ఈ మధ్య శ్రీశైలము గురించి చెప్తూ అందరూ ఇష్ట కామేశ్వరీ దేవాలయము గుఱించి చెపుతున్నారు. మేము చాలా సార్లు శ్రీశైలము వెళ్ళాము. కానీ మొదట్లో అంటే 1980 లో ఆ దేవాలయం గురించి అంతగా తెలియదు. ఎపుడు శ్రీశైలము వెళ్ళినా ప్రయాణము లో ఏవో సాహస కృత్యాలు జరుగుతూనే వుండేవి. ఎందుకో తెలియదు. కానీ ఒక్కసారి తప్ప మిగతా అన్నిసార్లు దైవ దర్శనం చేసుకుని సంతోషంగా వచ్చాము. అసలు ఈ రోజు ఈ శ్రీశైలము ఎందుకు గుర్తు వచ్చింది అంటే ఒక రెండుమూడు రోజులు నుండి ఆ డ్యామ్ సొరంగం లో చిక్కుకు పోయిన వాళ్ళ గుఱించి రోజూ పేపర్ లో చదవటం వలన అనుకుంటాను. హైద్రాబాద్ నుండి శ్రీశైలము ఘాట్ రోడ్డు కొంత స్టీప్ గా చాలా మలుపులతో వుంటుంది డ్రైవరు చాలా జాగ్రత్తగా నే డ్రైవ్ చేయాలి. రాత్రి 8 గంటల తర్వాత ఘాట్ రోడ్డు మీద ఎవరినీ పంపరు.మేము ఒక్కసారి శ్రీశైలము నుంచి వస్తూ ఆ డ్యామ్ ల దగ్గర ఆగి ఆ సొరంగం చూశాము. ఆరోజు అక్కడ జపనీస్ ఇంజనీర్స్ వర్క్ చేస్తున్నారు. చూస్తుంటనే అమ్మో వీళ్ళు ఎలా పని చేస్తారో ఏ వసతులు లేని ఇలాంటి చోటులో అని ఒక గౌరవము కూడా కలుగుతుంది. పిల్లలకు చూపించాలని అక్కడ ఆగి అవి అన్నీ చూసీ చాలా గొప్ప గా ఫీల్ అయ్యాము.2009 లో మా అమ్మాయి అమెరికా నుండి వచ్చినపుడు అందరం కలసి వెళ్ళాము. అక్కడ పూజలుఅభిషేకాలు అన్నీ అయ్యాక, మా అమ్మాయి అమెరికాలో తనకు ఎవరో చెప్పారని ఇష్ట కామేశ్వరీ దేవాలయము కు వెళ్దాము అన్నది. చాలా మహిమ గల గుడి అని కూడా చెప్పారు అన్నది. మేమూ అంతకుముందు ఎపుడూ వినలేదు. మాకు పూజలు అవీ చేయించిన మీడియేటర్ అడిగితే దగ్గరే కానీ రోడ్డు సరిగా వుండదు, జీపుల్లో వెళ్ళాలి, మీ కార్లు వెళ్ళవు 25 కిలోమీటర్లు ఒక రెండు గంటల ల్లో వెళ్ళి రావచ్చు అన్నాడు. అతను చెప్పాడు కదా అని ఒక జీప్ లో బయలుదేరాము. ఒక్క కిలోమీటరు మాత్రమే కాస్త కచ్చా రోడ్డు వున్నది. ఇంక ఆ తర్వాత అంతా కొండరాళ్ళు, అసలు రోడ్డు కాదుకదా, రాళ్ళు తప్పితే ఏమీ లేదు. కానీ చాలా జీపులు అలాగే వెళుతున్నాయి. కొంత మంది నడచి వెళ్లుతున్నారు. ఆ జీపు గుంటలో పడితే మేము కిందకీ రాయి మీద పడితే పైకి ఎగురుతూ, నింగి లోనా నే ల లోనా మనము వున్నాములే అనే పాట గుర్తుకు వస్తుంటే, మధ్యలో మా వారి నా వైపు చూపులు తప్పించుకుంటూ అమాయకంగా మొహం పెట్టుకుని కుర్చున్నాను. మధ్యలో ఇంకో దిగులు ఏమిటంటే నా నడుము హైద్రాబాదు కు సరిగా చేరుతుందా లేదా అని. అలా ఒక పది కీలో మీటర్లు వెళ్ళగానే ఆ జీపు కాస్తా ఏదో విరిగి పోయిందని ఆపేశాడు. వెనక్కి వెళ్లలేము ముందుకు ఎలా వెళ్ళాలో తెలియదు. ఈ కొత్త కొత్త గుడుల గురించి ఏ పుస్తకాల్లో చదవవద్దు అని మా వారు అక్కడే ఒక క్లాసు తీసుకున్నారు. చెప్పింది నేను కాకపోయినా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎలాగో వెళ్తాములే అనుకుంటూ మౌనము వహించాను. పాపము ఆ జీప్ వాడు యింకొక జీప్ చూసి మమ్మల్ని ఎక్కించాడు. కానీ మేము తెలుసుకున్నదేమిటీ అంటే ఆ బండలు రాళ్ళ మీద ప్రతి జీపూ అలాగే ఆగి పోతూ ఉంటాయి. ఇంతక్రితం అగిన జీపును కొంచెం రిపేర్ చేసీ మరలా నడుపుతూ వుంటారు. ఆ జీపులు ఏ క్షణం లో అయినా విరిగి పోవచ్చు. ఆరోజు కూడా ఏదో నాకు పార్ట్ పేరు గుర్తు లేదు కానీ అది విరిగి పోయింది. మేము కింద పడకుండా వున్నాము అంటే ఏదో భగవంతుడి దయ అనుకోవాలి. అలా నాకు గుర్తు వున్నంత వరకూ రెండు మూడు జీపులో ప్రయాణము చేసీ గుడి కి చేరాము. అప్పట్లో ఆ గుడి చాలా చిన్న గా కిందికి వున్నది. అలాగే కింద కూర్చుని అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అక్కడ పూజారులు పూజ ఏమీ చేయరు మనమే అమ్మవారికి బొట్టు పెట్టీ ప్రార్థించు కోవచ్చు. మరలా వెనక్కి వచ్చేటప్పుడు కూడా అదే విధంగా రెండు మూడు జీపులు ఎక్కుతూ దిగుతూ మరలా శ్రీశైలము చేరాము. మేము వెనక్కి వెళ్ళాక ఆ మీడియేటెర్ నీ ముందు చెప్పలేదే అని అడిగాము. మీకు తెలుసు అనుకున్నాను అంటాడు. అతను 25 కిలోమీటర్లు రెండు గంటల్లో వెళ్లి రావచ్చు అన్న ప్రయాణం మాకు ఆరు ఏడు గంటలు పట్టింది అమ్మవారి దయ వల్ల పసిపిల్లలు ఇద్దరూ ఏడ్చి గొడవ చేయలేదు. మేమూ కింద పడకుండా క్షేమంగా వున్నాము. కానీ నాకు మాత్రం ఒక రెండు మూడు గంటలు మరీ భక్తి, పూజలు ఎక్కువ అయితే పిచ్చి లాగా అవుతుందని అని మా వారి క్లాసు తో కొంచెం విరక్తి వచ్చి ఈ అడవిలోనే కృష్ణశాస్త్రి గారి కవిత లాగా ఆకులో ఆకునై పూవు లో పూవునై ఈ అడవి లో దాగిపోనా అనిపించింది.. ఇంకో అడ్వెంచర్ తో ఇంకొకసారి.
ఇష్ట కామేశ్వరీ
murthydeviv
Comments