మసాలా దోశ
- murthydeviv
- 2 days ago
- 3 min read
ఈ రోజే మా కజిన్ ఫోన్ చేసి మీ ఊరులో మీ స్కూల్ ఎదురుగా ఉన్న హోటల్ పెట్టి 100ఇయర్స్ అయిందట మేము అందరం అక్కడ వాళ్ళు పెట్టిన స్పెషల్ మసాలా దోశ తిని వచ్చాము అని చెప్పాడు. మాకు ఆ ఊరు వెళ్ళే పని లేకపోయినా మా కజిన్ కి అత్త గారి ఊరు ఏదో ఒక అకేషన్ లో వెళ్తూ నే వుంటాడు. వచ్చాక ఇలాంటి కొత్త కబుర్లు ఏమయినా ఉంటే చెప్తూ వుంటాడు. మన మనసుకు పని ఏముంటుంది, ఏదయినా కబుర్లు వినగానే రెక్కలు విప్పి అలా గతంలో కి వెళ్ళి పోతూ ఉంటుంది. మా ఊర్లో ఆ రోజుల్లో వున్న ఏకైక గర్ల్స్ హై స్కూల్, ఇపుడు కొత్త గా ఏమయినా వచ్చినవేమో తెలియదు, మా ఖాన్దాన్ అందరం ఆ స్కూలు లో నే ఆరోజుల్లో ఏస్ ఏస్ ఎల్ సి వరకూ చదివాము. స్కూల్ కి హోటల్ కీ ఏ సంబంధం అనుకుంటారేమో, స్కూలు లో పెద్ద క్లాసు లో వున్న మా అక్కలు, మా అత్తయ్య కూతుర్లో ఎదురుగా వున్న ఆ హోటల్ లో మసాలా దోశ లేక పూరి నో తెమ్మని మమ్మల్ని పంపేవాళ్ళు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాగా మేము తెచ్చినందుకు మాకు కూడా ఏదో టిఫిన్ ఫ్రీ అనమాట. ఇంటి నుండి ఒక బాక్స్ లో లంచ్ తెచ్చుకున్నా, ఆ టిఫిన్స్ తినడం ఇంటరెస్టింగ్ గా ఉంటుంది కదామేము కొంచెం పెద్ద క్లాసుల కు వచ్చాక మా జూనియర్ ను పంపే వాళ్ళం. నా కు మాత్రం ఆ హోటల్, పక్కనే ఉన్న చిన్న కిళ్ళీ. షాపు అలా గుర్తు ఉండి పోయా యి ఎప్పుడూ రేడియో లో పాటలు కూడా పెట్టే వారు ఆ హోటల్ లో , ఇప్పటికీ ఘంటసాల గారి పాటలు వింటూ ఉంటే ఆరోజులు గుర్తు వస్తాయి. అలా మసాలా దోశ అంటే ఇష్టం ఏర్పడింది. తర్వాత కాలేజ్ క్యాంటీన్ లో దోశ తెప్పించుకున్నా ఆ రుచి వుండేది కాదు .ఆ క్యాంటీన్ నడిపే మహానుభావుడు మా ఫ్రెండ్ కి మేన మామ, ఆ అమ్మాయి వినకుండా తిట్టుకునే వాళ్ళం. మా స్కూల్ ఎదురుగా వున్న హోటల్ బహుశా తమిళ సోదరుల దేమో ఆ రోజుల్లో అంత పరిజ్ఞానం వుండేది కాదు . కాలేజ్ క్యాంటీన్ వాడు నాన్ వెజ్ అయితే బాగా చేయించే వాడేమో, ఆ ఊర్లోనే ఒక మిలటరీ హోటల్ ఉంది కాలేజ్ క్యాంటీన్ వాడికి సైడ్ బిజినెస్. ఇంక అసలు దోశ కథ కి వద్దాము. అసలు ఈ దోశ అనేది మన తెలుగు వాళ్ళ ది కాదుట, మన వాళ్ళ కు అట్లు, పెసరట్టు, దిబ్బ రొట్టె మాత్రమే తెలుసు. ఇడ్లీ కన్నా ముందు ఆవిరి కుడుము అని వేసేవారు. కొంచెం జీలకర్ర వేసి మినప పిండి తో ఆవిరి మీద ఉడికించి పథ్యం గా కూడా పెట్టే వారు. మా ఊర్లో రోజూ ఉదయం, సాయంత్రం వేసే అట్లు చాలా ఫేమస్. అందులో కి వాళ్ళు చేసే సెనగ పిండి తో చేసే చట్నీ, పచ్చి మిర్చి కారం రెండూ చాలా రుచి గా ఉంటాయి. ఇపుడు ఈ చట్నీ ను బొంబాయి చట్నీ అంటున్నారు కదా మన ఆంధ్రులు కు ఏదైనా పేటెంట్ హక్కు పొందటం అంతగా తెలియదు అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళతో మమేకం అయ్యి ఉంటారు. ఏ పేరు అయితే ఏముంది రుచి మాత్రం బ్రహ్మాండము గా ఉంటుంది. మా ఇంటికి ఏ ఊరి నుండి బంధువులు వచ్చినా ఉదయం ఈ అట్లు బ్రేక్ఫాస్ట్ గా తెప్పించే వారు. సాయంత్రం వచ్చినా ఈ అట్లు భుజించి వెళ్ళే వారు. పెసరట్టు ఏం లె ఏ పెసరట్టు అని వేస్తారట , ఎపుడూ తిన లేదు ఇంకా పెసరట్టు ఉప్మా కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అయింది ఆ రెండూ కలిపి ఎపుడూ తినలేదు యు ఎస్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ బ్రేక్ ఫాస్ట్ కి పిలిచి చాలా అందం గా అలంకారం చేసి పెసరట్టు చేసేంది అప్పటినుండి పెసరట్టు అంటే కొంచె ప్రేమ ఏర్పడింది. మన దిబ్బ రొట్టె నే మన సోదరులు ఊతప్పం చేశారు. నేను మాత్రం ఎక్కడ అయినా మసాలా దోశ కే ఓటు వేస్తాను. మేము పంజాబ్ లో ఉండగా దోశ ఇడ్లీ కావాలి అంటే ఢిల్లీ గానీ చండీఘర్ గాని వెళ్ళాల్సిందే, కాఫీ కావాలన్నా ఇండియా కాఫీ హౌస్ కి వెళ్ళాల్సిందే. ఇపుడు ఏమయినా కొత్త హోటల్ వచ్చినవేమో. మేము వున్న వూరిలో ఎస్కార్ట్స్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ గారు తెలుగు వారు. ఆయన భార్య వారానికి ఒక సారి దోశ ల గెట్ టుగెదర్ పెట్టే వారు . మగ వాళ్ళు కార్డ్స్ తో బోర్ అనిపించినా దోశ ల మీద ప్రేమ కొద్దీ కలిసే వాళ్ళం. నిజానికి ఆవిడ దోశలు cచాలా బాగా చేసే వారు అందులో కూర, అల్లం చట్నీ ఓపికగా చేసే వారు ఇంక మేము హైదరాబాద్ కి వచ్చాక ఎక్కడ కి వెళ్ళినా నా ఓటు మసాలా దోశ కే. చిక్కడపల్లి మెయిన్ రోడ్ మీద సుధా హోటల్ , సుల్తాన్ బజార్ లో ఆనంద్ భవన్ లో చక్కటి వెజిటేబుల్ దోశ అని వుండేది . చాలా బాగుండేది. ఒకసారి ఆ సుల్తాన్ బజార్ వెళ్ళి ఆ హోటల్ ఉందా అని చూద్దాం ఆనుకుని , అమ్మో ఆ రష్ లోనా అని ఆగిపోతాను. ఒకసారి బొంబాయి లో దాస్ ప్రకాష్ వాళ్ళ హోటల్ కి వెళ్ళాము. అక్కడ అన్నీ సౌత్ ఇండియన్ వెరైటీ టిఫిన్స్ చిన్న సైజ్ లో సర్వ్ చేస్తాడు. వడ దోశ, ఇడ్లీ అన్నీ రకాలు ,ఆ సైజులు చూస్తే గాలివర్ ట్రావెల్స్ లొ లిల్లీపుట్స్ గుర్తు వస్తారు. ఇంకో సారి అప్పటి మద్రాస్ లో పిల్లలు మంచి ఆకలితో ఉన్నారని అదే దాస్ ప్రకాష్ లో క్విక్ లంచ్ అంటూ తీసుకుని వెళ్ళారు. అక్కడ కూడా అలా వరుసగా ఇడ్లీ వడ దోశ చిన్న సైజ్ లో కంటిన్యూ స్ గా సర్వ్ చేశాడు. ఇంక ఇప్పుడు రోడ్ సైడ్ వెలిసిన ఈ ఫుడ్ ట్రక్కు లో వేసే రకరకాల దోశ లు కనిపించిన ప్రతి వెజిటబుల్ , చీస్, పన్నీర్, ఒకటేమిటి అనేక రకాలుగా వేసి దాని మీద ఏదో పొడి, గ్రీన్ చట్నీ రెడ్ చట్నీ ఇన్ని రకాల పూసి కలగూర గంప లాగా చేస్తాడు. అక్కడికి పొరపాటున పిల్లలు తో వెళ్ళినా , దోశ మీద విరక్తి వస్తుంది. ఇడ్లీ అడిగితే, పొడి ఇడ్లీనా, కారం ఇడ్లీనా సాంబార్ తో నా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి.. ఇవేమీ వద్దు చల్లని కూల్ డ్రింక్ తాగడం హాయిగా ఉంటుంది. పిజ్జాలు వచ్చి మన దోశ ల ను ఇలా తయారు చేశాయి. మా ఊరి దోశ తోటి ఇన్ని కబుర్లు వచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా లోకల్ ఫుడ్ పెట్టే హోటల్ ఉంటే బాగుంటుంది. ఏ ఊరు వెళ్ళినా మెనూ కార్డు తెరవాలంటే భయం పన్నీర్ బట్టర్ మసాలా తో మొదలు అయ్యి పాలక్ పన్నీర్, మెంతి చమన్ తో ముగుస్తుంది. ఈ మధ్య గుంటూరు కి దగ్గర లో ఉన్న ఒక చిన్న పాటి టౌన్ లో కూడా ఇదే మెనూ. మన ఆంధ్రులు కు రాజధాని ఎటూ ఇంకా లేదు, తెలుగు వంటలు కూడా లేవా, అనుకుంటాను. ఆవకాయ గోంగూర తో అన్నం పెట్టే హోటల్ తెరిస్తే ఎలా ఉంటుందో అనుకుంటూ మరి గుడ్ నైట్.
Comments