రా చిప్ప కధ
- murthydeviv
- 2 days ago
- 2 min read
ఈ రోజు ఎవరో పేస్ బుక్ లో ఒక రాచిప్ప ఫోటో పెట్టి
ఇదేమిటో తెలుసా అంటూ క్విజ్ ప్రశ్న వేశారు.
చాలా మంది చూసి ఉండరు అనుకోండి.
మా ఇంట్లో మాత్రం మా అత్తగారి ఆస్తి లో భాగంగా వచ్చి మా అటక మీద చేరింది.
మా అత్తగారు , మామ గారు పల్లెటూరు నుండీ హైదరాబాద్ మా దగ్గరికి వచ్చేటపుడు ఎన్నో సామానులతో వచ్చారు.
వాటితో అంత అవసరం ఉండదు అని మా బావగారు, మావారు చెప్తున్నా
ఆవిడ మాత్రం అవ్వన్నీ పట్టుకొచ్చారు.
అందులో కంచు గిన్నె, మానేడు తప్పాల, అడ్డెడు తప్పాల ,రెండు రాచ్చిప్పలు,
కుంభకోణం కంచు గిన్నె అని ఏవో చాలా లిస్ట్ ఉండేది.
అన్నీ తెచ్చినా ఒకటి రెండు సార్లు మానేడు తప్పలా తో అన్నం వండారు కానీ
గ్యాస్ చాలా ఖర్చు అవుతుందని గ్రహించి కుక్కర్ వాడటం నేర్చుకున్నారు.
ఎలా చేసినా రాచిప్ప లో చేసిన పప్పు,పులుసుల రుచి రావటం లేదు
అని మా మామ గారు వంక పెడుతూ వుండే వారు.
మేము వాళ్ళు
పల్లెటూరు లో వున్నప్పుడు రెండు మూడు సార్లు వెళ్ళాము. పొయ్యి మీద రాచిప్ప లో వండే
గోంగూర పులుసు, పప్పు పులుసు వాటి రుచి అమోఘం గా ఉండేది.
ఎండా కాలం లో కూడా వాటిల్లో వండినవి మర్నాటికి కూడా ఫ్రెష్ గా ఉండేవి.
మా మరుదులు ఉదయం చద్ది అన్నములో కూడా అవీ వేసుకునేవారు
అసలు హంగామా అంతా ఆ తర్వాత మొదలు అయ్యింది , ఆ గిన్నెలు అన్నీ వాడటం లేదు
అని అటక మీద సర్దించాను.
ఏ పండగ ముందు అయినా స్టోర్ రూమ్ గాని అటక గాని సర్దుతున్నట్లు
కనిపించినా ఇంక హల్లో నే కూర్చుని ఆ సామాను అంతా లెక్క చూసే వారు.
పని వాళ్లకు, మనవరాళ్లకు, మనవడికి అవీ ఎలా కొన్నారో, ఎపుడు కొన్నారో
ఆ చరిత్ర అంతా చెప్తూ వుండే వారు.
ఆ పెద్ద గిన్నెలు మధ్య రెండు చిన్న ముద్దుగా వున్న రెండు కంచు గిన్నెలు ఉండేవి.
అవీ మీ ఆమ్మవి రా, వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందిట అని వాటి చరిత్ర చెప్పేవారు.
ఎపుడు కిందకి దించినా వాటిని చింత పండు తో తెల్లగా తోమి
ఆవిడకు లెక్క చూపించి మరలా పైకి చేర్చే వాళ్ళము.
ఇప్పుడు ఆవిడ పైకి వెళ్లిపోయారు.
బామ్మగారి గుర్తుగా కొన్ని గిన్నెలు తీసుకోమంటే మా అమ్మాయిలు వద్దు అన్నారు.
మా ఆబ్బాయి మాత్రం వాళ్ళ బామ్మ గారి గుర్తు గా ఆ తప్పలా లు అన్నీ
డ్రాయింగ్ రూమ్ ముందు ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టాడు.
పదిహేను రోజులకు ఒకసారి వాటిని తెల్లగా తోమి పెట్టటం ఒక పని.
అవి కొంచెం నల్లగా అవగానే మా వాడికి వెంటనే బామ్మ గుర్తు వస్తుంది.
రాచ్చిప్ప కూడా హల్లో పెట్టి నీళ్లు వేసి పూలు వేయమంటాడు కానీ
ఒక వేళ పొరపాటున పనివాళ్ళు చేతిలో ఏదయినా అవుతే
ఆమ్మో ఆ రాచిప్ప అటక మీద సేఫ్ అని నేను డిసైడ్ అయిపోయాను.
నా మనవరాలు కొత్త ఐడియా ఇచ్చింది. ఫ్లవర్ వాజ్ లాగా ఒక మూల
పెట్టవచ్చు అని ,కొత్త ఐడియా బాగానే వుంది.
తనతో పాటు వచ్చినవన్నీ కిందికి దిగితే తను ఒక్కతే పైన
అనామకం గా పడి వుంటే ఏం బాగుంటుంది. అనుకుందేమో ఆ రా చిప్ప
మా అత్త గారు ఈ ఐడియా ఇచ్చిందేమో ముది మనవరాలుకు
ట్రై చేయాలి.
Comments