M
N
a
Mans
తాతయ్యలు, మేనత్త లు, బాబాయిలు ఎంత గారాబంగా చూసినా మన చిన్నతనంలో అమ్మమ్మ గారి ఇల్లు అంటే ఆ వయసులో ఏదో డిస్నీ లాండ్ కి. వెళ్ళినంత ఆనందంగా వుండేది ఎపుడూ గడిచిపోయిన రోజులు గురించి ఎందుకు ఆలోచించటం అని చాలా మంది అంటారు. కానీ ఎందుకో ఆ రోజుల్లో వుండే ఆప్యాయతలు ఇపుడు తలచుకుంటే మనసుకు ఆహ్లాదంగా వుంటుంది . ఈ మధ్య ఏదో బీచ్ రిసార్ట్ కు వెళ్తూ మధ్యలో మా అమ్మమ్మ గారి ఊరి మీద నుండి వెళ్ళాము. ఆగటానికి టైమ్ లేక పోయింది. సరే మా గ్రాండ్ చిల్డ్రన్ కు కాసేపు ఆ ఊరి గురించి చెప్పాను. కార్ లో వెళ్ళేటపుడు నేను కొంత సేపు వాళ్ళ పాటలు వింటే వాళ్ళు కాసేపు నా పాటలు వింటారు అది ఒక రూల్ అన్నమాట. మొత్తానికి కారు ప్రయాణము పిల్లల తో ఆనందం గానే వుంటుంది. మా అమ్మ గారి కి అన్న దమ్ములు లేకపోయినా మా పెద్దమ్మ పెద్దనాన్న గారు అక్కడే వుండేవారు సెలవల్లో తాతగారు మమ్మల్ని పంపమని లెటర్ రాసే వారు. ఇంక మాకు ఆ వూరు వెళ్ళటం అంటే పండగ లాగా వుండేది.మా తాతయ్య వాళ్ళ అమ్మ గారు కూడా ఉండే వారు అవిడ చిన్న రోలు లాంటి దాన్లో చిరుతిండి అంటే కారప్పూస అలాంటివి కొట్టుకుని తింటుండే వారు. ఇపుడు రోజూ అవిడ గుర్తు వస్తుంది . ఎందుకంటే ప్రస్తుతం నాకు కూడా దంతాల సమస్య వచ్చి ఏమీ తినలేక పోతున్నాను అందువలన రోజూ తాతమ్మ గారిని తలచుకోవటం, అరోజులు గుర్తుకు వస్తూ ఉంటాయి. అమ్మమ్మ, తాతగారి గారాబం ఎక్కువే వుండేది. మాకు వాటికన్నా కొన్ని ఇష్టమైన విషయము ఏమిటంటే అక్కడ ఊరి మధ్యలో ఒక పెద్ద గిలక బావి వుండేది. చాలా పెద్ద బావి చాలా గిలకలు వుండేవి. బహుశ మంచి నీళ్ళ బావి అనుకుంటాను. ఆరోజుల్లో అది కూడా తెలియదు వంటమనిషి తో పాటు మేమూ ఒక చిన్న బిందె తో వెళ్ళే వాళ్ళము. ఆ గిలక మీద నుండి నీళ్ళు తో డటం చాలా సరదాగా వుండేది. మా తాత గారు పెద్దమ్మ వద్దు అన్నా కుడా ఎలాగో బ్రతిమలాడి వెళ్ళే వాళ్ళం. ఇంక గోరింటాకు చెట్టు వుండేది ఆ ఆకు మేమే కోసీ పని అమ్మాయి పెద్ద రోలు లో రుబ్బుతుంటే పక్కన కూర్చుని అదేదో గొప్ప పని లాగా వుండేది. ఆ అమాయకత్వం లో ఉండే ఆనందం ఇపుడు ఈ పిల్లల కు వుందా అనుకుంటాను. మా వూర్లో అమ్మ గోరింటాకు కూడా కొనాలి. అమ్మమ్మ గారి ఇంట్లో చెట్టు నుండి మేమే కోసే వాళ్ళం. ఆ మధురమైన అనుభూతి కోసం నేను హైద్రాబాదు లో మా యింట్లో కూడా గోరింటాకు చెట్టు పెంచాను. ఇంక జామ చెట్టు మీదయితే అన్నయ్యలు అసలు ఎక్కితే దిగేవాళ్ళు కాదు. సాయంకాలం తాత గారు దగ్గర లోనే వున్న దోస తోట కు వాకింగ్ లాగా తీసుకుని వెళ్ళే వారు. అక్కడ దోసకాయలు కోయటం కూడా చాలా సరదాగా వుండేది. అన్నిటికన్నా వాకిట్లో మాలతి పూల చెట్టు అల్లుకుని వుండేది సాయంకాలం అయితే చక్కటి తెల్లటి పువ్వులతో సువాసనలు వెదజల్లుతూ వుండేవి. ఆచెట్టు ను గిన్నె మాలతి అంటారుట. నేను మా ఇంట్లో వెయ్యాలని ఎంతో వెతికాను కానీ ఎక్కడా దొరకలేదు. రెండు మూడు వేప చెట్లు వుండేవి. అమ్మమ్మ కొంచెం ఎండ తగ్గగానే ఆ రాలిన వేపపువ్వు అంతా ఏరించి బాగు చేసేది. ఆ ఎండిన పువ్వు తో కూడా పచ్చడి చేస్తారుట ఆరోగ్యము అని చెప్పారు. ఆరోజుల్లో పెద్దవాళ్ళు ఏదోఒక పని చేస్తూనే వుండేవారు. టీ వి లు సెల్ ఫోన్లు లేవు కదా. టి వి అంటే గుర్తు వచ్చింది. మా తాత గారు ఎపుడూ రేడియో వింటూ వుండే వారు. మా అమ్మమ్మకి a విశేషాలు చెప్తూ వుండే వారు ఆపుడు ఆయన ఇంక కొన్ని రోజుల్లో రేడియో లోనే మనుషులను చూడచ్చు అని చెప్పటం నాకు గుర్తు. తాతగారు టీ. వి చూడలేదు కానీ అమ్మమ్మ హైద్రాబాదు లో అమ్మ గారి దగ్గర వుండేవారు. ఆమె టీ వి చూసీ ఆ మాట గుర్తు చేసుకున్నారు. కాల ప్రభావము వలన మా వారే ఆ టెలివిజన్ తయారు చేశారు మా తాతగారు వుంటే అనిపించింది ఆ క్షణంలో. ఇంక మా పెద్ద నాన్న గారికి సినిమాలంటే ఇష్టం వుండేది. అందు వలన బోలెడు సినిమాలు చూసే వారం మా పెద్దమ్మ స్వీట్స్ చేయటంలో అందె వేసిన చెయ్యి. పెద్దమ్మ పాల మిఠాయి అని చేసేది. ఇప్పటికీ ఎన్నిసార్లు చేసినా అలా మాత్రమ్ కుదరదు. తాతగారి ఇంట్లో బావి పక్కనే పెద్ద ముద్ద గన్నేరు చెట్టు వుండేది. ఎపుడూ చెట్టు నిండా పూసి గులాబీ పూల లాగా సువాసనలు వెదజల్లుతూ వుండేవి. ఎక్కడ ఆ చెట్టు చూసినా ఆ పూలు ఆ రోజులు గుర్తు వస్తాయి. మా ఇంట్లో కూడా వేశాను కానీ అలా పూలు మాత్రమ్ రావు. సెలవల్లో మా పిన్ని గారికి అబ్బాయిలు వాళ్ళు కూడా వచ్చారంటే సందడి, అల్లరి, కబుర్లు అన్నీ వుండేవి. పక్కనే ఉన్న తోటలో గుజ్జన గుళ్ళు అని వంటలు చేసే వాళ్ళం. అదేమిటో ఆపుడు ఎలా చేసినా చాలా రుచి గావుండేవి. ఒకసారి దగ్గర గా వున్న నాగార్జున సాగర్ కు తీసుకుని వెళ్ళారు తాతగారు. అప్పటికి ఇంకా డ్యామ్ కట్టలేదు. తవ్వకాల్లో బయటపడ్డ శిల్పాలు అన్నీ ఒక మ్యూజియం లో ఏర్పాటు చేశారు. తాతగారు మా అందరికీ ఆ విషయాలు అన్నీ చక్కగా చెప్పారు. యింకా ఆ రెండు కొండల మధ్య డ్యామ్ వస్తుంది అని ఆపుడు ఆ డ్యామ్ మీద రోడ్డు పడితే హైద్రాబాద్ చాలా దగ్గర అవుతుందని చెప్పారు. ఆ రోజుల్లో హైద్రాబాద్ రావాలంటే విజయవాడలో రైలు మారి వెళ్ళాలి అని చెప్పారు. ఎపుడు సాగర్ వెళ్ళినా తాతగారి మాటలు గుర్తు వస్తాయి. అలాగా ఆరోజుల్లో అమ్మమ్మ గారి ఇల్లు అంటే మాకు డిస్నీ లాండ్ వెళ్లి నట్లే వుండేది. ఇపుడు ఈ వయసులో కూడ ఏదో ఒక పని చేస్తూ యాక్టీవ్ గా ఉన్నామంటే అమ్మమ్మ వాళ్ళ జీన్స్ వలనే కదా. మనకు మధురమైన బా.ల్యము యిచ్చి యింకా ఇంత ఓపికగా పనులు చేసే తెలివి తేటలు ఇచ్చిన మన పెద్దవాళ్ళ ఆశీస్సులు కోరుకుంటూ వాళ్ళకే నివాళి గా
అమ్మమ్మ గారి ఇల్లు
murthydeviv
Comments