అట్ల తదియ
- murthydeviv
- 6 days ago
- 2 min read
దసరా నవరాత్రులు, హడావిడి, బతుకమ్మ డ్యాన్సులు, ఆయుధ పూజలు హడావిడి అయింది కదా. దసరా కి మన నవరాత్రుల పూజలు హడావిడి కాకుండా, ఇపుడు ప్రతి కమ్యూనిటీ లో జరిగే బతకమ్మ వేడుకలు, ఇవే కాక కొంచెం నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్న చోట గర్భ డ్యాన్సులు, కోలాటం పది రోజులు సరదాగా ఉండే వాళ్ళకు తీరికే వుండదు. తమిళ వాళ్ళు అయితే బొమ్మల పేరంటాలు ఇలా హైదరాబాద్ అంతా ఒకటే హడావిడి, ట్రాఫిక్ జామ్ లు . ఇన్నీ పండుగలు మధ్య కొన్ని మన పండుగలు అసలు మర్చిపోతున్నాము. వినాయక చవితి పౌర్ణమి వెళ్ళాక వచ్చే ఉండ్రాళ్ళ తదియ, దసరా వెళ్ళాక వచ్చే అట్ల తదియ రెండు పండగలకు మా చిన్నతనం లో చాలా హడావిడి వుండేది. మా పిల్లలు చిన్నతనంలో మా అమ్మ గారు , మా అత్త గారు ఈ పండగలు రెండూ చేసే వారు . వాళ్ళు పెద్ద వాళ్లు అయ్యాక మేమూ మర్చిపోయాము . ఇంక ఇపుడు మా గ్రాండ్ చిల్డ్రన్ కి అయితే అసలు ఈ పండగలు అసలే తెలియవు. హిందీ సినిమాల పుణ్యమా అని అందరికీ
క ద్వా చోత్ అంటే బాగా అర్థం అవుతుంది. ఇంతకీ ఈ బాధ అంతా ఎందుకంటే ఉదయాన్నే వాట్సాప్ మెసేజ్ లో అట్లతదియ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఊయల లో ఊగుతున్న ఒక అమ్మాయి బొమ్మ ఎవరో పోస్ట్ చేశారు..ఆ పోస్ట్ చూసి అయ్యో తదియ అని మరచిపోయాను కనీసం ఒక పదకొండు అట్లు వేసి అమ్మ వారికి నైవేద్యము చేసినా బాగుండేది కదా అని దిగులు వేసింది. దోశలు పిండి రెడీ గా దొరుకుతుంది కదా దోశ కి బాధ ఏమిటి, అనుకోకండి .ఈ దోశ ల పిండి కూడా కొంచెము పులిసి ఆ అట్టు వేస్తే మధ్యలో అంతా చిల్లులు గా వుండాలి . ప్రతి పండుగ లాగానే ఈ పండుగ కు కూడా ముందు రోజు భోగి తలంటి పోసుకుని గోరింటాకు పెట్టుకోవాలి. ఈ రెండు పండగలకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి . మాతో పాటు మా అన్నయ్యలు కూడా సరదాగా ఒక వేలుకి , లేకపోతే అరచేతిలో చిన్న చందమామ లాగా పెట్టుకునే వాళ్ళు . మర్నాడు ఉదయం తెల్లవారు ఝామున లేచి అలంకరణ లు అయ్యాక, భోజనాలు, గోంగూర పచ్చడి, కంది పచ్చడి, ఇంకా మాకు ఇష్టమైన ఏదో ఒక వేపుడు తో భోజనాలు. ఏ పండుగ కయినా జడ కుప్పేలు వేసుకుని పూలు పెట్టుకుని తయారు అవాల్సిందే , ఆ చేమంతి పూల తో చికాకు గా ఉన్నా వద్దు అనటానికి వీలు లేదు . ఈ పండుగ ఆకర్షణ అంతా ఉయ్యాల ఊగడం లోనే వుంటుంది. మా తో పాటు అన్నయ్యలు కూడా ఆటలకు ఊయల ఊగటానికి రెడీ అయ్యే వాళ్ళు. తదియ వెన్నెల లో వెన్నెల ఆటలు ఆడుతూ , మద్యలో ఉయ్యాల లు ఊగుతూ.ఆ సరదాలు ఎప్పటికీ మరచి పోలేము అనిపిస్తుంది.
మా అత్తయ్య గారి ఇంట్లో అయితే పెద్ద వేప చెట్ల కు ఉయ్యాల కట్టించే వారు .ఆ ఉయ్యాల లో ఒక్కసారిగా ఊపితే పై దాకా వెళ్ళినప్పుడు ఒక్కొక్క సారి చాలా భయంగా కండ్లు తిరిగినట్లు అనిపించేది. అయినా సరే పళ్ళ బిగించి అల్లాగే ఊగుతూ
ఉంటే మనల్ని కవ్వించే అన్నయ్యలో, బావలో ఒక పెద్ద ఊపు ఊపితే వెంటనే ఒక పెద్ద కేక పెట్టడమో , వాళ్ళని ఊపే టప్పుడు మనం కూడా బలము ఉపయోగించి గట్టిగా ఊపటం చేసే వాళ్ళం. ఓటమి ఒప్పుకోకుండా ఎలాగో అలగా ఉయ్యాల లు ఉగాల్సిందే . అసలు ఈ పండుగ మజా అంతా ఆ ఉయ్యాల లే కదా. నాకు మాత్రం అంత ఉదయాన్నే లేవటం చికాకు అయినా తప్పించుకోవటానికి లేదు ఉండ్రాళ్ళ తదియకు కూడా పెళ్ళి అయిన తర్వాత ఏదో నోము పట్టించే వాళ్ళు . నేను పట్టా నో ,లేదో గుర్తు లేదు . మా అమ్మ గారు చాలా నోములు నా చేత చేయించింది. అట్లు తదియ నోము కూడా చేసినట్లు గుర్తు . పదకొండు మంది కి పదకొండు అట్లు వేసి వాయనం ఇస్తారు. ఆ పండుగ రోజున మాత్రం అట్లు బెల్లం వేసి తినమనే వాళ్ళు. పండుగ హుషారు ఒక్క దెబ్బ తో మాయం అయ్యేది ఆ బెల్లము చూడగానే. తీపి ఇష్టం వున్న వాళ్ళకి నచ్చుతుంది అనుకోండి. ఎన్నో పండుగలు చేసుకుంటూ వున్నాము కానీ ఈ రెండు పండగలు నిజానికి సరదాగా ఉంటాయి ఎందుకో జ్ఞాపకాల్లో తప్పితే ఎవరూ పెద్దగా చేయడం లేదు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళుకూడా. మీరు మీ బాల్యాన్ని గుర్తు చేసుకోండి.ఆ రోజులు గుర్తు కి వచ్చినప్పుడు ఈ మనిషి కయినా అపురూపమైన బాల్యం ఉండాలి అనిపిస్తుంది . అటువంటి బాల్య స్మృతులు మనకు అందించిన మన పెద్ద వాళ్ళకు నమస్కృతులతో.
Comments