శివరాత్రి
- murthydeviv
- 2 hours ago
- 3 min read
శివరాత్రి అనగానే ఎన్నో జ్ఞాపకాలు ఆలా తరుముకుంటూ వస్తాయి. అన్నీ పండగ లాగా ఈ పండుగ కీ పిండివంటలు
హడావిడి ఉండదు కదా ఉపవాసం ఉండాలి అనే ఉత్సహం చిన్నప్పుడు చాలా ఉండేది.
పిల్లలు మీరు ఏమీ ఉంటారులే వద్దు లే అని అమ్మ గారు అంటే మేము మా చిన్న నాయనమ్మ దగ్గర చేరే వాళ్ళము.
వున్నంత సేపు ఉంటారులే అని మమ్మల్ని మామ్మ గారు బాగానే సపోర్ట్ చేసే వారు.
మామ్మ తో గుడికి వెళ్లడం చాలా సరదాగా గా ఉండేది.
ఆ రోజుల్లో మట్టి ప్రమిదలు మడికి పనికి వచ్చేవి కాదు . అందుకని కొబ్బరి చిప్పలు తీసుకొని వెళ్ళేవాళ్ళము.
శివరాత్రి రోజూ మూడు వందల అరవై వత్తులు వెలిగిస్తే ఏడాది అంతా దీపారాధన చేసిన ఫలం వస్తుందని
అన్నీ వత్తులు ఆ నెల అంతా చేసిపెట్టుకుని అవీ లెక్క పెట్టి నేతిలో తడిపి పెట్టే వారు.
ఇప్పటి లాగా వత్తులు కొనటం కాదు. మొన్న కార్తీకమాసం లో మా అమ్మాయి ఇంటి దగ్గర గుడికి వెళ్ళితే
అక్కడ వత్తులు నెయ్యి లో తడిపి రెడీ మేడ్ గా వెలిగించే టట్లు అమ్ముతున్నారు, ఒక అగ్గిపెట్టె తో సహా
ఆహా అన్నీ ఎంత ఈజీ అయిపోయింది అనుకున్నాను.
కానీ మా అత్తగారు, బామ్మ గారి లాంటి వాళ్లకు మాత్రం అవీ మడికి పనికి రావు అనే వాళ్ళు.
ఆ కొబ్బరి చిప్పలు, ఇంకా గుడికి తీసుకుని వెళ్ళే సరంజమా అంతా సర్ది , ఇవే కాకుండా
ఒక సంచిలో బియ్యం వేసుకుని గుడికి బయలు దేరే వాళ్ళము.
ఆ బియ్యము గుడి దగ్గర బిచ్చగాళ్లకు మా చేత వేయించేవారు. గుడిలో చక్కగా ముగ్గులు వేసి
ఆ కొబ్బరి చిప్ప కింద ఆకు గాని ఏమయినా వేసి అందులో ఆ వత్తులు వెలిగించాలి.
చుట్టూ పూలు అవీ పెట్టి పూజ చేస్తే చాలా అందముగా ఉండేది. మాకు కూడా ఏదో గొప్ప
పని చేసిన భావం కలిగేది.
ఇంటికి వచ్చాక మాకు పాలు పండ్లు అన్నం తిన్నదానికన్నా ఎక్కువగా ఏవో తింటూనే ఉండేవాళ్ళము.
నాన్న గారి అభిషేకం అయ్యాక భోజనాలు చేసే వాళ్లము. జాగరణ చేసినట్టులు నాకు అంతగా గుర్తు లేదు.
చదువుకునే రోజుల్లో పరీక్షలు ముందు వచ్చేది శివ రాత్రి ఇంక అప్పుడు ఇవ్వన్నీ చేసిన గుర్తు లేదు.
నాన్న గారు అభిషేకం మాత్రం తప్పకుండా చేసే వారు. అప్పుడు మాత్రం మంత్రపుష్పం, హారతి కీ
తప్పకుండా వెళ్లి నిల బడాలి.
శివరాత్రి కీ మా మేనత్త గారింట్లో అభిషేకం చేసాక జాగరణ కోసం హరి కధలు అవీ చెప్పే వారు
అని అమ్మ ఎపుడూ చెప్పేది. నా కు ఒకసారి మార్కండేయడి కథ చెప్పటం విన్నట్లు లీల గా గుర్తు.
కానీ మా మేనత్త గారు ఆ పార్వతి పరమేశ్వర ల మీద చాలా పాటలు రాశారు. ఆ పాటలు ఇప్పుడు
పాడుతూ ఉంటే చాలా భక్తి భావం కలుగుతుంది.
ఆ రోజుల్లో అంత సంసారం నిర్వహించుకుంటూ అంత భక్తి గా ఎలా రాయ గలిగారో అని విస్మయం
కలుగుతుంది.. మా పెద్దమ్మ గారు కూడా అమ్మవారి మీద, శంకరుడి మీద చాలా పాటలు వ్రాసారు
మా తాత గారు కార్తీకమాసం లో అభిషేకాలు వన సమారాధన లు, పార్వతి కళ్యాణం చేసే వారుట
అక్కడ మా అత్తయ్య లు అందరూ హరతి పాటలు పాడే వారుట.
ఇప్పటి లాగా కేటరింగ్ కాదుకదా. ఆ తోటల్లోనే వంటలు చేసి భోజనాలు చాపలు అవీ పరిచి వడ్డించేవారు.
శివరాత్రికి కోటప్పకొండ తి ర నా ళ్లు చాలా గొప్పగా చెప్పుకునే వారు . ఆ రోజుల్లో కొండ మీదికి రోడ్డు కూడా ఉండేది కాదుట
మా పెద్ద అన్నయ్య మా మేనత్త కొడుకులు ప్రతి శివ రాత్రికి వెళ్ళే వాళ్ళు. అన్నీ పల్లెటూర్ల న్ నుండీ ఎడ్ల బండి మీద
ప్రభలు కట్టుకుని వచ్చే వారుట. అందరూ నడుచుకుంటూ వెళ్ళే వారు అనుకుంటా.
మేము ఒక ఐదు ఏళ్ల క్రితం వెళ్ళాము. రోడ్డు వేశారు కారు లో పై దాకా వెళ్ళ వచ్చు, కానీ మెయిన్ గుడి దగ్గరకు
కొన్ని మెట్లు ఎక్కాలి. ఆ మెట్లు కూడా చాలా ఎత్తుగా వున్నాయి.
అంత దాకా వెళ్ళాము కదా అని ఎక్కి వెళ్ళాము. కోటప్పకొండ కీ చిన్న తనం లో ప్రభలు కట్టిన బండ్లు మీద
మా వారు కూడా వెళ్ళే వారుట. మా పొలాలు వున్న వూరికి కోటప్పకొండ చాలా దగ్గర.
అక్కడ శివుడు దక్షిణా మూర్తి స్వరూపము అని ప్రవచనాలు లో విన్నాను.
మా అమ్మమ్మ గారి ఊరు నరసరావుపేట కీ చాలా దగ్గర కానీ ఆరోజుల్లో రోడ్డు లేకపోతే పోవటం వలన
పెద్ద వాళ్ళు వెళ్ళలేక పోయేవారు.
ఆ రోజుల్లో నే మా పెద్దమ్మ గారి అమ్మాయి అక్కడ గుడిలో మూడు రోజులు ఉండి ప్రదక్షిణాలు
చేసినట్లు చెప్పింది.
అక్కయ్య చాలా అధ్యాత్మికం గా ఉండేది. ఆ క్షేత్రం చాలా మహిమ గల ప్రదేశం అని చెప్పేది.
ఇప్పుడు అక్కడ అన్నీ వసతులు వున్నాయి.
మరి ఆరోజుల్లో వాళ్ళు అక్కడ ఎలా వున్నారో తెలియదు. బహుశా కొండ కింద ఏమయినా
సత్రాలు వుండేవేమో.
అప్పట్లో యాత్రలు చేసే వాళ్ళు భక్తి తో చేసే వారు, ఇప్పటిలాగా విహార యాత్ర లాగా కాదు కదా.
శివ రాత్రికి తెలంగాణ లో కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తారు.
ఈ రోజు పనివాళ్ళు కూడా టీ కూడా తాగకుండా ఉపవాసం ఉండి తప్పకుండా గుడికి వెళ్లి
రాత్రికి ఏవో పండ్లు తింటారు.
జాగరణ కూడా చేస్తారు.
మా పిల్లలు చిన్న తనము లో హుషారుగా ఉపవాసం మొదలుపెట్టి సాయంత్రం కీ నీరస పడి
ఏదో టిఫిన్ తినే వాళ్ళు.
అభిషేకం అయ్యాక టీ వి లో వచ్చే సినిమాలు కాకుండా వీడియో లు, చూస్తూ ఏ
తెల్లవారు జాముకో పడుకునే వారు.
నాకు అయితే జాగరణ చేసే ఓపిక చదువుకునే రోజుల్లో ఉండేది కానీ
గృహిణి ని అయ్యాక అభిషేకం అవటం తో ఫల హారం చేసి నిద్ర పోవటమే.
మా చిన్న తనము లో ఈ టీ వి లు సెల్ ఫోన్లు లేవు కదా జాయింట్ ఫ్యామిలీ లు
కాబట్టి అందరమూ ఏదయినా ఆటలు ఆడటము, కబుర్లు చెప్పుకోవటం
ఉండేది.
ఆ రోజుల్లో సెకండ్ షో సినిమాలు చూడటానికి అన్నయ్యలకు కూడా పెర్మిషన్
ఉండేది కాదు.
శివ రాత్రికి చలి శివ శివా అని వెళ్ళిపోతుంది ఆ ని బామ్మ గారు చెప్పే వారు.
చలి వెళ్లి పరీక్షల చలి మొదలు అయ్యేది. మన పరీక్షలు తర్వాత మన పిల్లలు
ఇప్పుడు మన గ్రాండ్ కిడ్స్ , మొన్న మా అబ్బాయి నా మనవరాలు ని పూజ టైమ్ లో
రమ్మంటే నాకు మాథ్స్ ఎగ్జామ్ అంటూ నసుగుతూ వచ్చింది .
జీవితం అంటేనే చక్ర భ్రమణం , ఇంతే కదా శివా మహా దేవా
మా పెద్దమ్మ గారు అత్తయ్య వాళ్ళ పాటలు ఇంకోసారి కబుర్లు చెప్పుకుందాం


Comments