపోలేము కదా. మా చిన్నతనం లో మా అమ్మ గారు ఆకుపచ్చ గా ఉండే కాఫీ గింజలను నల్లగా వేయించేది. ఇల్లంతా కాఫీ వాసన తో నిండి పోయేది.ఆ గింజలు మర పట్టించే వాళ్లేమో అప్పట్లో అంత పరిజ్ఞానం లేదు . మా పెద్దనాన్న లు , మా అమ్మ గారు మాత్రమే కాఫీ తాగే వారు . పిల్లలు కు అసలు కాఫీ నిషిద్ధం. మా రెండో పెద్దనాన్న గారు కాఫీ బాగా తాగే వారు అనుకుంటా, మా అత్తయ్య గారి పిల్లలు ఆయన్ని కాఫీ మామయ్య అని పిలిచే వారు. ఆయన విజయవాడ లో ఉండే వారు ,మేము ఎపుడు వాళ్ళింటికి వెళ్ళినా అల్లుడు గారు వచ్చారు మంచి కాఫీ ఇవ్వు అని మా పెద్దమ్మ తో అనే వారు. భోజనము టైమ్ అవుతున్నా, మంచి కాఫీ తర్వాతేభోజనము. ఇప్పుడు మాఇంట్లో మావారు కూడా అలాగే ఏ టైమ్ అయినా కాఫీ ఇమ్మంటారు. వాళ్ళు వద్దు అనగానే తాగ వో యి నీతో నాకు ఇస్తారు అంటారు. నేను కాఫీ కి ఎపుడు ఎడిక్ట్ అయ్యానో గుర్తు లేదు కానీ రోజుకు ఒక నాలుగు అయిదు సార్లు అయినా కాఫీ తాగక పోతే ఏదో చికాకు గావుంటుంది. బహుశ పంజాబ్ లో ఉన్నప్పుడు నెస్కేఫ్ తో అలవాటు అయివుండాలి. ఇంక హైదరాబాద్ రాగానే ఫిల్టర్ కాఫీ తాగడం అలవాటు అయ్యింది. ఉదయాన్నే పేపర్ చూస్తూ కాఫీ తాగడం ఒక హాబీ గా మారిపోయింది. పిల్లలు స్కూల్ కి వెళ్ళే రోజుల్లో మాత్రం వాళ్ళ స్కూలు హడావిడి అయ్యాక తీరికగా కూర్చుని రిలాక్స్ అవుతూ తాగే కాఫీ, అసలు ఆ రుచే అమోఘం. ఉదయాన్నే ఫ్రెష్ గా పాల ప్యాకెట్ కాగపెట్టి ఆ పాలు తో తయారైన కాఫీ చాలా అద్భుతంగా ఉంటుంది. రోజూ ఉదయాన్నే నా కోడలు మాత్రం అలాగే ఒక పెద్ద కప్ తో తాగుతుంది. రోజు కి ఒక్కసారి తాగే వాళ్ళు అయితే సరే కానీ మనలాగా రోజుకి ఒక ఐదు సార్లు తాగితే పాలు అన్నీ కాఫీ కే సరి పోతాయి మన చిన్నతనం లో పాల ప్యాకెట్ లు లేవు కదా పాలు రోజుకు రెండుసార్లు తెచ్చి పోసే వారు. సాయంత్రం పాలు కొంచెం చిక్కగా పెరుగు కోసం కొనే వారు. ఫ్రెష్ పాలు అనుకుంటూ నేనూ మా వదిన ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగేవాళ్ళం. మా పెద్ద అన్నయ్య తను కాఫీ తాగడు, మీరు ఇలా కాఫీ లు తాగుతూ మాకు మజ్జిగ పోయండి అని జోక్ చేస్తూ వుండేవాడు. మా రెండో అన్నయ్య కి నాకు కాఫీ ఉంటే చాలు. మేము ఇద్దరం ఉపవాసా లు కూడా ఎక్కువగా ఉండే వాళ్ళం. మా అమ్మ గారు కాఫీ తాగి ఉపవాసం ఏమిటో అనేవారు. కానీ మా నాన్న గారి లాగా అంత ఉపవాసం ఉండలేము కదా అనుకుంటూ కాఫీ తాగటమే. మా అత్తగారు నా చేత మాఘమాసం ఆదివారం నోము పట్టిస్తాను అంటూ ఒక ఏడాది పాలు మానెయ్యాలి అన్నారు. ఆవిడ ఆద్వర్యం లో ఎన్నో నోములు చేశాను కానీ ఈ నోము కు మాత్రం నో చెప్పేసాను. బ్లాక్ కాఫీ తాగలేము కదా. బ్లాక్ కాఫీ అనగానే అమెరికా గుర్తు వస్తుంది. అక్కడ వున్న వాళ్ళు నన్ను తిట్టుకున్నా సరే, మన ఫిల్టర్ కాఫీ ముందు వాళ్ళ కాఫీ లు ఎందుకూ పనికి రావు . మొదటి సారి ఏదో ఫైవ్ స్టార్ హోటల్ కి ఎవరో పిలిస్తే వెళ్ళాము. అక్కడ వెయిటర్ చాలా స్టయిల్ గా డికాషన్ పాలు షుగర్ అన్ని విడి విడిగా తెచ్చిపెట్టాడు సినిమా లో లాగానే షుగర్ ఎంత అంటూ కలిపి ఇచ్చాడు. అదేదో కుడితి నీళ్ళ లాగా ఉంది వాడు అన్నీ కలిపి ఇచ్చే టప్పటికి వేడి కూడా లేదు . నా మొహంలో ఫీలింగ్స్ చూసి మావారు ఇది ప్యూర్ కాఫీ చికోరి వుండదు అంటూ ఏదో ఇదే అసలు కాఫీ అంటూ గొప్పగా చెప్పారు. సిగరెట్ తాగుతూ చల్లగా కాఫీ తాగే ఈయనకి అసలు కాఫీ రుచి ఏం తెలుస్తుందిలే అనుకున్నాను. ఫస్ట్ టైమ్ యు. ఏస్ వెళ్ళినప్పుడు న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో ఎవరూ రాకపోయినా మ్యానేజ్ చేసుకుని యింకో ఫ్లైట్ కి లగేజ్ చెకిన్ చేసి రిలాక్స్ అవుతూ ఎదురుగా వున్న కాఫీ షాపు లో ఇంగ్లీష్ వింగ్లీష్ శ్రీదేవి లాగా ఏదో చెప్పి కాఫీ తీసుకున్నాను. ఆ అమ్మాయి ఇచ్చిన సోలేడు కాఫీ కలర్ నీళ్ళు తీసుకుని ఏదో పర్వాలేదు వేడిగా గా ఉందిలే అనుకుంటూ తాగా ను. అక్కడ ఉన్న రెండు నెలలు లో ఆ పాలు 2 r 3 పర్సెంట్ అంటూ రక రకాలుగా ట్రై చేస్తూ నెస్కేఫ్ తో అవస్త పడ్డాను కానీ తర్వాత ఎన్నిసార్లు వెళ్ళినా నా బ్రాండ్ కాఫీ పౌడర్ తీసుకొని వెళ్ళేదాన్ని. ఫస్ట్ టైమ్ యు ఎస్ వెళ్లినప్పుడు అందరూ డైట్ కోక్ లు పట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత స్టార్ బక్స్ కాఫీ ఫేమస్ అయిపోయింది. అంతకు ముందు ఏం బ్రాండ్స్ వుండేవో తెలియదు కానీ ఈ స్టార్ బక్స్ లో క్యాపిచినో అని, layoto అనో ఏదో ఒక పెద్ద పేపర్ గ్లాస్ లో సగం నురుగుతో ఉండే ఆ కాఫీ తాగక పోతే మోడరన్ మదర్ ను కాదు అనుకుంటారేమో అని మెల్లగా తాగుతాను.ఈ మధ్య ఎక్కడ చూసినా చెన్నపట్నం కాఫీ అని , కుంభకోణం కాఫీ అని , సరే కాఫీ డే ఎప్పటి నుండో వున్నది. ఈ మధ్య మన సోదర రాష్ట్రం వాళ్ళు చెన్నై అని సింపుల్ గా పేరు పెట్టుకున్నారు కానీ, మా చిన్నతనం లో మా నాయనమ్మ ఏవయినా పిండి వంటలు చేస్తే, అవ్వన్నీ ప్యాక్ చేసుకుని చెన్నపట్నం అబ్బాయి ల దగ్గరకు వెళుతున్నా అంటూ బయలుదేరేదిట. ఆ పాత పేరునే కొంచెము సింపుల్ చేసి పెట్టుకున్నారు. విజయవాడ వెళ్ళేటప్పుడు కూడా బోలెడు కాఫీ షాపులు వెలిశాయి. కానీ ఆ చెన్నై వాళ్ళ కాఫీ రుచే అమోఘం అనిపిస్తుంది. ఈ మధ్య ఐస్ కాఫీ అని వస్తోంది, ఆ కాఫీ బదులు ఐస్ క్రీమ్స్ తినవచ్చును కదా, ఐస్ కాఫీ ఏమిటి అనుకుంటాను నేను. ఈ మధ్య ఫైవ్ స్టార్ హోటల్ వాళ్ళు కూడా కొంచెం మారి చికోరి కాఫీ ఇస్తున్నారు. మంచి కాఫీ లాంటి సినిమా తీసిన డైరెక్టర్ గారు కూడా ఈ మధ్య హింస తో కూడిన సినిమా తీసారుట. మా ముఖ పుస్తక మిత్రులు గొడవ పెడుతున్నారు. ఈ మధ్య థియేటర్ లో సినిమాలు చూడటం మా నే సా ము కదా. ఇంట్లో నే మంచి కాఫీ గ్లాసు తో దూకుడుగా అత్తారింటికి దారి వెతుక్కుంటూ సత్యం గారి అబ్బాయి నో , అతడినో, విధేయుడు గా వున్న రాముడు నో, లేక అరవింద నేత్రములు వాడినో చూద్దాం. ఇవేవీ కాకపోతే ప్రైవేట్ చానల్స్ లో మనల్ని నవ్వించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న చిన్న యాక్టర్స్ సినిమాలు చూద్దాం. ఏం చూసినా మన కాఫీ రుచి మాత్రం కుంభకోణం లాగా అద్భుతంగా ఉండాలి. మరి మీ ఇంటికి వచ్చినప్పుడు మంచి కాఫీ ఇవ్వటం మరచిపోకండి.
Comments