నా లైబ్రరీ
- murthydeviv
- 3 days ago
- 4 min read
చిన్నపుడు ఎలా అలవాటు ఆయిందో తెలియదు, పుస్తకాలు చదవటం , పుస్తకాల పురుగు అనే వాళ్లు ఆ రోజుల్లో
చందమామ, బాల మిత్ర, తో మొదలు అయ్యి , అన్నయ్య తో డిటెక్టివ్ నవలలు అలవాటు అయ్యాయి.. డైరెక్ట్ గా ఎవరము చదివే వాళ్ళము కాదు . క్లాసు పుస్తకాలు లో పెట్టుకుని మూల గా వున్న రేడియో
గది మా రీడింగ్ రూమ్ . మధ్యలో మార్కులు సరిగ్గా రాకుండా పొతే నాన్న గారి చేత చివాట్లు .
ఉండేవి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లు మన వేషాలు పెద్ద వాళ్లకి తెలియవా .
అరోజుల్లో డిటేక్టివ్ లు సీరియల్స్ లాగా నెలకో , వారానికో ఒక పుస్తకం వచ్చేది. చండి రాణి అనే ఒక పుస్తకం గుర్తు
డిటేక్టివ్ యుఘంధర్ , అసిస్టెంట్ రాజు . సరే ఇక ప్రభలు, పత్రికలు చదవటమే పని. కొంచెం కాలేజీ కి వచ్చాక
యువ, జ్యోతి , నవలలు, మధ్యలో శరత్ బాబు, రవింద్ర నాథ్ గారి పుస్తకాలు.
ఆ సీరియల్ పిచ్చి ఎంత గా ఉండేది అంటే ఆ ప్రభల్లో పత్రికలు లో వచ్చిన సీరియల్స్ అన్నీ బై oడింగ్
చేయించి వుంచాను.
మీనా సీరియల్ యువ లో వచ్చినప్పుడు మేము పంజాబ్ లో వున్నాము . ఇంజినీరింగ్ కాలేజీ లో ప్రొఫసెర్
గారిభార్య ఆ పుస్తకాలు అన్నీ తెప్పించే వారు.
అయన కార్డ్స్ అవీ ఆడరు, అక్కడ కూడా పరమ షోత్రియం గా వుండే వారు . వాళ్ళింట్లో సిగరెట్ కూడా నిషేధం.
మా వారి కి వాళ్ళింటికి వెళ్లి సెలవు రోజు కార్డ్స్ లేకుండా టైమ్ వేస్ట్ చేసుకోవటం ఇష్టం ఉండేది కాదు.
ఇంక నేనే ఎస్కార్ట్స్ మేనేజర్ గారి అమ్మాయితో కలిసి వెళ్లి ఆ పుస్తకాలు తెచ్చుకునేదాన్ని. ఆవిడకు హిందీ రాదు,
మేము ఇద్దరం ఆవిడకు హిందీ నేర్పుతూ ఉండేవాళ్ళము .
ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది . ఇంతకీ ఈ రోజు ఈ లైబ్రరీ మేటర్ ఎందుకంటే , కాసేపు ఏదయినా లైట్ గా
చదువుదాం అని అలమర తెరిచాను. ముళ్లపూడి గారి కోతి కొమ్మచ్చి ఒకటే కనిపించింది
అయ్యో అనుకుంటూ ఎవరికిచ్చానా అని గుర్తు చేసుకుని అయన కి ఒక ఫోన్ కొట్టి పుస్తకం వెన్నక్కి ఇవ్వ వయ్యా బాబు అని రిమైండ్ చేశాను.
ఈ సెల్ ఫోన్ మాయం చేసిన వాటిల్లో ఈ బుక్ రీడింగ్ కూడా ఒకటి , రాత్రి పూట మ్యూజిక్ వింటూ ఏదో పుస్తకం
చదివే అలవాటు మెల్లగా మాయం అయిపోయింది.
ఆ సెల్ ఫోన్ జీవ నా ధా రం లా గా అయిపోయింది.. అలమర తెరిచా కదా అని ఏదో ఒక పుస్తకం తీద్దాము
అనుకుంటూ చూస్తే విశ్వనాధ గారివి ఏమేస్కో పాకెట్ బుక్స్ లో వరుసగా కనిపించాయి.
మా పెళ్లి అయిన కొత్తల్లో మా వారు నా పుస్తకాల పిచ్చి చూసి ఇంటింటా స్వంత గ్రంధా లయం కి కట్టారు
నేను సెలెక్ట్ చేసిన పుస్తకాలు తో పాటు విశ్వనాధ గారి వీ తెప్పించారు .
అప్పుడు చదివానో లేదో తెలియదు కానీ , ఒక ఐదు ఆరు ఏళ్ల క్రితం మా కజిన్ సిస్టర్ ప్రోధబ్లమ్ తో వేయి పడగలు
మొదలు పెట్టి ఒక సంవత్సరం లో పూర్తి చేశాను. సరే
రోజు ఏక వీర తీసాను చదువుదాం అని, పర్వాలేదు
కొంచెం వడిగానే చదవుతున్నాను
పుస్తకాలు వున్న అలమర తెరిస్తే టైమ్ ఎలా గడస్తుందో కూడా తెలియదు. ఆ పుస్తకాలు చూస్తూ ఉంటే ఏదో
పసి పాపలను చూసిన ఫీలింగ్ వస్తుంది.
ఆ రోజుల్లో ఏమిస్కో ప్యాకెట్ బుక్ ఒకటి రెండు రూపాయలు . అప్పుడు 50 రూపాయలు కి ఎన్నో పుస్తకాలు
నేను ముఖ్యంగా కొనుక్కున్నవి యద్దన పూడి గారి ఆరాధన, స్వీట్ హోమ్ రంగనాయకమ్మ , కొమ్మూరి గారి
హౌస్ సర్జన్ , ఇంకా నా ఫేవరెట్ ముళ్లపూడి గారి రాధా గోపాలం, రుణానంద లహరి .
ఇవి కాక ఏటి ఒడ్డున నీటి పూలు , ఎవరు రాసారో గుర్తు లేదు, అవసరాల వారి అదీ ప్రశ్న ఇది జవాబు ,
గొల్లపూడి గారి వెన్నెల కాటేసింది . ఈ మూడు కధలు గుర్తు వున్నాయి కానీ బుక్స్ మాత్రం మిస్ అయ్యాయి..
మరలా కొందామని ట్రై చేశాను కానీ దొరక లేదు. యువ దీపావళి సంచిక కూడా మంచి కథలతో ఎంతో బాగుండేది.
అందులో కొన్ని కధలు కూడా ఆలా గుర్తు ఉండి పోయాయి. కొన్ని రోజులు ఆ సంచికలు కూడా ఉండేవి.
తర్వాత మిస్ అయిపోయాయి.
హైదరాబాద్ వచ్చాక పిల్లలు స్కూలు కి వెళ్లి పోయాక మరలా నా పుస్తక పఠనం మొదలు అయింది.
గ్రాడ్యుయేషన్ అయ్యాక ఏదో కొద్దీ రోజులు చేసిన ఉద్యోగం వలన కొత్త స్నేహితులు , వాళ్ళ వలన
ఇంగ్లీష్ లో క్లాసిక్ బుక్స్ చదవటం అలవాటు అయింది.
హైదరాబాద్ లో శాంతి థియేటర్ , నారాయణ గూడా దగ్గర ఒక పుస్తకాలు షాపు ఉండేది. అక్కడ శరత్ చంద్ర ,
రవీంద్ర నాథ్ ఠాగూర్ గారి పుస్తకాలు చాలా కొన్నాను.
అరోజుల్లో పుస్తకాలు ఇప్పటితో పోలిస్తే చాలా చవక గా ఉండేవి. అబిడ్స్ లో ఏ. ఏ హుస్సేన్ & కో
అనే పుస్తకాలు షాపు ఉండేది.
అక్కడ చాలా ఇంగ్లీష్ నవలలు కొనుక్కుని చిన్న లైబ్రరీ బీరువా పెట్టు కున్నాను . ఏ ఇల్లు మారినా
నా పుస్తకాలు జాగ్రత్తగా సర్దుకుని పేర్చుకుంటా ను.
నిన్న పుస్తకాలు లో పిలకా గణపతి శాస్త్రి గారి కాశ్మీర్ చరిత్ర కధలు కూడా ఏమస్కో బుక్ కనిపించింది.
ఆ పుస్తకం అపుడు చదివే వుంటాను. 2011 లోనో ఎప్పుడో నా ఫ్రైండ్ కలకత్తా నుండీ వచ్చి ఏవో
పుస్తకాలు కావాలి ఆంటే తెలిసిన బుక్ షాపు కి వెళ్ళాము .
కొత్తగా మరలా ఏమేస్కో వాళ్ళే ప్ పబ్లిష్ చేసిన గణపతి శాస్త్రి గారి విశాల నేత్రాలు , ఇంకా హేమ పాత్ర
అశోక వర్ధనుడు అనే పుస్తకాలు చూపిస్తే కొన్నాను. నేను విశాల నేత్రాలు విప్ర నారాయణ అనుకున్నాను
.
కానీ హేమ పాత్ర విప్ర నారాయణ కథ . కథ లో నాయిక బృందా వనము వెళ్లినట్లు రాశారు.
అయన ఆల్వార్ అయిన కథ ఆందరికీ తెలిసిందే కదా.
అయితే ఏమేస్కో వారు అప్పుదు కూడా ఆ పుస్తకాలు ధర వంద రూపాయలు లోపే పెట్టారు.
పుస్తకాలు కూడా మంచి పేపర్ తో , బొమ్మల కవర్ తో బావున్నాయి.
గణపతి శాస్త్రి గారు పత్రిక లో మహా భారతం రాసారు . అప్పుడు మేము చిన్న పిల్లలము అయినా
మా బామ్మ గారికి ఆదివారం పత్రికలో వచ్చే భారతం చదవటం మా డ్యూటీ.
అప్పట్లో అయన రాసారు అని తెలియదు. ఏమేస్కో పోకెట్ పుస్తకాలు లో ప్రాచీన గాధ లహరి
అనే బుక్స్ లో కాశ్మిర పట్ట మహిషి ఉండేది. విశాల నేత్రాలు ఆంధ్ర పత్రిక లో చదివాను.
ఆ కథ సినిమా గా కూడా తీస్తారు అనుకున్నారు. అసలు కథ ఏమిటంటే అయన కల్హ్ ణు డు
రచించిన రాజ తరంగిణి కోసమే సంస్కృతం నేర్చుకున్నారుట.
మొదట అయన కు ఈ కధలు గురించి చెప్పింది శివలెంక శంభు ప్రసాద్ గారుట , ఆలా ఆంధ్ర పత్రిక లో
కొన్ని కధలు , కొన్ని కధ లు ఆంధ్ర ప్రభ లో ప్రచురించారు ట.
ఏమేస్కో లో కాశ్మీర పట్ట మహిషి , చైత్ర పూర్ణిమ ఈ రెండూ నా దగ్గర వున్నాయి. మొన్న ఏకవీర తో ఈ
పుస్తకం కూడా తీసాను .
శాస్త్రి గారు కలహాణుడి గురించి చాలా గొప్పగా ముందు మాట లో వ్రాసారు. మొదట కవితా మాధురి,
జన్మ భూమి యందు ప్రగాఢ భక్తి , చెక్కు చెదరని నిషపక్ష పాత వైఖరి.
అలాంటి మహానుభావులు వున్న కాశ్మీర్ ని మనం ఇప్పుడు ఎలాంటి స్థి తి లో చూస్తున్నాము అనే బాధ.
విశ్వనాధ గారి భ్రమర గీతం అనే పుస్తకం గురించి కూడా మా అక్కయ్య చెప్పింది. అదీ కూడా
అమ్మవారి గురించిట. ఆ పుస్తకం నా దగ్గర లేదు, కొందామంటే ఇప్పుడు అయన పుస్తకాలు ఒకే
సెట్ లాగా అమ్ముతున్నారు ట, విశ్వనాధ గారివి చాలా పుస్తకాలు వున్నాయి. ఇంకా సెట్ ఏమీ కొంటాము.
ఆధ్యాత్మిక పుస్తకాలు అయితే గీతా ప్రెస్ వారికే ఫస్ట్ ప్రైజ్ , చక్కటి పేపర్, ఆ దేవుడి ఫోటోలు ఎక్కడ
నుంచీ తెప్పిస్తారో కానీ నభూతో న భవిష్యతి..
ఇందాక గణపతి శాస్త్రి గారు సంస్కృతం నేర్చుకున్నట్లే మా తాత గారు హిందీ, నేర్చుకుని కళ్యాణ్ అనే
పుస్తకం తెప్పించుకునే వారుట . ఆ పుస్తకాలు అయన గుర్తుగా బౌండ్ చేయించి చాలా రోజులు దాచాను.
ఆ రోజుల్లో ఫోటోలు ఫ్రేమ్ లు కట్టించి గోడ కు ఉండేవి కదా. చిన్న, చిన్న దేవుడి ఫోటోలు వున్న
ఒక పెద్ద ఫ్రేమ్ ఒకటి తాతగారు కూర్చునే హాల్ లో ఉండేది.
అందులో ఒకటి మర్రి ఆకుపై బొటన వేలు నోటిలో పెట్టుకున్న కృష్ణుడు , శివుని గంగా అవతరణ,
ఆలా కొన్ని ఫోటోలు గుర్తు ఉండి పోయాయి.
గీతా ప్రెస్ వాళ్ళది పోతన భాగవత మధురిమలు చక్కటి పుస్తకం. అందులో ముఖ్యమైన భాగవత
కథలు పద్యాలు, అర్థం తో ఉంటాయి.
గజేంద్ర మో క్ష ము, రుక్మిణి కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర , మొత్తం భాగవతం లో ముఖ్యమైన
ఘట్టా లతో పారాయణ కి అనువుగా వుంటుంది.
శంకర గ్రంధ రత్నవళి అని ఆది శంకరా చార్యుల వారి పుస్తకాలు సాధన గ్రంధ మండలి అని తెనాలి
వారు వేశారు . అవీ ఆ రోజుల్లో చాలా తక్కువ ధరకే దొరికేవి.
వాటి గురించి ఇంకొక సారి కబుర్లు చెప్పుకుందాం.
నా లైబ్రరీ చూస్తే మాత్రం మన జీవన యానం లాగా వుంటుంది.
చందమామ దగ్గర నుండీ శంకర విజయము, గీతా మకరందం దాకా.
. అన్నట్లు చందమామ పాత బుక్స్ కూడా బౌండ్ చేసిన వీ వున్నాయి .
శుభరాత్రి
అవునా మంచి నవల అనా టి. ఆడ పిల్లల పరిస్థితి లకు. అద్దం
పట్టిన. నవల
ఏటి ఒడ్డున నీటిపూలు అరవైల్లో ఆంధ్రప్రభలో (ఉగాది నవలలపోటులో బహుమతిపొందిన) నవలగా వచ్చింది. ఆనవలా రచయిత్రి చెరుకూరి రమామణి అని గుర్తు